‘పుల్లారెడ్డి’ మనవడిపై వరకట్న వేధింపుల కేసు!

ABN , First Publish Date - 2022-05-15T09:05:03+05:30 IST

పుల్లారెడ్డి స్వీట్స్‌ అధినేత, దివంగత పుల్లారెడ్డి మనవడు ఏకనాథ్‌రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది.

‘పుల్లారెడ్డి’ మనవడిపై వరకట్న వేధింపుల కేసు!

  • తల్లిదండ్రులపైనా ఎఫ్‌ఐఆర్‌.. 
  • కోడలు ఇంట్లోంచి బయటకు రాకుండా గోడ కట్టించిన వైనం
  • పంజాగుట్ట పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు


పంజాగుట్ట, మే 14 (ఆంధ్రజ్యోతి): పుల్లారెడ్డి స్వీట్స్‌ అధినేత, దివంగత పుల్లారెడ్డి మనవడు ఏకనాథ్‌రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా తనను హత్య చేయాలని చూశారని, ఇంటి నుంచి బయటికి రాకుండా రాత్రికి రాత్రే మెట్ల వద్ద గోడ కట్టారని బాధితురాలు ఆరోపించారు. భర్త, అత్తమామల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ 100 నంబర్‌కు ఫోన్‌ చేసిన ఆమె.. ఇంట్లో నుంచి బయటపడి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు రాఘవరెడ్డి, భారతి, ఏకనాథ్‌రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, గృహ హింస తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బెంగళూరుకు చెందిన కె.ప్రజ్ఞారెడ్డికి 2014 మార్చి 19న రాఘవరెడ్డి రెండో కుమారుడు ఏకనాథ్‌రెడ్డితో వివాహం జరిగింది.


ప్రజ్ఞారెడ్డి ఒక్కతే కూతురు కావడంతో ఆమె తల్లిదండ్రులు వరకట్నం కింద రూ.75 లక్షల నగదు, 10 లక్షల విలువైన వెండి సామగ్రి,  9.5 లక్షల విలువైన డైమండ్‌ రింగ్‌, ఆడపడుచు శ్రీవిద్యారెడ్డికి రూ.35 లక్షల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. ఏకనాథ్‌రెడ్డి, ప్రజ్ఞారెడ్డి దంపతులు అత్త మామలతో కలిసి బేగంపేటలో ఒకే ఇంట్లో ఉంటున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. ఏకనాథ్‌రెడ్డి కొంతకాలంగా బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్నారని, తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడంతో నగరంలో కమర్షియల్‌ ప్రాపర్టీ కొనమని భర్త, కుటుంబ సభ్యులు ప్రజ్ఞారెడ్డిని డిమాండ్‌ చేశారు. అదనపు కట్నం తేకపోవడంతో ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. 


ఆమె ను అడ్డు తొలగించుకోవాలని కుటుంబ సభ్యులు కుట్ర పన్నారు. ఇందులో భాగంగా ఏకనాథ్‌రెడ్డి విడాకుల కోసం 2021లో నగరంలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో అదే కేసులో మధ్యంతర భరణం కోసం, దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం ప్రజ్ఞారెడ్డి కౌంటర్‌ క్లెయిమ్‌తో రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అత్తమామలు సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ ప్రకారం కోడలు, మనవరాలిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టడానికి బేగంపేట ఆర్డీవో వద్ద పిటిషన్‌ వేశారు. ఈ నెల 10న భర్త, అత్తమామలు ఆమె ముఖంపై దిండుతో నొక్కి హత్యాయత్నం చేశారు. వారి నుంచి తప్పించుకుని ప్రజ్ఞారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి యత్నించగా బెదిరించారు. ఈ నెల 12న మొదటి అంతస్తులో రాత్రికి రాత్రే బయటికి వెళ్లకుండా మెట్ల వద్ద గోడను కట్టారు. భర్త, కుటుంబ సభ్యులు బయటి నుంచి తాళం వేసుకుని వెళ్లిపోయారు. ఆమె 100 నంబరుకు, తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. పోలీసులు, తల్లిదండ్రుల సహాయంతో ఇంట్లో నుంచి బయట పడ్డారు. ఈ నెల 13న రాత్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు భర్త ఏకనాథ్‌రెడ్డి, అత్తమామలు, ఆడపడుచుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-05-15T09:05:03+05:30 IST