ఇళ్లు ఇంకేన్నాళ్లు!

ABN , First Publish Date - 2020-11-20T04:48:56+05:30 IST

జిల్లాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కోసం మరింతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇళ్లు ఇంకేన్నాళ్లు!
మహేశ్వరం మండలం మన్సాన్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న డబుల్‌బెడ్‌రూం గృహాలు

  • రంగారెడ్డి జిల్లాలో ముందుకు సాగని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు
  • పెరిగిన మెటీరియల్‌ ధరలతో ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు
  • పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
  • ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు


 రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌  ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అర్హులైన వారి సొంతింటి కల నెరవేర్చాలని భావిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులకు అనేక అవాంతరాలు ఎదురవు తున్నాయి. ఐదేళ్లుగా అవిగో ఇళ్లు.. ఇవిగో ఇళ్లు ..అంటూ పాలకులు ఊరిస్తున్నారు.  ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు తక్కువగా ఉండటంతో కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) :  సొంతింటి కల సాకారం చేయాలన్న లక్ష్యంతో  ప్రభుత్వం ప్రకటించిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి.   ఒక పక్క  ఇళ్ల నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మరో పక్క  మెటీరియల్‌ ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో ఇళ్ల నిర్మాణ పనుల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పలు చోట్ల ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రభుత్వం స్టీల్‌, సిమెంట్‌, ఇసుకపై రాయితీలు ఇస్తున్నప్పటికీ పెరుగుతున్న ధరలకు జీఎస్టీ భారం వల్ల అధికారులు ఎన్ని సార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువైంది. లాభాలు వస్తున్న పనులపై కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుతున్నారే తప్ప డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పట్టించుకోవడం లేదు. దీంతో నిర్మాణ పనుల్లో వేగం పుంజుకోవడం లేదు. 


226 గృహాలు పూర్తి.. 


2015-16, 2016-17 వార్షిక సంవత్సరంలో జిల్లాలో 6,777 గృహాలు కేటాయించారు. అందులో మంజూరైనవి 6,645 గృహాలు. 6,383 గృహాలకు సంబంధించి టెండర్లు పిలవగా అందులో 3,300 గృహాలకు టెండర్లు పూర్తయ్యాయి. 2,637 గృహ నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ఐదేళ్లలో ఇప్పటి వరకు 226 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. రాజేంద్రగనర్‌లో 130, ఇబ్రహీంపట్నంలో 96 గృహాలు పూర్తయ్యాయి. మిగతా నియోజకవర్గాల్లో కనీసం ఒక్కటి కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది. నిర్మాణాలపై ఇప్పటి వరకు  ఎన్నో సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నా.. ఫలితాలు కనిపించడం లేదు. 


కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు


డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల కోసం దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఇప్పటి వరకు మీసేవా సెంటర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 1,94,611 చేరుకుంది. ఇందులో చేవెళ్ల నియోజకవర్గంలో 7,615 దరఖాస్తులు రాగా, కల్వకుర్తి నియోజకవర్గంలో 3,020 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 9,816 దరఖాస్తులు రాగా మహేశ్వరం నియోజకవర్గంలో 10,780 దరఖాస్తులు వచ్చాయి. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో 56,017 దరఖాస్తులు రాగా షాద్‌నగర్‌ నియోజకవర్గంలో 2,452 దరఖాస్తులు వచ్చాయి. అలాగే శేరిలింగంపల్లిలో 44,447 దరఖాస్తులు, ఎల్బీనగర్‌ నియోజకవర్గం నుంచి 60,464 దరఖాస్తులు వచ్చాయి. 


Updated Date - 2020-11-20T04:48:56+05:30 IST