Abn logo
Nov 22 2020 @ 03:16AM

డబుల్‌..ట్రబుల్‌!

9,700 కోట్లు మొత్తం వ్యయం 

ఇంకా అమలుకు నోచుకోని డబుల్‌ ఇళ్ల హామీ

2014 నుంచి ప్రతి ఎన్నికలోనూ ప్రస్తావన


ఈ ఏడాది చివరికి హైదరాబాద్‌లో లక్ష, జిల్లాల్లో 2 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పూర్తి చేస్తాం. లేకపోతే, ప్రజలను ఓట్లు అడగబోము. కేవలం 9 నెలల్లోనే 2 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తా. లేకపోతే, ఓట్లు అడగను.

- 2017 మార్చి 18న బడ్జెట్‌ చర్చలో భాగంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌


ఏప్రిల్‌నాటికి (2019) ‘డబుల్‌’ ఇళ్లు నిర్మించి ఇస్తాం. త్వరగా పూర్తి కావడానికి రాత్రిపూట కూడా పనులు కొనసాగి స్తున్నాం. మారుతున్న విధానాలకు అనుగుణంగా మా విధానాలను కూడా మార్చుకుంటున్నాం. లబ్ధిదారులకు జాగా ఉన్నచోటనే రూ.5 లక్షలు ఇస్తాం. వారు అక్కడే ఇళ్లు కట్టుకోవచ్చు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పేదల కోసం లక్ష ఇళ్లను నిర్మిస్తున్నాం.

- 2018 డిసెంబరు 2న (అసెంబ్లీ ఎన్నికలకు ఐదు రోజుల ముందు) డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల ముందు మేనిఫెస్టోలోనే ప్రకటించాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాదు.. పక్కనే ఉన్న ఏపీలో కూడా ఈ పథకం అమల్లో లేదు. హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే 1000 ఎకరాల స్థలాలను గుర్తించాం. వీటిలో లక్ష ఇళ్లను నిర్మిస్తాం.

                                             - 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌


హైదరాబాద్‌లోని పేదల కోసం 111 ప్రదేశాల్లో సుమారు లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్నాం. మొత్తం వ్యయం రూ.9,700 కోట్లు. హైదరాబాద్‌ శివారులోని కొల్లూరులో 124 ఎకరాల్లో  15,660 ఇళ్ల నిర్మాణంజరుగుతోంది. ఇక్కడ మౌలిక సదుపాయాలన్నీ కల్పించాం.

                                                        - ఇటీవల ప్రగతి నివేదిక విడుదల సందర్భంగా మంత్రి కేటీఆర్‌


ప్రసార మాధ్యమంలో మంత్రి కేటీఆర్‌

గ్రేటర్‌ పేదలకు లక్ష ఇళ్లు ఇస్తామన్న కేసీఆర్‌.. ఐదేళ్లలో ఇచ్చింది 2,500 మాత్రమే

వివిధ దశల్లో 98 వేల ఇళ్ల నిర్మాణం.. పూర్తైనవి 40 వేలు.. తుదిదశలో 35 వేలు

మిగిలిన వాటి నిర్మాణం వేర్వేరు దశల్లో.. వచ్చిన దరఖాస్తులు 6 లక్షలకుపైనే

పూర్తయినా పంపిణీకి నోచుకోని ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపిక చేపట్టని సర్కారు

ఇల్లు దక్కని వారినుంచి వ్యతిరేకత వస్తుందనే.. ఎన్నికల ముందు పంపిణీకి నో

ఆరున్నరేళ్లైనా ఫలించని నిరీక్షణ.. లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలూ కరువు


హైదరాబాద్‌, మేడ్చల్‌, రామచంద్రాపురం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల హామీనే అత్యంత కీలకమైంది. ఆ తర్వాత, 2016 జనవరిలో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలోనూ ఇదే హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఐడీఎల్‌ కాలనీలో అప్పటికే నిర్మించి 376 మందికి (అప్పటికే నివాసమున్న వారి స్థలంలోనే) ఇచ్చిన కొన్ని ఇళ్లను నమూనాగా చూపుతూ లక్ష కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. 2018 ఎన్నికల సమయంలోనూ జిల్లాల్లో 2 లక్షలు, హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ ఇళ్లను నిర్మించి ఇస్తామన్న హామీని పునరుద్ఘాటించారు.


ఇప్పుడు మరోసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మరో పది రోజుల్లో జరగనున్నాయి. ఐడీఎల్‌ కాలనీ కాకుండా ఇప్పటి వరకూ దాదాపు 2000 ఇళ్లను మాత్రమే పంపిణీ చేశారు. వీరంతా తమ గుడిసెలు లేదా పాత ఇళ్లను కోల్పోవడం ద్వారా అదే ప్రాంతంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులు మాత్రమే. కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటిని కూడా లబ్ధిదారులకు అందించలేదు. జూన్‌, జూలైల్లో నిర్వహించిన సమీక్షల సందర్భంగా, ఈ ఏడాది డిసెంబరు నాటికి 92 వేలఇళ్లను దశలవారీగా పూర్తి చేస్తామని కేటీఆర్‌ పలుసార్లు చెప్పారు. కానీ, ఇప్పటికీ లబ్ధిదారుల ఎంపిక జరగలేదు.


లబ్ధిదారుల ఎంపికే సమస్య

హైదరాబాద్‌ నగరంలోని పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు  ఉచితంగా నిర్మించి ఇచ్చి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వారి మద్దతు పొందాలనుకున్న ప్రభుత్వానికి అవే సమస్యగా మారినట్లు కనిపిస్తోంది. ఇళ్ల కోసం ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం, నిర్మించిన ఇళ్లు మాత్రం తక్కువ సంఖ్యలో ఉండడమే ఇందుకు కారణం.  హైదరాబాద్‌ నగరంలో ఇళ్ల నిర్మాణానికి తగిన స్థలం లేకపోవడంతో శివార్లలోని మేడ్చల్‌ జిల్లాలో 36 ప్రాంతాల్లో 36,288 ఇళ్ల నిర్మాణం చేపట్టారు.


మేడ్చల్‌ నియోజకవర్గంలో కీసర మండలంలోని రాంపల్లిలో 6,240 ఇళ్లు, అహ్మద్‌గూడలో 4,428, భోగారంలో 1,080, ఘట్‌కేసర్‌ మండంలోని కొర్రెములలో 800, ప్రతాపసింగారంలో 2,208, శామీర్‌పేట్‌ మండలంలోని తూంకుంటలో 1,656, మురహరిపల్లిలో 2,484, జవహర్‌నగర్‌లో 2,240 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో పనులు దాదాపు పూర్తయ్యాయి. కొల్లూరు-1లో తొమ్మిది అంతస్తులతో నిర్మిస్తున్న 2,052 ఇళ్లు ఇప్పటికే పూర్తికాగా.. వర్షాల కారణంగా రోడ్డు, పచ్చదనం పనులు ఆలస్యమయ్యాయని నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నెలాఖరు నాటికి పూర్తి చేసి ఇళ్లను ప్రభుత్వానికి అందిస్తామన్నారు.  కొల్లూరు-2లో 15,660 ఇళ్ల నిర్మాణ పనులు కూడా పూర్తయినట్లు, ఇళ్లకు రెండో దఫా రంగులు వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈదుల నాగులపల్లిలో నీటి వసతి కల్పన మాత్రమే పెండింగ్‌లో ఉందని తెలిపారు. కాగా, హైదరాబాద్‌ నగర పేదల కోసం 111 ప్రాంతాల్లో 98 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు సర్కారు చెబుతోంది. వీటిలో 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయింది.


మరో 35 వేల ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరింది. మిగిలిన వాటి నిర్మాణం వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ నాటికి పూర్తవుతుందని అంచనా. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఈ ఇళ్లను వేగంగా పూర్తి చేసి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, గ్రేటర్‌ పరిధిలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కోసం 6 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి వస్తే.. సుమారు 5 లక్షలకుపైగా కుటుంబాలకు ఇళ్లు దక్కే పరిస్థితి లేదు. వారిలో అసంతృప్తి నెలకొంటుంది. ఈ ప్రభావం గ్రేటర్‌ ఎన్నికలపై చూపుతుందన్న భయంతోనే లబ్ధిదారుల ఎంపికను వ్యూహాత్మకంగా నిలిపి వేసిందని, ఇళ్ల పంపిణీని చేపట్టలేదనే విమర్శలున్నాయి. మరోవైపు కరోనా ప్రభావంతో ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని మంత్రు లు చెబుతున్నారు. అయితే, కరోనా 6 నెలలుగా మాత్రమే ఉందని, అన్‌లాక్‌తో నిర్మాణ రంగం పుంజుకున్నట్లు ప్రభుత్వమే చెబుతోందని ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. డబుల్‌ బెడ్‌రూం పథకం హామీకి ఆరున్నరేళ్లు గడిచిందని వివరిస్తున్నాయి.


లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలేవీ?

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలూ విడుదల చేయలేదు. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు వంటి పలు డాక్యుమెంట్లను ప్రామాణికంగా తీసుకోవాలని భావించినా.. నిబంధనలు ఖరారు చేయలేదు. మరోవైపు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో 10 శాతం స్థానిక కోటా ఏమైందని మేడ్చల్‌ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇళ్లను తమకు ఇవ్వకుండా హైదరాబాద్‌ నగరవాసులకు ఇవ్వడమేంటని గతంలోనే వారు ప్రశ్నించడంతో ఈ విషయాన్ని మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి 2017లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, 10 శాతం ఇళ్లను స్థానికులకు ఇస్తామని మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీని అమలు చేసే విషయమై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు.


ఆరున్నరేళ్లు గడిచినా..

డబ్బా ఇళ్లకు బదులు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తామన్న హామీ ఇచ్చి ఆరున్నరేళ్లు దాటింది. ఇప్పటికి 2.60 లక్షల ఇళ్ల (జీహెచ్‌ఎంసీ సహా)కు మాత్రమే ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. కానీ, వీటి కోసం 20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇందులో జీహెచ్‌ఎంసీలోనే 6 లక్షల పైగా ఉన్నాయి. రాష్ట్రంలో సుమారు లక్షన్నర ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నట్లు సమాచారం. కానీ, ఎర్రవల్లి సహా పలు గ్రామాల్లో లబ్ధిదారులకు అందిన ఇళ్లు వేలల్లోనే. ఇటీవల నిజామాబాద్‌, ఖమ్మంలలో అక్కడక్కడా లబ్ధిదారులకు  ఇళ్తు అందజేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement