డోసులు దండి.. పంపిణీ మందకొడి

ABN , First Publish Date - 2021-10-19T07:05:52+05:30 IST

డోసులు దండిగా ఉన్నా దేశంలో కొన్ని రోజులుగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ మందగించింది. గత నెలలో పెద్దఎత్తున సాగిన వ్యాక్సినేషన్‌..

డోసులు దండి.. పంపిణీ మందకొడి

రాష్ట్రాల వద్ద పది కోట్లకు పైగా టీకాలు 

అయినా రోజువారీ వ్యాక్సినేషన్‌ నెమ్మది

రెండో డోసు ముమ్మరంపై కేంద్రం దృష్టి


డోసులు దండిగా ఉన్నా దేశంలో కొన్ని రోజులుగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ మందగించింది. గత నెలలో పెద్దఎత్తున సాగిన వ్యాక్సినేషన్‌.. అక్టోబరుకు వచ్చేసరికి   వెనుకబడింది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద ఆరు రోజులుగా 10 కోట్లపైగానే టీకాలున్నా పంపిణీ అందుకుతగ్గ స్థాయిలో లేదు. శనివారం నాటికి 11.12 కోట్ల డోసులు నిల్వ ఉండగా.. ప్రజలకు ఇచ్చింది 38 లక్షల టీకాలే. బుధవారం 8.50 కోట్ల టీకాలకు పంపిణీ జరిగింది 50 లక్షలు. ఇక గురువారం దాదాపు 9 కోట్ల డోసులున్పటికీ 27 లక్షల మందికే వ్యాక్సిన్‌ వేశారు. శుక్రవారం 9 లక్షల మందికే ఇచ్చారు. సెప్టెంబరులో ఉధృతంగా సాగిన వ్యాక్సినేషన్‌ ఇప్పుడెందుకిలా పడిపోయిందనే చర్చ సాగుతోంది. 


డోసుల మధ్య గడువు పెంపే కారణం

కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచడమే దీనంతటికీ కారణమన్న వాదన వినిపిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 98 కోట్ల మంది టీకా పొందితే.. ఇందులో 86 కోట్లమందిపైగా (87 శాతం) కొవిషీల్డ్‌ తీసుకున్నవారే. కాగా, మే నెలలో టీకాల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొవిషీల్డ్‌ రెండో డోసు గడువును 12-16 వారాలకు పెంచింది. ఆ నిర్ణయం ప్రభావం ఇప్పుడు వ్యాక్సినేషన్‌పై పడినట్లు స్పష్టమవుతోంది.అక్టోబరులో రోజువారీ సగటు వ్యాక్సినేషన్‌ 50 లక్షలకు పడిపోవడమే దీనికి నిదర్శనం. దీంతో కొవిషీల్డ్‌ డోసుల వ్యవధిపై కేంద్రం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. రెండో డోసు పంపిణీ  పంపిణీ ముమ్మరానికి, ప్రజలను చైతన్యం చేసేలా రాష్ట్రాలకు సూచనలివ్వాలని నిర్ణయించింది. కాగా.. కొవిడ్‌పై పోరులో భారత టీకా విధానం అత్యంత ప్రభావశీలమైనదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో మొదటి డోసు వందశాతం పంపిణీ సందర్భంగా మోదీ ట్వీట్‌ చేశారు. దేశంలో ఆదివారం 13,596 మందికి కరోనా నిర్ధారణ అయుంది. 166 మంది చనిపోయారు. 20 వేల మంది కోలుకున్నారు. 


రష్యాలో ఒక్క రోజే 34 వేల కేసులు

రష్యాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఎన్నడూ లేనంతగా సోమవారం 34,325 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 998 మంది చనిపోయారు. అమెరికా విదేశాంగ మాజీ  మంత్రి కొలిన్‌ పావెల్‌ కొవిడ్‌ అనంతర సమస్యలతో మృతిచెందారు. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అయిన తొలి నల్లజాతీయుడు పావెల్‌.

Updated Date - 2021-10-19T07:05:52+05:30 IST