పీఎన్‌బీ హౌసింగ్‌కు డౌన్ సీల్...

ABN , First Publish Date - 2021-06-21T23:27:49+05:30 IST

స్టాక్ మార్కెట్‌కు వరసగా మూడో సెషన్‌లోనూ నష్టాలు కొనసాగుతున్నాయి.

పీఎన్‌బీ హౌసింగ్‌కు డౌన్ సీల్...

ముంబై : స్టాక్ మార్కెట్‌కు వరసగా మూడో సెషన్‌లోనూ నష్టాలు కొనసాగుతున్నాయి. ఓపెనింగ్‌లోనే నిఫ్టీ 15,505 పాయింట్లకు పతనం కాగా, సెన్సెక్స్ 51,740 పాయింట్లకు పడిపోయింది. ఇంట్రాడేలో గత ముగింపు కంటే సెన్సెక్స్ 540 పాయింట్లు పతనం కాగా, ఇంట్రాడేలో 52,050 పాయింట్లకు ఎగియడం... ఇంట్రాడే హై మార్క్. 


ఇండెక్స్‌ల ప్రధాన నష్టాలకు నిఫ్టీ బ్యాంక్, ఐటీ, మెటల్ స్టాక్స్ కారణం. మెటల్ సెక్టార్ షేర్లలో జేఎస్‌డబ్ల్యూ ఇంట్రాడేలో ఏకంగా ఐదు శాతం, సెయిల్ మూడు శాతం,  టాటా స్టీల్ మూడు శాతం మేర ఓపెనింగ్ ట్రేడ్‌లోనే నష్టపోయాయి. ఇక... మిగిలిన ఆయిల్ అండ్ గ్యాస్, మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో నష్టాలు కొనసాగుతున్నాయి. కేపిటల్ గూడ్స్, కన్స్యూమర్  డ్యూరబుల్ స్టాక్స్‌లో హెవీ సెల్లింగ్ ఒత్తిడి నమోదవుతుండగా, ఒక్క ఎఫ్ఎంసీజీ సెక్టార్ షేర్లు మాత్రమే కళగా కన్పిస్తున్నాయి. పిఎస్‌యూ రంగ స్టాక్స్‌కు కాస్త కొనుగోళ్ల మద్దతు లభిస్తుండగా ఆ సెగ్మెంట్ ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. 


ఇక నిఫ్టీ గెయినర్లలో ఎన్‌టీపీసీ దూకుడును  ప్రదర్శిస్తోంది. గత శనివారం ప్రకటించిన క్యూ4 ఆర్థిక ఫలితాల్లో మూడింతల నికరలాభం పెరగడమే ఇందుకు కారణం. ఇంట్రాడేలో మూడు శాతానికిపైగా లాభపడి రూ. 116.95 కు ఎగసింది ఈ షేరు. తర్వాత అదానీ పోర్ట్స్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఫ్‌సీ లైఫ్, బ్రిటానియా 2.15-0.55శాతం వరకు లాభపడ్డాయి. లూజర్లలో యూపీఎల్, విప్రో,టాటా మోటర్స్, హిందాల్కో, ఎం అండ్ ఎం 3.65-1.75 శాతం మేర నష్టపోయాయి. ఇక సెబీ నుంచి షాక్‌కు గురైన  పంజాబ్ నేషనల్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లకు డౌన్ సీల్ పడ్డింది. కార్లైల్ గ్రూప్‌తో డీల్‌ను రద్దు చేయాలంటూ సెబీ ఆదేశాలు జారీ చేయడంతో ఈ సంస్థ షేర్లు ఐదు శాతం మేర పతనమై రూ. 70,0.05 కు చేరాయి. ఈ క్రమంలో... పంజాబ్ నేషనల్ హౌసింగ్ ఫైనాన్స్ అప్పిలేట్ అథారిటీకి వెళ్లినా ఇప్పట్లో డీల్ పట్టాలెక్కడం సందేహమేనన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. 

Updated Date - 2021-06-21T23:27:49+05:30 IST