డబ్బుల్లేవని దూరం పెట్టింది

ABN , First Publish Date - 2021-07-31T05:05:52+05:30 IST

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వీరన్నపేట గ్రామ శివారులో ఇటీవల లభ్యమైన కాలుతున్న మృతదేహం మిస్టరీ వీడింది

డబ్బుల్లేవని దూరం పెట్టింది
వివరాలను వెల్లడిస్తున్న హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

మరణాన్ని కప్పిపుచ్చేందుకు తమ్ముడితో కలిసి

మృతదేహాన్ని దహనం చేసిన నిందితురాలు

యువకుడి మృతి కేసులో వీడిన మిస్టరీ 

మృతుడు పశ్చిమ బెంగాల్‌ వాసిగా గుర్తింపు

ఇంతకుముందు కూడా సోషల్‌ మీడియాలో

యువకులను ఆకర్షించి మోసాలు చేసిన యువతి

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు


చేర్యాల, జూలై 30: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వీరన్నపేట గ్రామ శివారులో ఇటీవల లభ్యమైన కాలుతున్న మృతదేహం మిస్టరీ వీడింది. మృతుడిని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన దీపాంకర్‌దాస్‌ (24)గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. చేర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన షెహనాబీ అలియాస్‌ సమీరా (23) అనే యువతి హైదరాబాద్‌లో ఉంటూ ప్రేమ పేరుతో సోషల్‌ మీడియాలో యువకులను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తోంది. మూడు నెలల క్రితం పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపాంకర్‌ దాస్‌ (24) ను ఆన్‌లైన్‌లో పబ్‌జీ ద్వారా పరిచయం చేసుకుంది. ప్రేమ పేరుతో అతడిని హైదరాబాద్‌కు రప్పించింది. ఇద్దరూ అమీర్‌పేట సమీపంలోని శ్రీనగర్‌కాలనీలో గదిని అద్దెకు తీసుకుని కలిసి ఉంటున్నారు. అయితే దీపాంకర్‌ వద్ద డబ్బులు లేవని తెలుసుకున్న ఆమె.. అతడిని వదిలించుకోవాలని గొడవపడింది. దీంతో మనస్తాపానికి గురైన దీపాంకర్‌.. అద్దె గదిలోనే ఈనెల 18న మధ్యాహ్నం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపటి అనంతరం గమనించిన యువతి.. మృతదేహాన్ని కిందికి దించింది. ఆందోళనకు గురై హైదరాబాద్‌కు చెందిన సాయికృష్ణ కారులో తన స్వగ్రామమైన చేర్యాల మండలం నాగపురి గ్రామానికి చే రుకుని సోదరుడికి విషయం తెలిపింది. అదే రోజు సాయంత్రం అక్కాతమ్ముడు కలిసి హైదరాబాద్‌ చేరుకుని మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టారు. నంబర్‌ప్లేట్‌ అంకెలను మార్చి గ్రామీణ రహదారుల గుండా చేర్యాల మీదుగా 19న ఉదయం వీరన్నపేట శివారులోని ఏనెగుట్ట వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని అక్కడ పడేసి వెళ్లిపోయారు. అయితే మృతదేహం వద్ద సాక్ష్యాలు దొరకకుండా చేసేందుకు 19న రాత్రి 11:30 గంటల సమయంలో ఏనెగుట్టకు చేరుకుని మృతదే హంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మరుసటిరోజు హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. 


సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు

మంటల్లో కాలుతున్న మృతదేహాన్ని మరుసటి రోజు ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరువలోని తోటలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు. నిందితురాలు పలువురు వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకుని సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు దిగి డబ్బు వసూలు చేసినట్లు గుర్తించామని ఏసీపీ మహేందర్‌ తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించామని, వారు ఉపయోగించిన కార్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. 

Updated Date - 2021-07-31T05:05:52+05:30 IST