పశువుల కొట్టాలుగా డబుల్‌ ఇళ్లు

ABN , First Publish Date - 2022-01-25T05:44:21+05:30 IST

మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం దొంతిలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా, పశువులకు కొట్టాలుగా మారుతున్నాయి. సాయంత్రం అయితే చాలు మందుబాబులు, పేకాట రాయుళ్లు ఆ ఇళ్లలో చేరి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

పశువుల కొట్టాలుగా డబుల్‌ ఇళ్లు
దొంతిలో నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్లు

పశువుల పాకలుగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా

లబ్ధిదారులకు పంపిణీ చేయక ముందే ఇళ్లల్లో పగుళ్లు

నిర్మాణం పూర్తయి మూడేళ్లయినా అర్హులకు అందని డబుల్‌బెడ్‌రూం ఇళ్లు

ఇళ్ల పంపిణీకి చర్యలు చేపట్టని నాయకులు, అధికారులు!

ఆశతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులు



ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్‌, జనవరి 24: మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం దొంతిలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా, పశువులకు కొట్టాలుగా మారుతున్నాయి. సాయంత్రం అయితే చాలు మందుబాబులు, పేకాట రాయుళ్లు ఆ ఇళ్లలో చేరి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మద్యం మత్తులో సీసాలను పగలగొడుతున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి మూడేళ్ల క్రితం కట్టిన ఇళ్లలో పేక ముక్కలు, సిగరేట్‌ డబ్బాలు, బీరు బాటిళ్లు, వాటర్‌ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. ఎలాగో ఇళ్ల పంపిణీ చేపట్టరని భావించిన కొందరు ఆ ఇళ్లను పశువుల పాకలుగా ఉపయోగించుకున్నారు. వానకు తడవకుండా గడ్డిని నిల్వ చేసుకుంటున్నారు. కొన్ని ఇళ్లల్లో అయితే పేడ నిండిపోయింది. గోడలు, పిల్లర్ల మధ్య పగుళ్లు ఏర్పడ్డాయి. కిటికీలు ధ్వంసమయ్యాయి. మరుగుదొడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల చుట్టూ ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు పెరిగాయి. ఒకరంగా చెప్పాలంటే శిథిలావస్థకు చేరిన భవనాల మాదిరిగా తయారవుతున్నాయి.  

 నిరుపేదలకు డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో 2016లో 35 ఇళ్లను దొంతి గ్రామంలో కట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో 17 ఇళ్లు పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు పేదలకు పంచలేదు. లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం వల్ల ఇళ్లు వృథాగా ఉన్నాయి. పశువులను కట్టేయడం వల్ల మూత్రం, పేడతో నిండి దుర్గంధం వెదజల్లుతున్నాయి. 


నిజాంపేట మండలంలోనూ ఇదే పరిస్థితి

 మెదక్‌ జిల్లాలోని నిజాంపేట మండలంలోని నిర్మించిన ఇళ్లు కూడా పంపిణీకి నోచుకోక పగుళ్లు ఏర్పడ్డాయి. ఇక్కడ కూడా అసాంఘిక కార్యకలాపాలకు, పశువుల పాకలకు ఉపయోగపడుతున్నాయి. మండలంలో 2018లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కల్వకుంటలో 74, చల్మెడలో 40, నందిగామలో 40 ఇళ్లను కట్టారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కోసం కల్వకుంటలో 475, చల్మెడలో 178 దరఖాస్తులు చేసుకున్నారు. నందిగామలో మాత్రం ఇంకా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాలేదు. మూడు చోట్ల గ్రామసభలు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ నేటి వరకు ఇళ్ల పంపిణీ జరగడం లేదు. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు వృ థాగా ఉన్నాయి. పలు ఇళ్ల కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఫ్లోరింగ్‌ కుంగిపోతుంది. అయినా కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీకి చర్యలు తీసుకోవడం లేదు. తమ కంటూ సొంత ఇల్లు లేని పేదలు ప్రభుత్వం ఆ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయకపోతదా అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. 





Updated Date - 2022-01-25T05:44:21+05:30 IST