డీపీఐ దూకుడుకి కళ్లెం వేసిన డీఎంకే..!

ABN , First Publish Date - 2020-10-24T15:02:23+05:30 IST

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లడుగుతున్న దళిత పాంథర్స్‌ ఆఫ్‌ ఇండియా (డీపీఐ)కు చెక్‌ పెట్టేలా 4+4 ఫార్ములాతో నియోజకవర్గాలు కేటాయించాలని డీఎంకే అధిష్ఠానం కళ్లెం వేసినట్టు సమాచారం. ఆ నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో ఆ పార్టీ ప్రత్యేక గుర్తు, మిగిలిన నాలుగు స్థానాల్లో డీఎంకే గుర్తుపై పోటీ

డీపీఐ దూకుడుకి కళ్లెం వేసిన డీఎంకే..!

చెన్నై : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లడుగుతున్న దళిత పాంథర్స్‌ ఆఫ్‌ ఇండియా (డీపీఐ)కు చెక్‌ పెట్టేలా 4+4 ఫార్ములాతో నియోజకవర్గాలు కేటాయించాలని డీఎంకే అధిష్ఠానం కళ్లెం వేసినట్టు సమాచారం. ఆ నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో ఆ పార్టీ ప్రత్యేక గుర్తు, మిగిలిన నాలుగు స్థానాల్లో డీఎంకే గుర్తుపై పోటీ చేయాలనే నిబంధన విధించినట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలోని డీపీఐ... చిదంబరం, విల్లుపురం నియోజకవర్గాల్లో పోటీచేసింది. విల్లుపురంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ డీఎంకే చిహ్నం ‘ఉదయించే సూర్యుడు’ గుర్తుపై పోటీచేసి విజయం సాధించారు. అయితే, చిదంబరంలో కుండ గుర్తుపై పోటీ చేసిన డీపీఐ అధ్యక్షుడు తిరుమావళవన్‌  తక్కువ ఓట్ల తేడాతో  గట్టెక్కారు. ఒక లోక్‌సభ నియోజకవర్గానికి నాలుగు శాసనసభ నియోజకవర్గాలు అన్న లెక్కన డీపీఐ గెలిచిన రెండు ఎంపీ నియోజకవర్గాలకు ఈ సారి ఆ పార్టీకి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించాలని డీఎంకే అధిష్ఠాం నిర్ణయించింది. ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో ప్రత్యేక గుర్తుతో, మిగిలిన నాలుగు స్థానాల్లో డీఎంకే గుర్తుతో పోటీచేయాలనే నిబంధన విధించింది. ప్రత్యేక గుర్తుతో పోటీచేసిన నాలుగు స్థానాల్లో డీపీఐ ఓటమి పాలైనా, మిగిలిన నాలుగు స్థానాల్లో ఉదయించే సూర్యడు గుర్తుపై పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్ధులు గెలుస్తారని డీఎంకే సముదాయిస్తోంది. 


దీంతో, సొంత చిహ్నంతో డీపీఐ పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా సగం, సగం అన్నవిధంగా డీఎంకే వ్యవహరిస్తోంది. అదే సమయంలో, అన్నాడీఎంకే కూటమి నుంచి పీఎంకే తప్పుకుంటే ఒంటిరిగా పోటీచేసే పరిస్థితి ఏర్పడితే డీఎంకే లెక్క మారే అవకాశముంటుందని సమాచారం. అంటే, డీపీఐకి 8 నియోజకవర్గాలు లభించే అవకాశం లేకపోగా, అందులో సగం కేటాయించే అవకాశముంది. వాటిలో కూడా డీఎంకే చిహ్నంతోనే పోటీ చేయాల్సి ఉంటుంది. అందుకు నిరాకరిస్తే డీపీఐని కూటమి నుంచి బయటకు పంపేందుకు డీఎంకే వెనుకడుగు వేయదని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ విషయమై డీఎంకే సీనియర్‌  నేత మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల్లో ఉదయించే సూర్యుడు గుర్తుతో డీపీఐకి చెందిన రవికుమార్‌ గెలుపొందారని, ఆయన ఎంపీ నియోజకవర్గ పరిధిలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో డీఎంకే చిహ్నంతో అభ్యర్థులు పోటీచేస్తారని, వారు డీఎంకే ఎమ్మెల్యేలుగా కొనసాగుతారన్నారు. తిరుమాళవన్‌ గెలుపొందిన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నాలుగు నియో జకవర్గాల్లో ప్రత్యేక గుర్తుతో పోటీచేయవచ్చని, అదీ కూడా ఆ పార్టీ చిహ్నంతో ఉండవని, ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో గుర్తుతో పోటీచేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. అలాంటి పరిస్థితులు ఏర్పడితే కూటమిలో కొనసాగి ప్రత్యేక గుర్తులతో పోటీ చేసేందుకు డీపీఐ అంగీకరిస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

Updated Date - 2020-10-24T15:02:23+05:30 IST