‘డబుల్‌’ పంచాయితీ

ABN , First Publish Date - 2022-05-14T05:30:00+05:30 IST

కొండపాక మండలం విశ్వనాథపల్లి శివారులో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు వివాదంగా మారాయి.

‘డబుల్‌’ పంచాయితీ
విశ్వనాథపల్లి శివారులోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు


రెండు గ్రామాల మధ్య ముదురుతున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల  వివాదం


కొండపాక, మే 14 : కొండపాక మండలం విశ్వనాథపల్లి శివారులో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు వివాదంగా మారాయి. విశ్వనాథపల్లి, రవీంద్రనగర్‌ ఈ రెండు గ్రామాలు వెలికట్ట గ్రామపంచాయతీ పరిధిలో ఉండేవి. ఈ గ్రామాలకు నాలుగేళ్ల క్రితం 77 ఇళ్లను మంజూరు చేసి రెండు చోట్ల నిర్మించారు. విశ్వనాథపల్లి శివారులో 50 ఇళ్లను, వెలికట్ట గ్రామంలో 27 ఇళ్లను నిర్మించారు. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిన సమయంలో రవీంద్రనగర్‌, విశ్వనాథపల్లి గ్రామాలను కలిపి ఒకే పంచాయతీగా చేశారు. ప్రస్తుతం ఇక్కడ పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుపై రెండు గ్రామాల మధ్య పంచాయితీ తలెత్తింది. ఈ గ్రామాల మధ్యే కాకుండా విశ్వనాథపల్లి గ్రామస్థుల మధ్యే మరో వివాదం నెలకొన్నది. 

విశ్వనాథపల్లి రోడ్డుకు లోపలికి ఉంటుందని, వారంతా రోడ్డు వైపు వస్తామని నాయకులను, అధికారులను గ్రామస్థులు కోరారు. రాజీవ్‌ రహదారి పక్కనే అందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో అప్పుడు గ్రామస్థులంతా కొంత డబ్బు పోగుచేసుకుని భూమిని కొనుగోలు చేయడంతో పాటు చదును చేయించారు. కాగా గ్రామంలో మొత్తం 61 కుటుంబాలు ఉండగా రాజీవ్‌ రహదారి పక్కన నిర్మించిన 50 ఇళ్లల్లోకి అధికారులు కేటాయింపు లేకుండానే వచ్చి ఉంటున్నారు. ఇళ్లు దొరకని 11 మంది అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో, సామూహిక అవసరాలకు కేటాయించిన స్థలంలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించుకోవడంతో అధికారులు వాటిని కూల్చేశారు. దీంతో తామంతా ఎటు వెళ్లాలని 11 మంది బాధితులు వాపోతున్నారు. అయితే విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన వారు ఇళ్లను ఆక్రమించుకున్నారని, రెండు గ్రామాల్లో కలిపి నిరుపేదలను గుర్తించి ఇళ్లను కేటాయించాలని కోరుతున్నారు. ఇటీవల తనకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని రవీంద్రనగర్‌కు చెందిన మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇలా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపు వివాదంగా తయారైంది. ఈ విషయంలో అధికారులు నిర్ణయం తీసుకొని అర్హులకు న్యాయం చేయాలని సర్పంచ్‌ లింగారావు కోరారు.


Updated Date - 2022-05-14T05:30:00+05:30 IST