Abn logo
May 22 2020 @ 20:43PM

వరంగల్‌ : బావిలో 9 మృతదేహాల వెనుక అసలు కారణమిదేనా!?

వరంగల్ : ఆ మరణాల వెనుక మర్మం ఏమిటో తెలియటం లేదు..? ఎవరైనా హత్య చేశారా..? వారే అత్మహత్య చేసుకున్నారా..? చిక్కు ముడి వీడటం లేదు. తొమ్మిది మంది మృత దేహాలు బావిలో నుంచి బయట పడటంతో ఎవరికి అంతుచిక్కటం లేదు. కూలీలను  చంపాల్సినంత అవసరం ఎవరికుంది..? అసలు చంపారా..? లేకుంటే వాళ్లే అత్మహత్య చేసుకున్నారా..? అనేదీ ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తుండటం ఉత్కంఠకు దారి తీస్తోంది. ఒకే బావిలో తొమ్మిది మృతదేహాలు లభ్యం కావటంతో వీరి మరణాలకు కారణాలు తేల్చటం ఇప్పుడు వరంగల్ పోలీసులకు సవాల్‌గా నిలిచింది.


అసలు ఎవరు వీళ్లు..!?

పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం వరంగల్‌కు కుటుంబంతో సహా వలస వచ్చాడు. నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవారు. డిసెంబరు నెల నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. నెలన్నర నుంచి గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌తో పాటు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్రా ఆలం కూడా తన మూడేళ్ల కుమారుడితో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వీరితో పాటుగా గన్నీ సంచుల గొదాం పక్కనే ఉన్నపై భవనంలో బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంలు కూడా నివసిస్తూ గోదాంలో పనిచేస్తున్నారు. 


ఒకే కుటుంబానికి చెందినవారే..

పరిశ్రమ యజమాని సంతోష్‌ రోజూలాగే గోదాం వద్దకు వచ్చే సరికి కార్మికులెవరూ కనిపించలేదు. పరిసరాల్లో అన్వేషించినా జాడ లేకపోవడంతో.. పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో చూశారు. నాలుగు మృతదేహాలు నీళ్లలో తేలాడుతూ కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. ఓకే కుటుంబానికి చెందిన మాసూద్ అలం (50) నిషా అలం (భార్య)  (45), బూస్రా అలం (22) ఈమె మూడు సంవత్సరాల బాలుడుదేహాలు బావిలో నుంచి వెలికి తీశారు. ఇవాళ బావిలో నీటిని తోడుతుండగా మసూద్ అలం పెద్ద కుమారుడు శబాజ్ అలం (21), చిన్న కుమారుడు సోహిల్ అలం (20) వీరితో పాటు గోనె సంచుల గోదాం వద్దకు వాహనాలను నడిపే డ్రైవర్  షకీల్ (40)తో పాటు బీహార్‌కు చెందిన శ్రీరామ్ (35), శ్యామ్ (40)ల మృతదేహాలు వెలికి తీశారు.


మరో ఐదు మృతదేహాలు..!?

ఒకే బావిలో ఐదుగురు మృతదేహాల లభ్యం కావటంతో బీహర్‌కు చెందిన శ్రీరాం, శ్యాం, షకీల్, శాభాజ్‌ల ఆచూకి లేక పోవటంతో భావిలో నీటిని మోటర్ ద్వారా పంపించాలని పోలీసులు, రెవెన్యూ అదికారులు, డిజాస్టార్ రెస్పాన్స్ ఫోర్స్ టీం సభ్యులు అందరు నిర్ణయానికి వచ్చారు. పోలీసులు అనుకున్నట్లే నీటిని తోడుతున్న క్రమంలో మరో ఐదుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. 


వివాహేతర సంబంధం ఉందా..!?

భర్తతో విడిపోయిన మసూద్ కూతురు బుస్రా నగరంలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బుస్రాకు తన తల్లితో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇంటిపై ఉంటున్న బీహార్‌కు చెందిన కార్మికులు శ్రీ రాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకుని బుస్రాపై కన్నేసినట్లు తెలియవచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బుస్రా ప్రియుడు వారితో‌ మూడు రోజుల కిందట మసూద్ ఇంట్లో విందుకు హజరైనట్లుగా చెబుతున్నారు. ఈ విందులో జరిగిన ఘర్షణతో బీహార్ యువకులు మసూద్ కుటుంబాన్ని చంపి బావిలో పడేసి.. భయంతో వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి చూస్తే అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం ‘విందు’ చుట్టూనే తిరుగుతోంది..? ఇదే అసలు కారణమనే అనుమానాలు పెరుగుతున్నాయి. అసలు విందు జరుపుకున్నారా..? లేదా..? అనేదానిపై పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది.


కారణాలేంటి..!?

తొమ్మిది మంది మృత దేహాలకు కారణాలేంటి..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. పాడు బడిన వ్యవసాయ భావి వద్దకు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. వరంగల్‌ నగరపాలక సంస్థ సిబ్బంది.. విపత్తు నిర్వహణ బృంద సభ్యులు, పోలీసులు కలిసి మృతదేహాలను తాళ్లతో వెలికి తీశారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తొమ్మది మంది ఒకే బావిలో మృతదేహాలు లభ్యం కావటంతో వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవిందర్, నగర మేయర్ గండా ప్రకాశ్ రావు, బీజేపీ నేతలు చేరుకుని ఘటన స్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి త్వరలోనే నిగ్గు తేలుస్తామిన సీపీ మీడియాకు వెల్లడించారు.


హత్యలా.. ఆత్మహత్యలా..!?

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు బావిలో ఉండటంతో వీరివి హత్యలా? సామూహిక ఆత్మహత్యాలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొమ్మది మంది మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్, సంఘటనా స్థలిని వరంగల్‌ సీపీ రవీందర్‌, మేయర్‌ ప్రకాశ రావు, కలెక్టర్ హరిత పరిశీలించారు.


బర్త్ డే పార్టీ చేసుకున్నారా..!?

అందరు కలిసి నాలుగు రోజుల కిందట భర్త్ డే పార్టీ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ పార్టీలో ఎవరైనా ఆహరంలో విషం కలిపి ఉంటారా..? లేక విషం ఇచ్చి చంపేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరణించిన తొమ్మది మంది మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యా కాదా..? అసలేం జరిగి ఉంటుందనేదీ అంతుచిక్కటం లేదు. పోలీసులు మసూదు అలం కుటుంబ సభ్యులు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడారా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ తొమ్మిది మంది మరణాలపై పోలీసులకు అంతుచిక్కటం లేదు. ఈ మరణాలకు కారణాలను చెప్పలేక పోతున్నారు. మిస్టరీగా మారిన మరణాలపై పోలీసులు దర్యాప్తులో ఏం తేలుతుందో వేచి చూడాలి.

Advertisement