Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

స్వేచ్ఛాలోచన భీతిలో పాలకులు

twitter-iconwatsapp-iconfb-icon
స్వేచ్ఛాలోచన భీతిలో పాలకులు

‘భావి కమ్యూనిస్టు సమాజ నిర్మాణానికి కమ్యూనిస్టు సిద్ధాంత ప్రబోధాలు ఎంతగా అవసరమైనప్పటికీ అవి కీడు కలిగించేవిగా నాకు కన్పించాయి. భావోద్వేగాలను రెచ్చగొట్టి మూఢ భక్తిని పెంపొందించేవిగా ఉన్నాయి. మనుషులలోని నిర్మాణాత్మక హేతు బద్ధతకు కాకుండా విద్వేష, విధ్వంసక ప్రవృత్తులకు ప్రేరణనిచ్చేవిగా ఉన్నాయి. స్వేచ్ఛాయుత మేధను అవి కట్టడి చేస్తాయి. ఆలోచనా సాహసాలను, కార్య ప్రేరణలను అవి ధ్వంసిస్తాయి’ అని బోల్షివిక్కుల గురించి డోరారస్సెల్ చేసిన వ్యాఖ్యలు నేటి భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీలు చేస్తున్న దాన్ని కచ్చితంగా, నిర్దుష్టంగా అభివర్ణించడం లేదూ?


బ్రిటిష్ స్రీవాద వైతాళికురాలు, విద్యావేత్త డోరా రస్సెల్ (1894---– 1988) ఆత్మకథ చదువుతున్నాను. మూడు సంపుటాల బృహద్గ్రంథమిది. నేను చదవడం పూర్తి చేసిన మొదటి సంపుటంలో ఎడ్వర్డియన్ ఇంగ్లాండ్ 1901-–10)లో తన పెంపకమూ, కేంబ్రిడ్జిలో తన విద్యాభ్యాసం, జెండర్ సమానత్వంపై తన భావాలు, తాను నెలకొల్పిన ప్రయోగాత్మక పాఠశాల, మహాతాత్త్వికుడు బెర్ట్రెండ్ రస్సెల్ (1871–-1970) తన వైవాహిక జీవితం గురించి డోరా విపులంగా రాసింది. 


తన తరానికి చెందిన చాలా మంది వలే డోరా సైతం బోల్షివిక్ విప్లవంతో ప్రభావితురాలయింది. ఆ మహత్తర చారిత్రక పరిణామం తీసుకొచ్చిన మౌలిక మార్పుల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు డోరా రష్యాలో విస్తృతంగా పర్యటించారు. మహోన్నత ఆదర్శాల ప్రేరితులైన బోల్షివిక్ నాయకులతో సంభాషణలు జరిపారు. సమాలోచనలు చేశారు. భగవంతుడు దోషరహితమైన పరిపూర్ణ, ఉత్తమ జగత్తును సృష్టిస్తాడని స్వప్నించిన మధ్యయుగాల క్రైస్తవ మత ధర్మవేత్తలను బోల్షివిక్‌లు జ్ఞప్తికి తెచ్చారని డోరా వ్యాఖ్యానించారు. ‘ఆ మతావిష్టుల మాదిరిగానే రష్యన్ బోల్షివిక్కులు కూడా మహా విశ్వసృష్టికర్తను అనుకరిస్తున్నారు. ఆ విశ్వకర్మ నవ గ్రహాలను శాశ్వత చలనంలో ఉంచినట్టే, పారిశ్రామిక నాగరికత ఆధారంగా ఒక నవ సమాజ నమూనాను తాము రూపొందిస్తున్నట్టు బోల్షివిక్కులు విశ్వసిస్తున్నారు. ప్రభవించనున్న నూతన సమాజంలో స్త్రీ పురుషుల మధ్య సంపూర్ణ సమానత్వం వర్థిల్లుతుందని, ప్రతి ఒక్కరూ సంఘానికి తన వంతు సేవలు అందిస్తారని వారు భావిస్తున్నారు. ఈ కొత్త హేతుబద్ధ సామాజిక వ్యవస్థ ఒకసారి ఆచరణలోకి వచ్చిన వెంటనే భౌతిక జగత్తు వలే అది సైతం శాశ్వత ఉనికిని సంతరించుకొని ప్రవర్థమవుతుందని బోల్షివిక్కులు నిండుగా నమ్ముతున్నారు’అని డోరా రాసింది. 


బోల్షివిక్కుల ఆదర్శవాదం ఎంతగా ప్రభావితం చేసినప్పటికీ వారి పిడివాద ధోరణులు డోరాకు ఎంత మాత్రం నచ్చలేదు. అప్పట్లోనే ఆమె ఇలా వ్యాఖ్యానించారు: ‘భావి కమ్యూనిస్టు సమాజ నిర్మాణానికి కమ్యూనిస్టు ప్రబోధాలు ఎంతగా అవసరమైనప్పటికీ అవి కీడు కలిగించేవిగా నాకు కన్పించాయి. భావోద్వేగాలను రెచ్చగొట్టి మూఢ భక్తిని పెంపొందించేవిగా ఉన్నాయి. మనుషులలోని నిర్మాణాత్మక హేతు బద్ధతకు కాకుండా విద్వేష, విధ్వంసక ప్రవృత్తులకు ప్రేరణనిచ్చేవిగా ఉన్నాయి. స్వేచ్ఛాయుత మేధను అవి కట్టడి చేస్తాయి. ఆలోచనా సాహసాలను, కార్య ప్రేరణలను అవి ధ్వంసిస్తాయి’. 


నవ రష్యాలో డోరా రస్సెల్ పర్యటించిన దశాబ్దం అనంతరం రవీంద్రనాథ్ టాగోర్ ఆ సోవియట్ భూమిని సందర్శించారు. పక్షం రోజుల పాటు రష్యా అంతటా ఆయన పర్యటించారు. పాఠశాలలకు వెళ్ళి బాల బాలికలతోను, ఫ్యాక్టరీలకు వెళ్ళి కార్మికులతోనూ, ఇంకా సమాజంలోని వివిధ రంగాలకు చెందిన వారితోనూ విస్తృతంగా సంభాషించారు. స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యే ముందు రష్యన్ కమ్యూనిస్టు పార్టీ పత్రిక ‘ఇజ్వెస్తియా’కు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. విద్యావ్యాప్తికి సోవియట్ ప్రజలు ఆశ్చర్యకరమైన కృషి చేస్తున్నారని రవీంద్రుడు ప్రశంసించారు. అయితే కొన్ని ఆక్షేపణలు కూడా వ్యక్తం చేశారు. ‘నేను మిమ్ములను ఒక ప్రశ్న అడిగి తీరాలి, వర్గ ద్వేషాన్ని ప్రేరేపించడం, మీ ఆశయాలతో ఏకీ భవించని వారిపై విద్వేషాన్ని రెచ్చగొట్టడం, శత్రువులుగా మీరు భావిస్తున్న వారికి వ్యతిరేకంగా హింసాత్మకంగా వ్యవహరించడం మొదలైనవి మీ ఆదర్శాఆల సాధనకు తోడ్పడుతాయా? మీరు అనేక అవరోధాలకు ఎదురొడ్డి పనిచేస్తున్నారు. తరచు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మీ లక్ష్యాలు, ఆశయాలు మీ దేశానికో లేదా మీ పార్టీకో పరిమితమైనవి కావు. యావత్ మానవాళి జీవనస్థితిగతులను మెరుగు రిచే మహోద్దాత ధ్యేయంతో మీరు కృషి చేస్తున్నారు. అయితే మీ లక్ష్యాలతో ఏకీ భవించని వారు సైతం ఆ మానవాళిలో అంతర్భాగం కాదా?’


రవీంద్రుని అభిప్రాయంలో పరిణత రాజకీయ వ్యవస్థ ఆలోచనా స్వేచ్ఛను అనుమతిస్తుంది. అభిప్రాయ బేధాలను గౌరవిస్తుంది. సమాజంలోని సకల ప్రజలు ఒకే విధంగా ఆలోచించేలా ఒత్తిడి చేయడం శ్రేయస్కరంకాదు. యాంత్రిక క్రమబద్ధత నిష్ఫలమవుతుంది. సకల మానవాళి విముక్తే మీ లక్ష్యమైతే సమాజ జీవితంలో భిన్నాభిప్రాయాలు ఉండడం చాలా సహజసిద్ధమనే వాస్తవాన్ని మీరు అంగీకరించి తీరాలి. అభిప్రాయాలు తరచు మారిపోతూనే ఉంటాయి. నిరంతరం మారిపోతుండడమే వాటి ధర్మం. మేధా శక్తులకు పూర్తి స్వేచ్ఛ ఉండి తీరాలి. నైతిక ప్రేరణలతో మార్పు సాధించాలి. హింసతో హింస మాత్రమే జనిస్తుంది. మూర్ఖత్వం ప్రబలిపోతుంది. సత్యాన్ని గ్రహించాలంటే ఆలోచనా స్వేచ్ఛ అనివార్యం. అంతేకాదు, చాలా ముఖ్యం కూడా. భీతావహ పరిస్థితులతో ఎవరూ ఏమీ సాధించలేరు’.


రవీంద్రుడు సోవియట్ రష్యాలో పర్యటించిన సంవత్సరమే (1927) విశ్వ భారతి ప్రచురిచిన ‘లెటర్స్ ఫ్రమ్ రష్యా’లో ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. రవీంద్రునితో పాటు రష్యాలో పర్యటించిన శాస్త్రవేత్త పి.సి.మహలనోబిస్ ఆ ఉత్తరాలను సంకలించారు. ఇజ్వెస్తియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కూడా ఆ పుస్తకంలో చేర్చారు. సోవియట్ రాజ్య వ్యవస్థపై విమర్శలు ఉన్నందున ఆ ఇంటర్వ్యూను ఇజ్వెస్తియా ప్రచురించి ఉండదు. కమ్యూనిస్టు భావజాల స్వతస్సిద్ధ లక్షణాలుగా వర్ధిల్లుతున్న విద్వేషం, ప్రతీకార ధోరణి పై రవీంద్రుని అభ్యంతరాలు మహలనోబిస్ మూలంగా విశాల ప్రపంచానికి, భావితరాల వారికి తెలియ వచ్చాయి. 


సరే, మళ్ళీ డోరా రస్సెల్ వద్దకు వెళదాం. సోవియట్ రష్యాలో పర్యటించిన రెండు సంవత్సరాల అనంతరం ఆమె చైనాను సందర్శించారు. ఆనాడు చైనా జాతీయ జీవనంలో ప్రభవిస్తోన్న చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకులతో ఆమె సంభాషించారు. వారి నిశ్చితాభిప్రాయాలు రష్యన్ కమ్యూనిస్టుల పిడివాద ధోరణుల కంటే తీవ్ర మైనవని డోరా భావించారు. 1921 జనవరిలో చైనా నుంచి ఒక స్నేహితునికి రాసిన ఒక లేఖలో డోరా ఇలా వ్యాఖ్యానించారు: ‘కమ్యూనిస్టు వ్యవస్థ తక్షణమే ఆవిర్భవించగలదనే విషయమై ఈ సైద్ధాంతికులకు ఒక స్పష్టమైన దార్శనికత ఉంది. అయితే అది చైనా, రష్యా రెండు దేశాలలోనూ ఒక మత విశ్వాసం కంటే భిన్నమైనది కాదు... ఆవిర్భవిస్తోన్న రాజ్యాల నిర్మాణంలో మతాలకు ఒక పాత్ర- ప్రజలను ఒక సంఘటిత సమూహంగా ఉంచడం, వారిలో సమష్టి భావాలు, ప్రేరణలను నెలకొల్పడం- ఉన్నట్టుగానే ఒక మతంగా కమ్యూనిజం కూడా అటువంటి పాత్రనే నిర్వర్తిస్తోంది. ప్రాచ్య దేశాలలో రావలసిన ఒక మార్పుకు పాశ్చాత్య ప్రపంచం ఒక మతాన్ని సమకూర్చడం చాలా వింత గొల్పడం లేదూ?’. అదే లేఖలో ఆమె ఇంకా ఇలా వ్యాఖ్యానించారు: ‘ఒక సైద్ధాంతిక వేత్త నిరంకుశ పాలన ఒక బలిసిన పెట్టుబడి దారు పెత్తనం కంటే చాలా ఘోకంగా ఉంటుంది. సైన్స్ గురించి చాలా గర్వంగా మాట్లాడే ఈ ప్రజలందరిలో వైజ్ఞానిక దృక్పథం పట్ల అవగాహనారాహిత్యం నన్ను విస్మయపరుస్తోంది’.


తీవ్ర మితవాదులు వామ పక్షా అతివాదులు పలు సమాన లక్షణాలను కలిగిఉండడం కద్దు. లక్ష్య సాధనా మార్గాల కంటే లక్ష్యాలే ముఖ్యమని, అధికారంలో ఉన్న రాజకీయవేత్తలు బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థను నియంత్రించాలని, నవలలు, పద్యాలు ఎలా రాయాలన్న విషయమై ఆదేశాలు జారీ చేసే అధికారాలు రాజ్యవ్యవస్థకు, అధికార పార్టీకి ఉండి తీరాలని వారు విశ్వసిస్తారు. పాటలు ఎలా పాడాలి, ఏ నినాదాలను ప్రోత్సహించాలి, వేటిని నిషేధించాలి అన్న అంశాలపై కరడుగట్టిన మితవాదులకూ నిశ్చితాభిప్రాయాలు ఉంటాయి. శాస్త్ర్రీయ దృక్పథాన్ని ఉపేక్షించి తమ సొంత విశ్వాసాల మార్మిక, అహేతుక ధోరణులనే మార్గదర్శకాలుగా తీసుకోవడం తీవ్ర మితవాదులకు పరిపాటి. వర్తమాన భారతదేశ చరిత్రలో ఈ లక్షణాలు స్పష్టంగా ద్యోతకం కావడం లేదూ? 


మితవాదుల, వామపక్ష వాదుల నిరంకుశపాలనలోని సమాంతర లక్షణాలను ఫ్రెంచ్ చరిత్రకారుడు ఫరెట్ తన ‘ది పాసింగ్ ఆఫ్ ఏన్ ఇల్యూజన్’లో చాలా ప్రతిభావంతంగా వర్ణించారు. ‘సోవియట్ ప్రజలు ఉన్నట్టే నేషనల్ సోషలిస్ట్ ప్రజలు కూడా ఉన్నారు. వీరికి బాహ్యంగా ఉన్న సంఘ వ్యతిరేక వ్యక్తులే. సమైక్యతను పదే పదే ఘనంగా చాటుతుంటారు. ముఖ్యంగ సైద్ధాంతిక ఆదేశాల రూపేణా. దీనికి పరాకాష్ట అధినాయకుని వ్యక్తి పూజ. ప్రజలు తప్పనిసరిగా పార్టీ, రాజ్యంతో మమేకమై ఉండాలి. ఈ పరిధులకు వెలుపల ఉన్న వారందరూ ప్రజా శత్రువలే. కమ్యూనిస్టు లెనిన్ దృష్టిలో బూర్జువాలు ప్రజా శత్రువులు అయితే నాజీ హిట్లర్ దృక్కోణంలో యూదులు జాతి శత్రువులు. రాజ్యవ్యవస్థను కూల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని సదా ప్రజలకు పలు విధాల గుర్తు చేస్తుండడం ఈ నిరంకుశ పాలకుల స్వతస్సిద్ధ లక్షణం’. రాజకీయ ఆధిపత్యానికి తోడ్పడిన పక్షంలో ఎటువంటి హింసాత్మక, అనైతిక పద్ధతులు అయినా ఫాసిస్టులకు, కమ్యూనిస్టులకు ఆమోదయోగ్యమేనని ఫరెట్ వ్యాఖ్యానించారు ‘యుద్ధంలో శత్రువులను చంపినట్టు తమ లక్ష్య సాధనకు ప్రజలను హతమార్చవచ్చని లెనిన్, హిట్లర్ విశ్వసించారు. ఆ ప్రజలు తప్పుడు/ ప్రత్యర్థి వర్గం లేదా ప్రతిపక్షానికి చెందిన వారై ఉండడమే కావాల్సింది. అటువంటి వారి పట్ల ఎటువంటి దయాదాక్షిణ్యాలు చూపవలసిన అవసరంలేని ఈ నిరంకుశ పాలకులు భావించారు’. 


ఫరెట్ పుస్తకం ప్రథమ, ద్వితీయ ప్రపంచ సంగ్రామాల మధ్యకాలంలోని ఐరోపా చరిత్రకు సంబంధించి కనుకనే లెనిన్, హిట్లర్‌ను ఆయన సన్నిధాన పరిచారు. ప్రపంచ యుద్ధానంతర ఆసియా చరిత్ర గురించే భావి చరిత్రకారులు చైనాలో కమ్యూనిస్టు రాజ్యవ్యవస్థ ఉత్థానం, భారత్లో హిందూత్వే నియంతృత్వాధికార పాలన ఆవిర్భావం మధ్య అలాంటి సమాంతర లక్షణాలను, ముఖ్యంగా మావో వ్యక్తి పూజ, మోదీ వ్యక్తి పూజ అలాంటి సమాంతర లక్షణాలను చూసే అవకాశం ఉంది. ఫరెట్ మన దేశాన్నిఎన్నడూ సందర్శించలేదు. మన దేశ చరిత్రగురించి ఆయన చదివింది కూడా బహుశా చాలా తక్కువే అయి ఉండవచ్చు. ఆయన పుస్తకం నుంచి నేను ఉటంకించిన మాటలు నేటి భారతదేశం గురించి సైతం ముందు తెలివిడితో రాసినట్టుగా లేవూ? మావో నేతృత్వంలోని చైనా కమ్యూనిస్టుల వలే మోదీ నాయకత్వంలోని బీజేపీ ఒక ‘పార్టీ-రాజ్యాన్ని’ నెలకొల్పాలని ఆకాంక్షిస్తోంది. చాలా శ్రద్ధాసక్తులతో ఎటువంటి లొసుగులు లేని మహానేతకు మోదీకి విశేష ప్రచారం కల్పించింది; వ్యతిరేకులు, విమర్శకులను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తోంది; ప్రధాన మంత్రిని హత్యచేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సందర్భానుసారంగా ప్రకటనలు చేస్తోంది; చైనాలో హాన్ యేతర సామాజిక సమూహాల గురించి చైనీస్ కమ్యూనిస్టులు దుష్ప్రచారం చేస్తూ దుర్మార్గంగా వ్యవహరించిన తీరులోనే భారతీయ ముస్లింలను కూడా బీజేపీ జాతి శత్రువులుగా పరిగణిస్తోంది.


వామపక్షా అతివాదులు, కరడుగట్టిన మితవాదులు అంగీకరించకపోవచ్చు గానీ ఇరు వర్గాలలోనూ ఉమ్మడి లక్షణాలు గణనీయంగా ఉన్నాయి. డోరా రస్సెల్ ఆత్మకథ నుంచి నేను ఉటంకించిన ఈ మాటలను మరో సారి చదవండి: ‘భావి కమ్యూనిస్టు సమాజ నిర్మాణానికి కమ్యూనిస్టు సిద్ధాంత ప్రబోధాలు ఎంతగా అవసరమైనప్పటికీ అవి కీడు కలిగించేవిగా నాకు కన్పించాయి. భావోద్వేగాలను రెచ్చగొట్టి మూఢ భక్తిని పెంపొందించేవిగా ఉన్నాయి. మనుషులలోని నిర్మాణాత్మక హేతు బద్ధతకు కాకుండా విద్వేష, విధ్వంసక ప్రవృత్తులకు ప్రేరణనిచ్చేవిగా ఉన్నాయి. స్వేచ్ఛాయుత మేధను అవి కట్టడి చేస్తాయి. ఆలోచనా సాహసాలను, కార్య ప్రేరణలను అవి ధ్వంసిస్తాయి’. ‘కమ్యూనిజం’ బదులుగా ‘హిందూత్వ’ను చేర్చితే ఆ నిశిత వ్యాఖ్యలు నేటి భారతదేశంలో రాష్ట్ర్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీలు చేస్తున్న దాన్ని కచ్చితంగా, నిర్దుష్టంగా అభివర్ణించడం లేదూ?స్వేచ్ఛాలోచన భీతిలో పాలకులు

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.