ఏసీబీ వలలో దొప్పెర్ల వీఆర్వో

ABN , First Publish Date - 2022-06-29T05:53:10+05:30 IST

భూమి మ్యుటేషన్‌ చేయడానికి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో మంగళవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడ్డాడు. అయితే అధికారులను తోసేసి ఒక్క ఉదుటున పారిపోయాడు.

ఏసీబీ వలలో దొప్పెర్ల వీఆర్వో
దొప్పెర్ల వీఆర్వో ఉడికాడ ఆరిబాబు(ఫైల్‌ ఫొటో)

మ్యుటేషన్‌ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం

అధికారులను తోసేసి పరారీ

అతని వెంట ఉన్న వీఆర్‌ఏను అదుపులోకి తీసుకొని విచారణ

తహసీల్దార్‌ కార్యాలయంలో తనిఖీలు


అచ్యుతాపురం (అనకాపల్లి జిల్లా), జూన్‌ 28: భూమి మ్యుటేషన్‌ చేయడానికి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో మంగళవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడ్డాడు. అయితే అధికారులను తోసేసి ఒక్క ఉదుటున పారిపోయాడు. అధికారులు, సిబ్బంది వెంటపడినా దొరకలేదు. ఇందుకు సంబంధించి ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దొప్పెర్ల పంచాయతీ తమ్మయ్యపేటకు చెందిన ముచ్చు దుర్గాప్రసాద్‌ తొమ్మిది సెంట్ల భూమికి మ్యుటేషన్‌ కోసం ఇటీవల రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్ని రోజులైనా మ్యుటేషన్‌ కాకపోవడంతో దొప్పెర్ల వీఆర్వో ఉడికాడ ఆరిబాబును కలిశారు. మ్యుటేషన్‌ చేయాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని వీఆర్వో డిమాండ్‌ చేశాడు. దీంతో దుర్గాప్రసాద్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారు చెప్పిన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం దొప్పెర్ల సమపంలోని ‘బార్క్‌’ రోడ్డు వద్దకు రమ్మని ఆరిబాబుకు దుర్గాప్రసాద్‌ కబురు చేశారు. వీఆర్వో ఆరిబాబుతోపాటు వీఆర్‌ఏ మంత్రి అప్పారావు క్కడకు వచ్చారు. దుర్గాప్రసాద్‌ నుంచి రూ.50 వేలు తీసుకుంటుండగా...అప్పటికే సమీపంలో మాటు వేసిన ఏసీబీ అదనపు ఎస్పీ కె.శ్రావణి, ఇన్‌స్పెక్టర్లు కిశోర్‌కుమార్‌, సతీశ్‌, శ్రీనివాసరావు, విజయ్‌కుమార్‌ దాడి చేసి పట్టుకున్నారు. అయితే అధికారులను తోసేసి ఆరిబాబు బార్క్‌ రోడ్డు మీదుగా పారిపోయాడు. దీంతో వీఆర్‌ఏ అప్పారావును అదుపులోకి తీసుకుని విచారించారు. అక్కడి నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని సోదాలు నిర్వహించారు. 


ప్రతి పనికీ లంచం డిమాండ్‌

దొప్పెర్ల వీఆర్వో ఆరిబాబు డబ్బులు ఇవ్వనిదే ఏ పనీ చేయడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు తిమ్మరాజుపేట వీఆర్వోగా వున్నప్పుడు కూడా ప్రతి పనికి లంచం డిమాండ్‌ చేస్తుండడంతో స్థానిక నాయకుల అతనిని పూడిమడకకు బదిలీ చేయించారు. పూడిమడకలో కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తుండడంతో అధికారులు అతడిని దొప్పెర్లలో నియమించారు. ఇక్కడ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.


Updated Date - 2022-06-29T05:53:10+05:30 IST