డబుల్‌.. ధమాక..!

ABN , First Publish Date - 2022-01-28T17:01:41+05:30 IST

125 ఎకరాల విస్తీర్ణం, రూ.1,422 కోట్ల వ్యయం, 115 బ్లాక్‌లు.. 11 అంతస్తులు, 15,600 ఇళ్లు.. పేదల కోసం కొల్లూరులో నిర్మించిన దేశంలోనే అతిపెద్దదైన

డబుల్‌.. ధమాక..!

 కొల్లూరులో రెండు పడకల ఇళ్లు సిద్ధం

 పేదల కోసం ఆదర్శంగా ఆత్మగౌరవ గృహాలు

 రహదారుల నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు  సకల సదుపాయాల కల్పన

 రూ.1,422 కోట్ల వ్యయంతో 15,600 ఇళ్ల నిర్మాణం పూర్తి

పంపిణీ ఎప్పుడు.. లబ్ధిదారుల ఎంపిక ఎలా..? 


హైదరాబాద్‌ సిటీ:  125 ఎకరాల విస్తీర్ణం, రూ.1,422 కోట్ల వ్యయం, 115 బ్లాక్‌లు.. 11 అంతస్తులు, 15,600 ఇళ్లు.. పేదల కోసం కొల్లూరులో నిర్మించిన దేశంలోనే అతిపెద్దదైన ఆత్మగౌరవ గృహాల సముదాయం ఇది. రహదారులు, తాగునీరు, సివరేజీ నెట్‌వర్క్‌, విద్యుత్‌ సరఫరా వంటి మౌలిక సదుపాయాలతో పాటు ప్రత్యేక ఆస్పత్రి, పాఠశాల, పార్కులు వంటివి ఇక్కడి ప్రత్యేకత. దాదాపు 50 నుంచి 60 వేల మంది నివసించే కొల్లూరులో బస్‌ టర్మినల్‌, పోలీస్‌ స్టేషన్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, క్రీడా సముదాయాలు, వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లతోపాటు పెట్రోల్‌ బంక్‌, పోస్టాఫీస్‌, ఏటీఎం, ఫైర్‌ స్టేషన్‌ వంటివి ఉన్నాయి.


ఆదర్శ ఆత్మగౌరవ గృహాలంటూ ప్రాజెక్టు ప్రారంభించిన నాటినుంచి చెబుతోన్న ప్రభుత్వం ఇక్కడ సకల సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇళ్ల నిర్మాణంతోపాటు సౌకర్యాల కల్పన పూర్తయ్యిందని, పంపిణీకి ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని గురువారం విడుదల చేసిన ప్రకటనలో జీహెచ్‌ఎంసీ పేర్కొంది. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే క్రమంలో వారికి ఉచితంగా అందించేందుకు గ్రేటర్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రెండో విడతలో భాగంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఉన్న కొల్లూరులో 15,600 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. స్టిల్ట్‌ ప్లస్‌ 11 అంతస్తులుగా నిర్మించిన గృహ సముదాయంలో ఒక్కోబ్లాక్‌కు రెండు చొప్పున 234 లిఫ్టులు ఏర్పాటు చేశారు. నిర్వహణ కోసం అద్దెలు సమకూరేలా దుకాణాలను నిర్మించారు.


ఆదేశాలు ఎప్పుడు..? 

గ్రేటర్‌లోని 111 ప్రాంతాల్లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ప్రారంభించగా.. ఇప్పటి వరకు 50 వేలకుపైగా ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు 3 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొల్లూరు ఇళ్లూ సిద్ధమయ్యాయి. అయితే ఇప్పటికీ పంపిణీపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక జరగకపోవడమే పంపిణీలో జాప్యానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.


నగరంలోని లక్ష ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1,500 కోట్ల నిధులు వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకు రూ.800 కోట్ల మేర నిధులు ఇవ్వగా.. లబ్ధిదారుల జాబితా ఇవ్వకపోవడంతో మిగతా నిధులు విడుదల చేయలేదు. ఇప్పటికే పూర్తయిన ఇళ్లు నిర్వహణలోపంతో అధ్వానంగా మారుతున్నాయి. సెక్యూరిటీ ఏర్పాట్లపై నిర్మాణదారులు, ఇటు జీహెచ్‌ఎంసీ చేతులెత్తేయడంతో పలు ప్రాంతాల్లో తలుపులు, కిటికీలు, విద్యుత్‌ వైర్లు దొంగిలించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందజేయడమే మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


ఇవీ ప్రత్యేకతలు..

ఆరు నుంచి 36 మీటర్ల వెడల్పు ఉండేలా 13.50 కి.మీ.ల మేర రహదారులు 

21 వేల కిలోలీటర్ల సామర్థ్యంతో అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌

అండర్‌  గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌ వ్యవస్థ

కామన్‌ ఏరియాలో దీపాలు, లిఫ్టులకు విద్యుత్‌ సరఫరా 

మురుగు నీటి శుద్ధికి సివరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌. దీనికి నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగేలా ఏర్పాట్లు 

శుద్ధి చేసిన జలాలను గృహ సముదాయంలోని గ్రీనరీ కోసం వినియోగించేలా ప్రత్యేక పైపులైన్‌ వ్యవస్థ 

వర్షపు నీటిని ఒడిసి పట్టేలా ఇంకుడు గుంతల నిర్మాణం 

మురుగు నీటి డ్రైన్‌లపై 10.55 కి.మీ.ల మేర వాకింగ్‌ ట్రాక్‌ 

10.60 కి.మీ.ల మేర భూగర్భ పైపులైన్‌ వ్యవస్థ 

137 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 528 వీధి దీపాల స్తంభాలు. 11 హైమాస్ట్‌ లైట్‌ పోల్‌ వ్యవస్థ 

54 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలోని మూడు షాపింగ్‌ కాంప్లెక్సుల్లో 118 దుకాణాలు

Updated Date - 2022-01-28T17:01:41+05:30 IST