ఆర్‌ఏఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేయొద్దు

ABN , First Publish Date - 2020-12-06T05:23:08+05:30 IST

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వివిధ పంటల్లో పరిశోధనలు, కొత్త వంగడాల సృష్టితో దేశవ్యాప్త ఖ్యాతిని గడించిం దని, అది తెలిసీ సంస్థ భూమిని వైద్య కళాశాలకు కేటాయించడం సరి కాదని వక్తలు అన్నారు.

ఆర్‌ఏఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేయొద్దు
సదస్సులో మాట్లాడుతున్న బొజ్జా దశరథరామిరెడ్డి

  1. మెడికల్‌ కాలేజీ భూములకు జోలెపట్టి నిధులిస్తాం
  2. రైతు సదస్సులో ప్రభుత్వం తీరుపై వక్తల ఆవేదన
  3. త్వరలో ఐక్య ఉద్యమ కార్యాచరణ ప్రకటన
  4. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా


నంద్యాల, డిసెంబరు 5: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వివిధ పంటల్లో పరిశోధనలు, కొత్త వంగడాల సృష్టితో దేశవ్యాప్త ఖ్యాతిని గడించిం దని, అది తెలిసీ సంస్థ భూమిని వైద్య కళాశాలకు కేటాయించడం సరి కాదని వక్తలు అన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో నంద్యాలలో శనివారం నిర్వహించిన రైతు సదస్సులో వారు ప్రసంగించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేయొద్దని ప్రభుత్వానికి విజ్జప్తి చేస్తూ, భూమిని కాపాడుకునేందుకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు. సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ 114 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రతో పాటు నూతన వంగడాల ఆవిష్కరణలో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ అగ్రగామిగా ఉందన్నారు. ఇక్కడి శాస్త్రవేత్తలు పత్తి, వరి, జొన్న, కొర్ర, పొద్దుతిరుగుడు, శనగ, కంది తదితర విత్తన వంగడాలను ఆవిష్కరించాని అన్నారు. పరిశోధనా ఫలితాలను రైతులకు అందిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థను నిర్వీర్యం చేయాలనుకోవడం దిగ్ర్భాంతి కలిగిస్తోందని బొజ్జా అన్నారు. నంద్యాలకు వైద్య కళాశాల మంజూరును స్వాగతిస్తున్నామని, అయితే ఆర్‌ఏఆర్‌ ఎస్‌ భూమిని కాకుండా ప్రత్యామ్నాయ స్థలాలను సేకరించాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని కాపాడుకునేందుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, కార్మికులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి ఐక్య ఉద్యమం చేయడానికి త్వరలో  కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులందరూ సీఎం దృష్టికి సమస్యను తీసుకువెళ్లాలని, జీవోను నిలుపుదల చేయాలని బొజ్జా డిమాండ్‌ చేశారు. 


తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం, పంటల బీమా విడుదల చేయాలని బొజ్జా డిమాండ్‌ చేశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై అప నమ్మకంతోనే రైతులు ఢిల్ల్లీని దిగ్బంధనం చేశారని అన్నారు. రైతులకు చట్టబద్ధమైన కనీస ధర, రాజ్యాంగ బద్ధ వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని బొజ్జా డిమాండ్‌ చేశారు. 


కేసీ కెనాల్‌కు ప్రపంచ వారసత్వ సాగునీటి నిర్మాణంగా గుర్తింపు సాధించిన రాష్ట్ర ప్రభుత్వం, కేసీ కెనాల్‌కు సక్రమంగా సాగునీరు అందించే గుండ్రేవుల రిజర్వాయర్‌ను వెంటనే చేపట్టాలని బొజ్జా డిమాండ్‌ చేశారు. 


వైద్య కళాశాల ఏర్పాటుకు కోసం భూమిని సేకరించేందుకు నిధుల సేకరణకు గ్రామ గ్రామాన జోలెపట్టి బిచ్చమెత్తుదామని, ఆ సొమ్మును ప్రభుత్వానికి అందజేసి ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూముల వైపు చూడకుండా చేద్దామని సీనియర్‌ న్యాయవాది శంకరయ్య సూచించారు. ఆ ప్రతిపాదనకు సదస్సులోని రైతులు హర్షధ్వానాలు చేశారు. 


నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని కాపాడుకునేందుకు రాయలసీమ స్థాయిలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అనంతపురం జిల్లా ప్రతినిధి మదన్‌మోహన్‌రెడ్డి అన్నారు. భూమిని కాపాడుకునేందుకు న్యాయపోరాటం, క్షేత్ర స్థాయిలో ప్రజా ఉద్యమం తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. 


ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మిక సంఘం నాయకురాలు ఎల్లమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఇక్కడి నుంచి తరలి పోతే 300 కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థను కాపాడుకునేందుకు ఎలాంటి ఉద్యమానికైనా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. 


వైద్య కళాశాలకు ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని తీసుకొని రైతులకు, కార్మికులకు అన్యాయం చేయొద్దని ఆత్మకూరుకు చెందిన సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ నాగన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శివారు ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే నంద్యాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సాధన సమితి నాయకులు వైఎన్‌ రెడ్డి, ఏర్వ రామచంద్రారెడ్డి, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:23:08+05:30 IST