Abn logo
Feb 25 2021 @ 19:23PM

డబుల్ హీరోయిన్ డెడ్‌లాక్‌

ఇటీవలి కాలంలో దాదాపుగా ఇద్దరు హీరోయిన్లు లేని సినిమాయే లేదంటే అతిశయోక్తి కానే కాదు. ఎంతటి హీరో అయినా సరే హీరోయన్లు మాత్రం ఇద్దరు. హీరోగా ఎలాంటి పవర్‌ఫుల్‌ మాస్ హీరోలు అంటే.. సింగిల్ హ్యాండ్‌తో సినిమాని ఎత్తగల స్టామినా హీరోలకు కూడా ఇద్దరు హీరోయిన్ల సమస్య తప్పడం లేదు. ఎందుకు ఇద్దరు హీరోయన్లు అంటే గ్లామర్ గురించి అన్నది చాలా వీజీగా వచ్చే సమాధానం. అదెప్పుడో ఎవరో మొదలెట్టారు.. ఇంక అక్కడ నుంచి ఆ అలవాటు జాడ్యంలా పట్టుకుంది. ఒక హీరోయిన్ దొరకడమే కష్టమైపోతోంది. అలాంటిది ఇద్దరు హీరోయిన్లను ఎక్కడనుంచి తీసుకురావాలి? ఇదీ ఇప్పుడు నిర్మాతలను పట్టి పీడిస్తున్న సమస్య.

మొన్నీ మధ్య ఓ పెద్ద హీరో సినిమాకి మొదటి హీరోయిన్నే సరిగా సెట్ అవలేదు. ఇంకో హీరోయిన్ ఎలా...నిర్మాతకి తెల్లమొహం తప్పలేదు. పోనీ ఏ హీరోయిన్ అంటే ఆ హీరోయిన్ పెట్టుకుంటే సదరు హీరోగారు మొహం ఎత్తరు. ఆ పరిస్థితి నిర్మాతకి ఓ పెద్ద అగ్నిపరీక్ష. ఉన్న హీరోయిన్లలో కొందరికి మార్కెట్ పోయింది. స్టేల్ అయిపోయిన హీరోయిన్ల లిస్టు పెద్దదే ఉందిప్పుడు. పెద్ద హీరోలకు కాజల్ తప్పితే మరో పేరు వినిపించడం లేదు. కాజల్ ఎన్ని సినిమాలు చేయగలదు? ఎందరికి డేట్స్ అడ్జస్ట్ చేయగలదు? తమన్నా వంటి వాళ్ళను బయ్యర్లు, పంపిణీదారులు అడ్డుకుంటున్నారు. అంటే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుష్క ఉన్నా లేనట్టే అయిపోయింది. ఇంకేముంది? మనవాళ్ళు ముంబై మీద పడుతున్నారు.. కొత్త వాళ్ళ కోసం. 

లో బడ్జెట్ సినిమాలకైతే కొత్తవాళ్ళు ఫరవాలేదనుకుంటారు కొంతమంది. హై బడ్జెట్ సినిమాలకి ఎలా? మార్కెట్ ఉన్న హీరోయిన్ అయితే గానీ పెద్ద సినిమాలకి బ్యాలెన్స్ అవదు. ఈ గొడవంతా ఎక్కడ నుంచి వచ్చిందంటే ఇదిగో ఈ ఇద్దరు హీరోయిన్ల దగ్గరనుంచే. పెద్ద హీరోలనుకున్నవాళ్ళకి ఇద్దరు హీరోయిన్లు అవసరమా? వాళ్లే సినిమాని భుజాల మీద మోసుకెళ్ళగలిగేంత స్టామినా ఉండి కూడా ఇద్దరు హీరోయిన్ల గురించి ఆలోచిస్తున్నారని ఓ నిర్మాత వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి పోవాలంటే కథల ఎంపిక టైంలోనే దర్శకనిర్మాతలు జాగ్రత్త పడితే తప్ప ఈ ఇద్దరు హీరోయిన్ల బెడద తప్పదు. ఓ రకంగా చెప్పాలంటే ఇద్దరు హీరోయిన్ల ట్రెండ్ కూడా పాతబడిపోయింది. ఈ మధ్య హిట్ అయిన క్రాక్, ఉప్పెన వంటి సినిమాలు సింగిల్ హీరోయిన్‌తో బాక్సాఫీసు దగ్గర నెగ్గుకువచ్చినవే.

సింగిల్‌ హీరోయిన్లతోనైనా హిట్స్‌ కొట్టవచ్చని కొందరు నిరూపిస్తున్నా.. మనవాళ్ళు కొందరు ఇంకా డబుల్ గ్లామర్ డీల్ నుంచి బైటపడలేకపోతున్నారు. సెకండ్ హీరోయిన్ అన్న గొడవని వదిలించుకోలేకపోతున్నారు. సెకండ్ హీరోయిన్‌గా ఒప్పుకోవడానికి కొందరు పెడమొహం పెడుతుంటే వాళ్ళని బుజ్జగించలేక నిర్మాతల తల ప్రాణం తోకలోకి వస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయే.. అవి కూడా నిర్మాతలకి పెద్ద ఛాలెంజ్ అయికూర్చుంది. కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేస్తూ కొందరు బడా నిర్మాతలు హీరోయిన్ల చేతే ఐటమ్ సాంగ్స్ చేయించి కోట్లరూపాయల ముడుపులు చెల్లించడంతో అదో ట్రెండ్ దాపురించింది. ఓ సినిమాలో తమన్నా చేస్తే, మరో సినిమాలో అదే రేంజ్ హీరోయిన్ చేత ఐటమ్ సాంగ్ చేయించకపోతే ఇంత పెద్ద సినిమాకి అదో మైనస్ పాయింట్ అవుతోంది. ఒక తలనొప్పి కాదు నిర్మాతలకి.

Advertisement
Advertisement
Advertisement