ఫంక్షన్‌ హాల్‌ను అద్దెకు ఇచ్చి అమెరికాకు వెళ్లిపోయిన NRI.. ఆరేళ్ల తర్వాత భారత్‌కు తిరిగొచ్చాక డబుల్ షాక్..

ABN , First Publish Date - 2021-09-07T19:47:04+05:30 IST

పంజాబ్‌లోని జలంధర్ ఉన్న తన ఫంక్షన్‌ హాల్‌ను అద్దెకు ఇచ్చిన అమెరికాలోని గ్లాస్గోలో ఉండే ఎన్నారైకి ఊహించని షాక్ తగిలింది.

ఫంక్షన్‌ హాల్‌ను అద్దెకు ఇచ్చి అమెరికాకు వెళ్లిపోయిన NRI.. ఆరేళ్ల తర్వాత భారత్‌కు తిరిగొచ్చాక డబుల్ షాక్..

జలంధర్: పంజాబ్‌లోని జలంధర్ ఉన్న తన ఫంక్షన్‌ హాల్‌ను అద్దెకు ఇచ్చిన అమెరికాలోని గ్లాస్గోలో ఉండే ఎన్నారైకి ఊహించని షాక్ తగిలింది. కిరాయిదారుడు ఏకంగా రూ. 24.50లక్షలు ఎగ్గొట్టి.. గుట్టుచప్పుడు కాకుండా ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఆరేళ్ల తర్వాత అమెరికా నుంచి తిరిగొచ్చిన ఎన్నారై ఫంక్షన్ హాల్ పరిస్థితి చూసి అవ్వాకయ్యాడు. ఎందుకుంటే కిరాయిదారుడు కేవలం తాను చెల్లించాల్సిన కిరాయి మాత్రమే కాదు.. పంక్షన్ హాల్‌లోని కొన్ని ముఖ్యమైన వస్తువులను కూడా ఎత్తుకెళ్లిపోయాడు. ఈ విషయమై ఎన్నారై పోలీసులను ఆశ్రయించాడు. అయితే, పోలీసుల విచారణలో ఎన్నారైకి సంబంధించిన మోసం ఒకటి బయటపడింది. దాంతో పోలీసులు రివర్స్‌లో అతనిపై కూడా ఒక కేసు నమోదు చేశారు. ఇలా ఎన్నారైకి ఊహించని విధంగా డబుల్ షాక్ తగిలింది. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జలంధర్‌లోని అర్బన్ ఏస్టేట్ ఫేజ్-2కు చెందిన షింగ్రా సింగ్ ప్రస్తుతం అమెరికాలోని గ్లాస్గో‌లో ఉంటున్నారు. 2015లో షింగ్రా తనకు సంబంధించిన జీటీ రోడ్‌లోని షింగ్రా అనే ప్యాలేస్‌ను గోర్యా క్రిష్ణ కాలనీకి చెందిన ప్రవీణ్ సింగ్‌కు లీజుకు ఇచ్చాడు. ఆ సమయంలో మొదటి ఏడాది కిరాయి రూపంలో రూ. 16 లక్షలు ఇవ్వాలని.. ఆ తర్వాతి ఏడాది నుంచి ప్రతియేటా రూ. 18 లక్షలు కిరాయి ఇవ్వాల్సి ఉంటుందని మాట్లాడుకున్నాడు. కానీ, బాండ్‌లో మాత్రం  షింగ్రా సింగ్ కేవలం రూ.3లక్షలు అని మాత్రం రాయించారు. నాలుగేళ్లు క్రమం తప్పకుండా కిరాయి చెల్లించిన ప్రవీణ్ సింగ్.. 2020 జూలై నుంచి కిరాయి ఇవ్వలేదు. ఇలా రూ. 24.50 లక్షలు షింగ్రాకు కిరాయి ఇవ్వాల్సి ఉంది. దీంతో షింగ్రా సింగ్ ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చాడు. తీరా వచ్చి చూస్తే.. ప్యాలేస్‌ మొత్తం ఖాళీగా కనిపించింది. ప్రవీణ్ సింగ్‌ను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఫంక్షన్ హాల్‌లోని ఏసీ, జనరేటర్‌తో పాటు మరికొన్ని వస్తువులు కూడా మాయం అయ్యాయి. దాంతో షింగ్రా సింగ్ జలంధర్ పోలీసులను ఆశ్రయించాడు. 


ప్రవీణ్ సింగ్ తనకు రూ. 24.50 లక్షల కిరాయి ఎగ్గొట్టడంతో పాటు ప్యాలేస్‌లోని ముఖ్యమైన వస్తువులను దొంగిలించాడని ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రవీణ్ సింగ్‌పై 420, 406 కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కేసు విచారణలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. షింగ్రా సింగ్ లీజుకు సంబంధించిన అగ్రీమెంట్ పేపర్ విషయంలో పన్ను ఎగ్గొట్టేందుకు మోసం చేసినట్లు పోలీసులు తేల్చారు. ఏడాదికి కిరాయి రూ. 16 లక్షల నుంచి రూ. 18 లక్షలు కాగా.. దీన్ని కేవలం రూ. 3లక్షలుగా మాత్రమే రాయించినట్లు తేలిసింది. దాంతో పోలీసులు షింగ్రా సింగ్‌పై కూడా మరో కేసు నమోదు చేశారు. ఇలా ఎన్నారైకి ఊహించని విధంగా డబుల్ షాక్ తగిలినట్లైంది. 

Updated Date - 2021-09-07T19:47:04+05:30 IST