సందేహం

ABN , First Publish Date - 2020-03-13T06:42:35+05:30 IST

ఎవరు నీవు? నీ జన్మ వృత్తాంతమెట్టిది? నీ ముత్తాత ముత్తాత తాత ముత్తాత ముత్తాతలెవరు? ఏ వానరం నుంచి వారు నరావతారం ఎత్తారో! ఉనికి కోసం ఏ మతాన్ని...

సందేహం

ఎవరు నీవు? నీ జన్మ వృత్తాంతమెట్టిది? నీ ముత్తాత ముత్తాత తాత ముత్తాత ముత్తాతలెవరు? ఏ వానరం నుంచి వారు నరావతారం ఎత్తారో! ఉనికి కోసం ఏ మతాన్ని ఎవరు సృష్టించారో! వారికసలు మతం అంటే తెలుసో లేదో నీకు తెలుసా? నీకసలు మానవ సమూహాల సమిష్టి జీవితాల కాలం తెలుసా? సంచార జీవన వేదం తెలుసా? ఏ స్వేద బిందువులు నదీ తీరాల వెంట నాగరికతా పరిమళాలను అద్దాయో.. పుడమికి పురుడు పోసిన తొలి అవ్వ ఎవరో తెలుసుకునే ప్రయత్నం ఎపుడైనా చేశావా?


ఓయీ ఆర్యపుత్రా! చదువుకుంటేనే కదా చరిత్ర తెలిసేది. పురాతన చరిత్ర నీకు తెలియదు. పైపై చదువులూ చదవలేదు. పోనీ నీ తాత తండ్రుల జీవితాల్లోకి తొంగిచూసే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా? అమ్మ ఒడిలో పెరగనివాడికి అన్ని కథలు ఎలా తెలుస్తాయిలే. మేము చేసిన తప్పు ఒక్కటే. నీ బర్త్‌ సర్టిఫికెట్‌ ఎప్పుడూ అడగలేదు. నువ్వు కూడా మాలో ఒకడివనుకున్నాం. నీ తీయని మాటలు విని మోసపోయాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడిన బహుళజాతుల సమ్మిళితం ఈ దేశం. నువ్వూ నేనూ అందరం ఈ దేశ పౌరులమే. ఇప్పుడు మా జన్మ వృత్తాంతాలను అడుగుతున్నావు కదా. నీ చరిత్రను మేం ప్రశ్నిస్తున్నాం. నీ బర్త్‌ సర్టిఫికెట్టే కాదు.. నీ స్ట్రగుల్‌ సర్టిఫికెట్‌ కూడా కావాలి. ఈ దేశ స్వాతంత్య్ర పోరాటంలో నీ స్థానమెట్టిది? నీ నేతల రాతలేమిటి? ఆంగ్లేయులను ఈ గడ్డపై నుంచి తరిమేసిన త్యాగధనుల జాబితాలో వారే వరసలో ఉన్నారు? ఇవైనా తెలుసా నీకు? దాచేస్తే దాగని సత్యాలిప్పుడు కావాలి మాకు.


ఈ దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలను ఫణమొడ్డిన తొలి ముస్లిం, హిందూ వీరులెవరో మాకు తెలుసు. ఉరికంబానికి ఊయలలూగిన విప్లవ వీరులు తెలుసు. ఆంగ్లేయుల తుపాకీ గుండ్లకు గుండెను చూపిన మన్యం వీరుడూ తెలుసు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పేరిట దేశభక్త సైన్యాన్ని తయారు చేసిన భారతీయుడు కూడా తెలుసు. ప్రాణాలకు తెగించి ఉద్యమించిన సామాన్యుల వీర చరితమే కాదు. ప్రాణభయంతో వెన్ను చూపిన పిరికిపందల హీన చరిత్రను కూడా పుటలు పుటలుగా చదువుకున్నాం. ఎవరు దేశభక్తులో.. ఎవరు దేశద్రోహులో అమ్మ ఒడి నుంచి వింటూ పెరిగాం.


గాంధీ విగ్రహానికి దండలేసి.. కళ్లద్దాలను స్వచ్ఛ భారత్‌కు బ్రాండ్‌ను చేసినంత మాత్రాన గాంధేయవాది కాలేవు. అయినా గాడ్సేని పూజించే మనసుతో గాంధీని ఎలా స్మరిస్తావ్‌? ఇన్ని మాటలెందుకుగానీ, ఈ భూమ్మీద కోట్ల మంది ఆర్యులుండగా, హిట్లర్‌ డీఎన్‌ఏ నీకు మాత్రమే ఎలా సంక్రమించిందన్నది ఇప్పుడు మా సందేహం. నివృత్తి చేయవూ!

సద్మ

Updated Date - 2020-03-13T06:42:35+05:30 IST