‘డబుల్‌’ ఎదురుచూపులు

ABN , First Publish Date - 2020-12-02T05:35:25+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న డబుల్‌బెడ్‌ రూమ్‌ గృహాల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉట్నూర్‌ ఏజెన్సీలోని గ్రామీణ ప్రజలకు ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహ నిర్మాణాలు ఇంకా అందుబాటులోకి రాక పోవడంతో గిరిజన ప్రాంతాల ప్రజలు అసంతృప్తికి లోనవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే భిన్నంగా గృహ నిర్మాణాలు చేపట్టి ప్రజలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌లు అందుబాటులోకి తెస్తామని ప్రకటించి ఆరేళ్లు కావస్తున్నా నిర్మాణాలు పూర్తి కావడం లేదు.

‘డబుల్‌’ ఎదురుచూపులు
ఉట్నూర్‌లో నిర్మాణాలు పూర్తయిన డబుల్‌బెడ్‌రూమ్‌ గృహాలు

ఉట్నూర్‌, డిసెంబరు 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న డబుల్‌బెడ్‌ రూమ్‌ గృహాల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉట్నూర్‌ ఏజెన్సీలోని గ్రామీణ ప్రజలకు ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహ నిర్మాణాలు ఇంకా అందుబాటులోకి రాక పోవడంతో గిరిజన ప్రాంతాల ప్రజలు అసంతృప్తికి లోనవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే భిన్నంగా గృహ నిర్మాణాలు చేపట్టి ప్రజలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌లు అందుబాటులోకి తెస్తామని ప్రకటించి ఆరేళ్లు కావస్తున్నా నిర్మాణాలు పూర్తి కావడం లేదు. ఒక ఉట్నూర్‌లో మాత్రం 80 గృహాలు ఒక్కొక్కటి రూ.5.04 లక్షలతో నిర్మించి పూర్తి చేశారు. ఇంద్రవెల్లి మండల కేం ద్రంలో 80 గృహాలు మంజూరయినప్పటికీ అధికారులు 71 గృహాలకు మాత్రమే టెండర్లు పిలవడంతో కాంట్రాక్టర్లు 35 ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతుండగా మ రో 36 ఇళ్లకు స్థలాలు చూపించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారు.

మండలానికి 80 గృహాలు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహ నిర్మాణాలలో ఖానాపూర్‌ నియోజక వర్గానికి నాలుగు వందల గృహాలు మంజూరయ్యాయి. ఉట్నూర్‌ మండలానికి 80 గృహాలు మంజూరు చేశారు. ఉట్నూర్‌ పట్టణంలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి 2017లో 80 గృహాల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఒక్కొక్క ఇల్లు రూ.5.04 లక్షలు వెచ్చించి ప్రభుత్వం  నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటికే గృహాల కోసం ఇల్లు లేని వారు రెవెన్యూ అధికారులకు సుమారు వెయ్యి మంది దరఖాస్తులు చేసుకొని ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ముందుగా ప్రభుత్వం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లక్కీలాటరీ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని భావించినప్పటికీ ఆ తర్వాత కలెక్టర్‌ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించింది. దీంతో ఉట్నూర్‌లో నిర్మాణం పూర్తయిన ఇళ్లను ఎప్పుడు తమకు అందిస్తారా అని లబ్ధిదారులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఉట్నూర్‌లో నిర్మాణాలు పూర్తయ్యాయి..

: రాథోడ్‌ భీంరావు, ఈఈ, ఉట్నూర్‌

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉట్నూర్‌లో 80 డబుల్‌ బెడ్‌రూమ్‌ నిర్మాణాలు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు సైతం చెల్లిస్తున్నాం. రెవెన్యూ అధికారులకు ఇళ్లను అప్పగించిన అనంతరం లబ్ధిదారుల ఎంపిక చేసి ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం జరుగుతుంది. 

Updated Date - 2020-12-02T05:35:25+05:30 IST