ఫోర్టిఫైడ్‌ బియ్యంపై అనుమానాలు

ABN , First Publish Date - 2021-06-23T05:17:16+05:30 IST

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఫోర్టిఫైడ్‌ (బలవర్ధక)బియ్యంపై ప్రజల్లో ఉన్న అపోహలకు ఇవి ఉదాహరణలు మాత్రమే. ప్రతి మండలంలోను ఏదో ఒక గ్రామంలో బియ్యం ప్లాస్టిక్‌ వంటూ ఆందోళన చేస్తున్నారు.

ఫోర్టిఫైడ్‌ బియ్యంపై   అనుమానాలు
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఫోర్టిఫైడ్‌ (బలవర్ధక) బియ్యం

ప్లాస్టిక్‌ వంటూ గ్రామాల్లో చర్చ

సర్దిచెప్పలేక తలలు పట్టుకుంటున్న సీఎస్‌డీటీలు

అవగాహన కల్పించడంలో లోపం

శృంగవరపుకోట, జూన్‌ 22:

పౌరసరఫరాల శాఖ ప్లాస్టిక్‌ బియ్యాన్ని సరఫరా చేస్తోందని శృంగవరపుకోట శివారు సీతంపేటలో వారం రోజుల కిందట లబ్ధిదారులు స్థానిక నేతలకు చూపించారు. ఇలాంటి బియ్యాన్ని తింటే రోగాలు వస్తాయని వాపోయారు. పౌర సరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇవి ఫోర్టిఫైడ్‌ (బలవర్ధక) బియ్యమని వారికి సర్దిచెప్పేందుకు అధికారుల తల ప్రాణం తోకకు వచ్చింది. 

లక్కవరపుకోట మండలం శ్రీరాంపురం గ్రామంలో పంపిణీ చేసిన బియ్యం ప్లాస్టిక్‌వి అంటూ లబ్ధిదారులు పదిరోజుల కిందట ఆందోళనకు దిగారు. నాణ్యమైన బియ్యానికి పోషక విలువలు కలిపి రేషన్‌ ద్వారా అందించే ఈ బియ్యాన్ని ఫోర్టిఫైడ్‌గా పిలుస్తున్నట్లు ఉప తహసీల్దార్‌ (సీఎస్‌డీటీ) రామారావు నచ్చజెప్పే వరకూ వారికి నమ్మకం కలగలేదు. 

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఫోర్టిఫైడ్‌ (బలవర్ధక)బియ్యంపై ప్రజల్లో ఉన్న అపోహలకు ఇవి ఉదాహరణలు మాత్రమే. ప్రతి మండలంలోను ఏదో ఒక గ్రామంలో బియ్యం ప్లాస్టిక్‌ వంటూ ఆందోళన చేస్తున్నారు. చాలా చోట్ల ప్లాస్టిక్‌ బియ్యంగా భావించి పశువుల మేతకు వేసేస్తున్న సంఘటనలు ఉన్నాయి. పోషక విలువలు పెంచేందుకు మిల్లింగ్‌ సమయంలో సాధారణ బియ్యానికి ఐరన్‌, పోలిక్‌యాసిడ్‌, విటమిన్‌ బి12 పోషకాలను ప్రభుత్వం జత చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటినే ఫోర్టిఫైడ్‌ (బలవర్ధక) బియ్యంగా పిలుస్తున్నారు. ప్రతి వంద కేజీల సాధారణ బియ్యం బస్తాలో వీటిని కేజీ వరకు కలుపుతున్నారు. సాధారణ బియ్యంతో కలిపి వీటిని తినడం వల్ల రక్తహీనత రాదని, అదనపు పోషకాలు లభిస్తాయని, గర్భిణులు ఆరోగ్యంగా ఉంటారని, నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుందని తదితర కారణాలతో ఫోర్టిఫైడ్‌ను పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ చెబుతోంది. 

ప్లాస్టిక్‌ వాసన వస్తోందని...

సాధారణ బియ్యంలో అక్కడక్కడ కనిపిస్తున్న ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని ప్లాస్టిక్‌ బియ్యంగా గ్రామాల్లో భావిస్తున్నారు. నోటిలో పెడితే సాగుతున్నాయని, కాల్చితే ప్లాస్టిక్‌ వాసన వస్తోందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ బియ్యంలో కనిపిస్తున్న ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని ఒక్కొక్కటిగా వేరుచేస్తున్నారు. తెల్లగా మెరుస్తూ కనిపించడంతో ప్లాస్టిక్‌ బియ్యమేనంటూ గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో ఈ బియ్యాన్ని ఈ నెల ఒకటి నుంచి పౌరసరఫరాల శాఖ పంపిణీ చేస్తోంది. అప్పటి నుంచి ప్రతి మండలంలో ఈ విధమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపై అభ్యంతరాలు వచ్చిన చోటకు వెళ్లి పౌరసరఫరాల శాఖ అధికారులు లబ్ధిదారుల సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ చాలా మందికి నమ్మకం కుదరడం లేదు. దీనికి కారణం బియ్యం పంపిణీకి ముందే ప్రజలకు వీటిపై అవగాహన కల్పించక పోవడమేనని ఈ శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ప్రజలకు పోషక విలువలు అందించే ఇలాంటి బియ్యాన్ని ఇచ్చినప్పుడు గ్రామాల్లో ముందుగా అవగాహన పరిస్తే బాగుండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ బియ్యం పంపిణీ సమయానికి కొవిడ్‌-19 సెకెండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉంది. జిల్లాలో కర్ఫ్యూ అమల్లో ఉంది. దీంతో ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లలేకపోయామని పౌరసరఫరాల శాఖ అఽధికారులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ పత్రికలు, ఇతర ప్రసార సాధానాల ద్వారా ఈ బియ్యం ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశామంటున్నారు. 

అపోహలు వద్దు

ఫోర్టిఫైడ్‌ బియ్యంపై ప్రజలు అపోహలు వీడాలి. వీటిని ప్లాస్టిక్‌ బియ్యమని అనవద్దు. బలవర్ధక బియ్యమని గుర్తించాలి. శరీరానికి పోషక విలువలు అందిస్తాయి. గత ఏడాది బొబ్బిలి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా పౌరసరఫరాల శాఖ అందించింది. అప్పుడు కూడా ఇలాంటి వదంతులే వచ్చాయి. అక్కడి ప్రజలు అలవాటు పడ్డారు. ఈ బియ్యాన్నే తింటున్నారు. 

                                   - ఎన్‌వీవీఎస్‌ మూర్తి, పౌర సరఫరాల ఉప తహసీల్దార్‌, శృంగవరపుకోట 



Updated Date - 2021-06-23T05:17:16+05:30 IST