విషదోషాలకు విరుగుడు తామరాకుల కూర

ABN , First Publish Date - 2022-01-29T05:30:00+05:30 IST

తామరాకుల పైన నీరంటదు. జారిపోతుంది. సూక్ష్మదర్శినితో పరిశీలిస్తే వాటి పై పొరల్లో మైనపు పొర కనిపిస్తుంది. అది కొన్నిరకాల లిపిడ్సుతో తయారౌతుంది....

విషదోషాలకు విరుగుడు తామరాకుల కూర

తామరాకుల పైన నీరంటదు. జారిపోతుంది. సూక్ష్మదర్శినితో పరిశీలిస్తే వాటి పై పొరల్లో మైనపు పొర కనిపిస్తుంది. అది కొన్నిరకాల లిపిడ్సుతో తయారౌతుంది. ఈ పొర నీళ్లనే కాదు, దుమ్ము కూడా అంటకుండా జారిపోయేలా చేస్తుంది. ఇలా తనను తాను పరిశుభ్రం చేసుకునే శక్తి తామరాకులకుంది. దీన్ని ’లోటస్‌ ఎఫెక్ట్‌’ అంటారు. 


తామరాకుల పైన ఉండే ఈ మైనపు పూతనిచ్చే యంత్రాంగాన్ని కృత్రిమంగా తయారు చేసి తాజమహల్‌ లాంటి కట్టడాల మీద వాతావరణ కాలుష్యం సోకకుండా చేయటం గురించి ఇప్పుడు పరిశోధనలు సాగుతున్నాయి. ఇలాంటి సుగుణాలున్న ద్రవ్యాల్లో ఆహార యోగ్యమైన వాటిని తింటూ ఉంటే ఆయా గుణాలు మనకూ వంటబడతాయి. ఆహారయోగ్యమైన తామర లాంటి మొక్కల్ని పాట్‌హెర్బ్స్‌ అంటారు. పురుగు మందుల తాకిడికి గురైన విషపూరిత ఆకుకూరలకు ఇవి మంచి ప్రత్యామ్నాయం.


‘కమలం శీతలం వర్ణ్య మధురం కఫపిత్తజిత్ఢ్‌ తృష్ణాదాహాస్త్రవిస్ఫోటవిష విసర్పనాశనమ్‌’ చలవనిస్తాయి. చర్మానికి మంచి రంగుని కాంతిని ఇస్తాయి. రుచికరంగా ఉంటాయి. కఫాన్ని, వేడిని పైత్యాన్ని తగ్గిస్తాయి. దప్పికను తీరుస్తాయి. శరీరం మీద మంటలుగా ఉండటాన్ని తగ్గిస్తాయి. శరీరంలో విషదోషాలను పోగొట్టే యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు వీటికున్నాయి. విసర్పం లాంటి వైరస్‌ వ్యాధుల మీద ఇవి పనిచేస్తాయని భావప్రకాశ వైద్యగ్రంథం తామరల గురించి పేర్కొంది. 


తామరపూలు, ఆకులు, గింజలు, దుంపలు, లేత కాడలు అన్నీ ఔషధవిలువలు కలిగి, ఆహార యోగ్యమైన ద్రవ్యాలే! వాపును తగ్గించటం, కేన్సర్‌ కారకమైన కణాలను హరించటం, బాక్టీరియాను చంపటం, రక్తంలో షుగర్‌,  కొవ్వుల స్థాయిని తగ్గించటం, చర్మ సంరక్షణ గుణాలు తామరకున్నాయి. ఔషధ రూపంలో కన్నా ఆహారంగా తీసుకోవటమే ఉత్తమం. 


మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని పచ్చదనాన్ని ఆహార పదార్థాలుగా మలిచి వాటి గుణగణాలను వివరిస్తూ నలమహారాజు రాసిన పాకదర్పణం ఈ యుగపు అవసరాలక్కూడా ఎంతగానో ఉపయోగిస్తుంది. తామరాకులు, పూలూ, కాడలు, దుంపలు, గింజల్ని ఉపయోగించి చాలా సులభంగా కూర వండుకునే విధానాన్ని వివరించాడీ గ్రంథంలో నలుడు! 


‘పద్మపత్రం శ్వదంష్ట్రాణాం మూలేనైవ పచేద్‌ యద్ఢి స్వాదు పథ్యం లఘు హితం వృష్యం పిత్తహరం భవేత్‌’ లేత తామారాకుల్ని తీసుకుని కడిగి తుడిచి సన్నగా ముక్కలుగా తరగండి. పల్లేరుకాయల మొక్క వేళ్లను కూడా తీసుకుని కడిగి వీటితో కలిపి కొద్దిగా నీళ్లుపోసి ఉడికిస్తే తామరాకుల్లో వగరు చేదు పోతాయి. ఆ తరువాత  పల్లేరు వేళ్ళని తీసేసి భాండీలో నెయ్యి వేసి తాలింపు ద్రవ్యాలు, మీకిష్టమైన సుగంధ ద్రవ్యాలు కలిపి  బాగా మగ్గనిస్తే తామరాకుల కూర సిద్ధం అయినట్టే! అన్ని కూరలకూ చెప్పినట్టే చల్లారాక కొద్దిగా చిటికెడంత పచ్చకర్పూరం కలిపితే పరిమళభరితంగా ఉంటుంది. ఆకులతోపాటుగా తామరపూలను, లేతకాడల్ని, తామరదుంపల్ని కూడా కలిపి ఈ కూరని చేసుకోవచ్చు. 


శరీరానికి చలవనిచ్చే ద్రవ్యాలలో తామర చాలా శక్తివంతమైనది. నిరపకారి కూడా! రుచిగా ఉంటుంది. షుగరువ్యాధిలో కలిగే నరాల బలహీనత, అరికాళ్ల మంటలు, తిమ్మిర్లను తగ్గిస్తుంది. అన్ని వ్యాధుల్లోనూ తినదగినది. తేలికగా అరుగుతుంది. హితకరమైనది. పురుషుల్లో జీవకణాలను పెంచుతుంది. స్త్రీలకు గర్భాశయాన్ని పోషించి, సంతానయోగ్యతనిస్తుంది. అతివేడి వలన కలిగే లక్షణాలమీద ఇది బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వేడి శరీర తత్త్వం ఉన్న షుగరు, బీపీ రోగులకు ఇది చాలా మేలు చేస్తుంది. 

సహజంగా ఉష్ణప్రాంతాలైన తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణాన్ని పాడుచేసుకుంటూ చెట్లనూ చెరువుల్ని నిర్లక్ష్యం చేయటం వలన వేడి ఎక్కువగా మనుషుల్ని బాధిస్తోంది. తరచూ ఇలాంటి చలవనిచ్చే వంటకాలను తింటూ ఉంటే వాతావరణంలో కలిగే మార్పులకు శరీరం తట్టుకోగలుగుతుంది. అంతేకాదు, ఇది ఇమ్యూనిటీని పెంపు చేసే ఆహార ద్రవ్యం కూడా! కరోనా అలలు మునుముందు ఇంకెన్ని వస్తాయో తెలీదు. మనకు మనమే మన శరీరాలను కాపాడుకోవటానికి ఇలాంటి ఆహార ద్రవ్యాలను తీసుకుంటూ ఉండటం మంచిది. 

  గంగరాజు అరుణాదేవి


Updated Date - 2022-01-29T05:30:00+05:30 IST