దోపిడీకి అడ్డుకట్టపడేనా ?

ABN , First Publish Date - 2021-10-17T06:10:16+05:30 IST

పెంచలకోనలోని కొన్ని సత్రాల్లో గదులకు రూ.500 నుంచి రూ.1000 వరకు అద్దె వసూలు చేస్తున్నారు.

దోపిడీకి అడ్డుకట్టపడేనా ?
పెంచలకోన క్షేత్రం వ్యూ

కోనలో కొత్త పాలక మండల అజెండా అమలయ్యేనా..

సామాన్య భక్తులకు మరిన్ని సేవలందేనా ?



రాపూరు, అక్టోబరు 16 : పెంచలకోనలోని కొన్ని సత్రాల్లో గదులకు రూ.500 నుంచి రూ.1000 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ఇందుకు ఆలయ కమిటీ అనుమతులు లేవు.  ఇది చట్ట వ్యతిరేకమైన చర్య...  అంటూ ఇటీవల జరిగిన కోన ఆలయ పాలకమండలి మొదటి సమావేశంలో తీర్మానించారు. ఈ విషయం మండలంలో చర్చకు దారి తీసింది. జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, రాబడిలో తొలిస్థానంలో ఉన్న పెంచలకోన ఆలయ పాలక మండలి అజెండా అమలు చేస్తుందా..? సామాన్య భక్తుల దోపిడీకి తెరపడుతుందా...? వారికి మరిన్ని సేవలు అందనున్నాయా... అంటూ ఈ ప్రాంతవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


పలు సత్రాల ఏర్పాటు


పెంచలకోనలో కులసంఘాల పేరుతో  సత్రాలు  ఏర్పాట య్యాయి. కొండకోనల్లో  క్షేత్రం ఉండడంతో తాత్కాలిక  నిర్మాణాలు చేపట్టి భక్తులకు అన్నదానం, విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేస్తామని ఆలయానికి రాత పూర్వక హామీ ఇచ్చి క్షేత్రంలో కులసంఘాలు పాగా  వేశాయి. కొన్నాళ్లపాటు సత్రాలు చెప్పిన విధంగానే  సామాన్య భక్తులకు సేవలందించాయి.  అయితే ప్రస్తుతం  కొన్ని సత్రాలు  ఒకరితో ఒకరు పోటీ పడి ఆలయం వారు ఇచ్చిన స్థలమే కాకుండా, పెద్ద ఎత్తున ఆక్రమణలు చేపట్టారు. తమ ఇష్టానుసారం శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టారు.   శ్రీవారి  భక్తులకు సేవ చేస్తామన్న ఒకే ఒక్క కారణంతో వచ్చి తిష్ఠవేసి  ఇచ్చిన హామీని తుంగలో తొక్కేశాయి. మామూలు గదులతోపాటు ఏసీ గదులు ఏర్పాటుచేసి భక్తుల నుంచి భారీగా అద్దెలు వసూలు చేస్తున్నాయి. అలాగే కొన్నిసత్రాలైతే నగరాలతో పోటీపడుతూ కల్యాణ మండపాలు ఏర్పాటుచేశాయి. ఒక్కో కల్యాణానికి సుమారు రూ.4లక్షల వరకూ అద్దె వసూలుచేస్తూ ఆథ్యాత్మిక కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చివేశాయి. గతంలో ఇక్కడ జిల్లావాసులతో పాటు రాయలసీమ జిల్లాలకు చెందిన భక్తులు వివాహాలు చేసుకునేవారు. ఇక్కడ వివాహం చేసుకుంటే శ్రీవారి మొక్కులు తీర్చుకోవడంతోపాటు తక్కువ వ్యయం అవుతుండేది. అయితే ప్రస్తుతం ఇక్కడ వివాహం చేసుకోవాలంటే నగరాల్లో అందుబాటులో ఉండే భారీ కల్యాణమండపాల ధరల కంటే, అధికంగా ఖర్చవుతుందని భక్తులు వాపోతున్నారు. సాధారణంగా క్షేత్రంలో కల్యాణం చేసుకునే భక్తులు శ్రీవారి కల్యాణ మండపం వద్ద, ఆలయానికి చేరువలో వివాహాలు చేసుకునేవారు. అందుకుగాను ఆలయానికి కొంత నగదు చెల్లించేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కోనలో కానరావడం లేదు. ఈ క్షేత్రంలో ఆలయానికి సంబంధించి సుమారు 200 గదులు మాత్రమే ఉన్నాయి. అన్నీ గదులు దాతలు నిర్మించినవే. అయితే సత్రాల్లో 200 కంటే ఎక్కువ గదులున్నట్లు తెలుస్తున్నది.


లెక్క తేల్చండి..


కోనలో  ఏ సత్రానికి ఎంత స్థలం కేటాయించారు. ఆ సత్రంలో ఎన్ని గదులు ఉన్నాయి. ప్రస్తుతం సత్రం ఏర్పాటైన విస్తీర్ణం ఎంత... ఎంత ఆక్రమించారు.. ఏ సత్రంలో కల్యాణ మండపాలు ఉన్నాయి...? భక్తుల నుంచి గదికి, కల్యాణానికి ఎంత వసూలు చేస్తున్నారన్న విషయాలను లెక్క తేల్చి, సామాన్య భక్తులకు అందుబాటులోకి వచ్చేలా చేయాల్సిన అవసరం ఉందని భక్తులు అంటున్నారు.


ఆలయ రాబడికి గండి


 కోనలో భక్తుల కానుకల ద్వారానే ఏడాదికి సుమారు రూ.8కోట్లు వస్తున్నాయి. అయితే ఇక్కడ సత్రాల వల్ల కోన ఆలయ రాబడికి గండి పడుతోంది. సత్రాల్లో గదుల వల్ల, కల్యాణ మండపాల వల్ల వచ్చే రాబడి ఆలయానికి రావడం లేదు. అయితే క్షేత్రంలో కొన్ని సత్రాలు నిర్వాహకులకు ఆదాయ వనురులుగా మారాయన్న ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సత్రాలు లేకుంటే ఆలయానికి ఏడాదికి మరో రూ.2కోట్లు పెరిగి రూ.10కోట్లకు పైగా ఆదాయం వస్తుందని చెబుతున్నారు.


అజెండాలోని అంశాలను అమలుచేస్తాం..


కోన ఆలయ అభివృద్ధి విషయంలో తొలి అజెండాను అమలు చేసే దిశగా అడుగులు వేస్తామని ఆలయ చైర్మన చెన్ను తిరుపాల్‌రెడ్డి ప్రకటించారు. సామాన్య భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. సత్రాల్లో అద్దె వసూళ్లకు ఎలాంటి అనుమతులు తాము ఇవ్వలేదన్నారు.

Updated Date - 2021-10-17T06:10:16+05:30 IST