ఆ రహదారిని విస్తరించొద్దు!

ABN , First Publish Date - 2022-08-10T05:08:57+05:30 IST

నగరంలో అవసరమైన ప్రాంతాల్లో రహదారుల విస్తరణ జరగకపోవటం విమర్శలకు దారితీస్తోంది.

ఆ రహదారిని విస్తరించొద్దు!
స్టేషన్‌రోడ్‌లో నగరపాలక సంస్థకు చెందిన దుకాణాలు

 టీఆర్‌ఎస్‌ నేతల ఒత్తిడితో ఆగిన పనులు

 అడ్డుగా ఉన్న 45 దుకాణాలు 

 ఇరుకు రహదారుల విస్తరణ ఎప్పుడో?

ఖమ్మంకార్పొరేషన్‌, ఆగస్టు9: నగరంలో అవసరమైన ప్రాంతాల్లో రహదారుల విస్తరణ జరగకపోవటం విమర్శలకు దారితీస్తోంది. విస్తరణకు అధికారులు మార్కింగ్‌ పెట్టినప్పటికీ, కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు ఒత్తిడి చేయటంతో ఆయా ప్రాంతాల్లో విస్తరణ పనులు నిలిచిపోయి, ట్రాఫిక్‌ ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇక విస్తరణ జరిగిన ప్రాంతాల్లో సైతం రహదారిని వెడల్పు చేయకుండా ఇష్టారీతిగా డివైడర్లు ఏర్పాటు చేసి లేని ఇబ్బందులను సృష్టించటం పట్ల ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేవలం సొమ్ములు కాజేసేందుకే పనులు తూతూ మంత్రంగా చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ నేతల ఒత్తిడితో..

ఎంతో రద్దీగా ఉన్న రహదారులను విస్తరణ చేసి, ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పించాలని, తద్వారా ప్రమాదాలు నివారించాలని నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయించినా, కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు ఒత్తిడితో విస్తరణ పనులకు మంగళం పాడారు. నగరపాలక సంస్థ పాత కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే రహదారి ఇరుకుగా ఉంటుంది. ఈ రహదారిలో నగరపాలక సంస్థకు చెందిన 45 దుకాణాలు ఉన్నాయి. వీటిని తొలగించి రహదారిని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు మార్కింగ్‌ కూడా పెట్టారు. అయితే ఒక టీఆర్‌ఎస్‌ నాయకుడిని.. దుకాణాలు లీజుకు తీసుకున్నవారు ఆశ్రయించటంతో కఽథ అడ్డం తిరిగింది. సదరు నాయకుడికి సంబందించిన వారు పాలకవర్గంలో కీలకపోస్టులో ఉండటంతో అదికారులపై ఒత్తిడి తెచ్చాడు. అధికారులు ఏం చేయలేక విస్తరణ పనులను, దుకాణాల తొలగింపును నిలిపివేశారు. ప్రస్తుతం ఆ రహదారి ఇరుకుగా ఉంది. దానికి తోడు డివైడర్లు నిర్మించటంతో మరింత ఇరుకుగా మారింది. బొమ్మన సెంటర్‌, రైల్వేస్టేషన్‌, అజీజ్‌గల్లీ, ఇతర వాణిజ్య, వ్యాపార సంస్థలకు ఈ రహదారి గుండానే వెళ్లాల్సి రావటంతో తరచూ ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి, ఇక టీడీపీ కార్యాలయం మీదుగా గట్టయ్యసెంటర్‌, సరితక్లినిక్‌, ఆర్డీవో కార్యాలయం, అటునుండి పాత బస్టాండ్‌కు వెళ్లే రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. నగరంలో ఇల్లెందు క్రాస్‌రోడ్‌ నుండి జెడ్పీసెంటర్‌ మీదుగా పాత బస్టాండ్‌కు వెళ్లేవారు అక్కడి ట్రాఫిక్‌ రద్దీని తట్టుకోలేక, సిగ్నల్స్‌ ఉండటంతో గట్టయ్యసెంటర్‌ మీదుగా వెళుతున్నారు. ఇక్కడ రహదారిని విస్తరించాలని నిర్ణయించి, మార్కింగ్‌ పెట్టినా, విస్తరణలో తమ నివాసాలు పోతాయని కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులను ఆశ్రయించగా, వారి ఒత్తిడితో అదికారులు విస్తరణ పనులను పక్కన పెట్టారు. ఎన్నెస్టీ రోడ్‌లో మాత్రం కొందరికి నష్టం కలగకుండా తూతూ మంత్రంగా రహదారి విస్తరణ చేసి, మమ అనిపించారు.

14 రహదారుల విస్తరణకు తీర్మానం

నగరంలో ఇరుకుగా ఉండి ట్రాఫిక్‌ ఇబ్బందులు కలుగుతున్న 14 రహదారులను గుర్తించి, వాటిని విస్తరించాలని తీర్మానించారు. అయితే ముస్తపానగర్‌ వంటి ప్రాంతాల్లో విస్తరణ జరిగినా, చాలా ప్రాంతాల్లో కేవలం టీఆర్‌ఎస్‌ నాయకుల ఒత్తిడి వల్లే విస్తరణ పనులు ఆగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ రహదారులను విస్తరించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విశాలమైన రహదారులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు తమ స్వప్రయోజనాల కోసం విస్తరణ జరగకుండా అడ్డుకోవటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.


Updated Date - 2022-08-10T05:08:57+05:30 IST