‘డబుల్‌’ లొల్లి..! లంబాడీతండాలో ఆందోళన

ABN , First Publish Date - 2021-01-13T06:55:33+05:30 IST

లంబాడీ తండాలో

‘డబుల్‌’ లొల్లి..!  లంబాడీతండాలో ఆందోళన


టీఆర్‌ఎస్‌ నేతలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు

తమ వర్గానికి కింద అంతస్తులో.. ఇతరులకు పై అంతస్తులో..

ఎమ్మెల్యేకు, అధికారులకు లబ్ధిదారుల ఫిర్యాదులు


బాగ్‌లింగంపల్లి లంబాడీ తండాలో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపు ఆందోళనకు దారి తీస్తోంది. మంత్రి కేటీఆర్‌ చెప్పినట్లుగా లక్కీ డ్రా ద్వారా అలాట్‌మెంట్‌ చేయకుండా బస్తీ పెద్దలు, టీఆర్‌ఎస్‌ నేతలు కుమ్మక్కై నచ్చినవారికి కావాల్సిన ఫ్లాట్‌ అందిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లంబాడీతండాలో పలువురు లబ్ధిదారులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆందోళనలు కొనసాగాయి. 


రాంనగర్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : లంబాడీ తండాలో సిల్ట్‌ ప్లస్‌ సెల్లార్‌ ప్లస్‌ తొమ్మిది అంతస్తుల చొప్పున 12 ఫ్లాట్లను నిర్మించారు. ఈ నెల 9న మంత్రి కేటీఆర్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్‌ ఆలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, స్థానిక కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి, తాజా కార్పొరేటర్‌ కె.రవిచారి వీటిని ప్రారంభించారు. సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ఇళ్ల కేటాయింపు లక్కీ డ్రా ద్వారా జరగాలని జీహెచ్‌ఎంసీ హౌసింగ్‌, రెవెన్యూ అధికారులకు సూచించారు. కానీ అధికారులు లబ్ధిదారులతో సమావేశం పెట్టి అందరి సమక్షంలో డ్రా తీసి ఇళ్లను కేటాయించలేదు. స్థానిక బస్తీ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ నేత కల్యాణ్‌నాయక్‌తోపాటు బస్తీ పెద్దలకు ఆ బాధ్యత అప్పగించారు. వారు లక్కీ డ్రా ప్రకారం కాకుండా తమ అనుయాయులు, బంధువులకు 1, 2, 3, 4 అంతస్తులలో ఇళ్లను కేటాయించి మిగతా వారికి 5, 6, 7,8, 9వ అంతస్తులలో కేటాయించారు. వృద్ధులు, దివ్యాంగులైన లబ్ధిదారులకు కూడా 6, 7వ అంతస్తులో కేటాయింపు జరగడం పట్ల స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో కేటాయింపు గందరగోళంగా మారింది. చాలా మంది తమకు అన్యాయం జరిగిందంటూ ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, రాంనగర్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి, హిమాయత్‌నగర్‌ తహసీల్ధార్‌ లలితకు ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి 7 గంటలకు బస్తీ నాయకుల ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ ధర్నా చేశారు. చిక్కడపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు.


లక్కీ డ్రా తీయాలి - లబ్ధిదారురాలు కుమార్తె చావలి

లంబాడీ తండాలో ఇళ్లను లక్కీ డ్రా లేదా సీనియారిటీ ప్రకారం కేటాయించాలి. లంబాడీ తండాలో మా తల్లిదండ్రులు అయిదు దశాబ్ధాలుగా ఉన్నారు. వారు ప్రస్తుతం వయోభారం మోస్తున్నారు. వారికి కింది అంతస్తులో ఇవ్వలేదు. కనీసం లక్కీ డ్రా కూడా తీయలేదు. 6వ అంతస్తు తీసుకొమ్మని చెప్పడం ఎంతవరకు సబబు. దీనిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశాను. న్యాయం జరగకపోతే బస్తీలో నిరాహార దీక్ష చేస్తా.


ఇష్టానుసారంగా కేటాయింపు చేశారు - లబ్ధిదారుడు శ్రీనివాస్‌

ఇళ్ల కేటాయింపులో టీఆర్‌ఎస్‌ నాయకులు, బస్తీ అధ్యక్షుడు ఇష్టానుసారంగా కేటాయింపులు చేస్తున్నారు. నేను బస్తీ వెలిసిన నాటి  నుంచీ ఇక్కడే ఉన్నాను. భార్య లేదు. వృద్ధుడిని. నాకు పై అంతస్తులో ఇల్లు ఇచ్చారు. ఏ పద్ధతిలో ఇచ్చారో  నాకు ఆర్థం కావడం లేదు. దీనిపైవిచారణ జరిపించాలి. 


అందరికీ ఆమోద యోగ్యంగానే.. - కల్యాణ్‌ నాయక్‌, లంబాడీ తండా బస్తీ అధ్యక్షుడు

తండాలో అందరి లబ్ధిదారుల ఆమోదం ప్రకారం కేటాయింపు చేశాం. కొంత మంది కావాలనే గొడవ చేస్తున్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే దానిని పరిశీలించి న్యాయం చేస్తాం. అధికారులు ఇచ్చిన లిస్టు ప్రకారం ఇళ్ల కేటాయింపు చేస్తున్నాం. 

Updated Date - 2021-01-13T06:55:33+05:30 IST