దూరదర్శనం కేంద్రం టవర్
రాజమహేంద్రవరం నుంచి రిలే నిలిపివేత
దూరదర్శన్ ప్రసారాలకు బ్రేక్
త్వరలో రేడియో ఎఫ్ఎం ప్రసారాలు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
ఒకప్పుడు టీవీ ఉంటే ఒక్కటే చానల్ వచ్చేది.. అదే దూరదర్శన్.. వార్తలు వినాలన్నా.. సినిమా చూడాలన్నా.. పాటలు వినాలన్నా.. నాటికలు చూడాలన్నా.. చివరకు క్రికెట్ స్కోర్ తెలుసుకోవాలన్నా అందులోనే.. చిత్రలహరి తదితర కార్యక్ర మాలు వచ్చేవి. చక్రవాకం సీరియల్‌తో కాస్త జనం అటు మొగ్గినా ఆ తరువాత చూసే వారే కరువయ్యారు. డిజిటల్ విప్లవం ఎప్పుడైతే వచ్చిందో క్రమ క్రమంగా దూరదర్శన్.. ప్రజలకు దూరమవుతూ వచ్చింది. ప్రస్తుతం మూతపడే స్థితికి చేరింది. దూరదర్శన్ ప్రాంతీయ రిలే కేంద్రాలు మూతపడుతున్నాయి. రాజమహేంద్రవరంలో 1984 మే 1 తేదీన దూరదర్శన్ ట్రాన్స్మిట్ సెంటర్ ఏర్పడింది. మొదల్లో సారంగధరమెట్ట మీద ఉండేది.తర్వాత లాలాచెరువులోని హౌసింగ్ బోర్డుకు ఎదురుగా ఉన్న కొండమీద ఐదెకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. అప్పట్లో ఉభయగోదావరి జిల్లాలకు దూరదర్శన్ పరిపాలనా కేంద్రం ఇదే.హైదరాబాద్ నుంచి ప్రోగ్రా మ్స్ తీసుకుని ఇక్కడ ప్రసారం చేసేవారు.రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నుంచి ప్రసారాలు జరిగేవి. తర్వాత ప్రభుత్వం ప్రసారభారతి పేరుతో ప్రసారం చేసింది. కానీ డిజిటైలేషన్ పేరుతో ఈ కేంద్రాలను నిర్లక్ష్యం చేశారు. విభజన తరువాత రాజమహేంద్రవరం కేంద్రంగా కాకినాడ, అమలాపురం,భీమవరం,భీమడోలు, తునిలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసు ఇక్కడే ఉండేది. డైరెక్టర్ ఇక్కడే ఉండే వారు. ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని కేంద్రాలు క్రమంగా తీసేశారు. గత డిసెంబర్ 31వ తేదీ నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ కూడా ఆగిపోయాయి. కాకినాడలో ప్రస్తుతం ఆలిండియా రేడియో ఎఫ్ఎఫ్ మా త్రమే పనిచేస్తోంది. ప్రసార కేంద్రం భవనంలో ప్రస్తుతం దూరదర్శన్‌కు సంబంధించిన ఇన్చార్జి డైరెక్టర్, ఇతర అధికారులు కొద్ది మంది ఉన్నారు. అడ్మిస్ర్టేషన్ భవనం, ప్రసార కేంద్రం, టవర్, ఇతర ఆఫీసులు, అధికారులు క్వార్టర్స్ 14 ఉన్నాయి. చాలా మంది అధికారులు బదిలీ కావడంతో క్వార్టర్స్‌ను పట్టించుకునేవారే లేరు. చెట్లు, తుప్పలు మొలిచి ప్రఽమాదకరంగా మారాయి. దూరదర్శన్ టవర్‌ను లీజుకు తీసుకుని ప్రస్తుతం మూడు ప్రైవేట్ ఎఫ్ఎంలు ఇక్కడ నుంచి ప్రసారాలు చేస్తున్నాయి.
త్వరలో ఆలిండియా రేడియో ఎఫ్ఎం ప్రసారాలు
దూరదర్శన్ రిలే కేంద్రం నుంచి ఆలిండియా ఎఫ్ఎం ప్రసారాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే 50శాతం ఎక్విప్మెంట్ వచ్చింది. మిగతాది రావలసి ఉందని.. త్వరలోనే ప్రసారాలు ప్రారంభిస్తాం.
- బి.అన్నపూర్ణ, ఇన్చార్జి డైరెక్టర్