కేసీఆర్‌ నేతృత్వంలోనే డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-07-04T06:22:58+05:30 IST

దేశంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు రావడం ఖాయమని, అయితే అది సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోనే సాధ్యమని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

కేసీఆర్‌ నేతృత్వంలోనే డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి

 నదీ జలాల్లో వాటాలను తేల్చకుండా నాన్చుతున్న కేంద్రం 

 రైతులకు అన్యాయం చేసిన ప్రఽధాని మోదీ 

 ఆయన మాటల్లో అన్నీ అబద్ధాలే 

 విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), జూలై 3: దేశంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు రావడం ఖాయమని, అయితే అది సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోనే సాధ్యమని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చిన సందర్భాలు లేవన్నారు. రైతులకు తీరని అన్యాయం చేసిన కేంద్రం, ధాన్యం కొన్నామని అబద్ధాలు చెప్పడం దుర్మార్గమన్నారు. విద్యుత్‌ రంగంలో సాధించిన విజయాలు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకలని, ఆ విజయాల వెనుక సీఎం కేసీఆర్‌ దార్శనికత ఉందన్నారు. వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కు కావాలని ఎప్పటి నుంచో కోరుతుంటే దానికే అనుమతి ఇవ్వని కేంద్రం ఇప్పుడు తెలంగాణలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. సీఎం కేసీఆర్‌ వేసిన ప్రశ్నలకు ప్రధాని మోదీ డిఫెన్స్‌లో పడినట్లు కనిపించిందని, లేదంటే జవాబులు చెప్పేవారన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చేసిందేమిలేదన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వాటాల విషయంలో నాన్చుడు ధోరణి అవలంభిస్తూ రెండు రాష్ర్టాల మధ్య గొడవ పెంచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ గురించి ఏం మాట్లాడినా అభాసుపాలవుతాననే భయంతో ప్రధాని మోదీ తడబడుతూ మాట్లాడారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని తొక్కిపట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. 


 ‘దళితబంధు’తో సామాజిక మార్పు

సంస్థాన్‌నారాయణపురం: దళితబంధు పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సామాజిక మార్పు, అభివృద్ధి విప్లవానికి శ్రీకారం చుట్టారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం గుడిమల్కాపురం, చిమిర్యాల గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి దళితబంధు యూనిట్లను పంపిణీచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించినప్పటినుంచి దళితవర్గాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదన్నారు. అణగారిన దళితవర్గాలను అభివృద్ధిపథంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. అంటరానితనం నిర్మూలన, సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపి దళితులను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిపర్చాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఈ నిధులను మధ్యవర్తుల ప్రమేయంలేకుండా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తోందన్నారు. 

Updated Date - 2022-07-04T06:22:58+05:30 IST