వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ వద్దు!

ABN , First Publish Date - 2021-09-18T07:43:21+05:30 IST

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మధ్య సన్నిహిత సంబంధాలు లేవనే కథనాలు వినిపిస్తూనే ఉంటాయి.

వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ వద్దు!

రాహుల్‌, పంత్‌ కోసం కోహ్లీ ప్రతిపాదన


న్యూఢిల్లీ: కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మధ్య సన్నిహిత సంబంధాలు లేవనే కథనాలు వినిపిస్తూనే ఉంటాయి. దీనికి తగ్గట్టుగానే వన్డే, టీ20 ఫార్మాట్లలో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్‌ను తొలగించాలని జాతీయ సెలెక్టర్లను కోహ్లీ కోరినట్టు సమాచారం. 34 ఏళ్ల రోహిత్‌ స్థానంలో యువ ఆటగాళ్లయిన కేఎల్‌ రాహుల్‌ను వన్డేలకు, పొట్టి ఫార్మాట్‌లో రిషభ్‌ పంత్‌ను తన డిప్యూటీలుగా నియమించాలని సూచించాడట. ‘కోహ్లీ ప్రతిపాదనను బోర్డు అంగీకరించలేదు. ఎందుకంటే కోహ్లీ తన అసలైన వారసుడిని కోరుకున్నట్టుగా కనిపించలేదు. అలాగే 2023 వన్డే వరల్డ్‌కప్‌ వరకు కూడా తనే కెప్టెన్‌గా ఉండాలనుకుంటున్నాడు’ అని బీసీసీఐ అధికారి తెలిపాడు. యూఏఈలో జరిగే టీ20 ప్రపంచకప్‌ ముగిశాక ఈ ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.


కోహ్లీ నిర్ణయం ఆశ్చర్యకరమే..

విరాట్‌ కోహ్లీ నిర్ణయం తమకు షాక్‌కు గురి చేసిందని పలువురు మాజీ క్రికెటర్లు తెలిపారు. అతడి సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్‌ గెలిస్తే చిరస్మరణీయంగా ఉంటుందని మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. అయితే ఏదైనా టోర్నీ ముగిశాకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని, కానీ కోహ్లీ మాత్రం ముందే  ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. ఇక బయో బబుల్‌ జీవితం కూడా కోహ్లీ ఈ నిర్ణయం తీసుకునేలా చేసివుండవచ్చని, అందుకే ఒత్తిడి, అధిక భారాన్ని తగ్గించుకోవాలనుకున్నాడని మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అభిప్రాయపడ్డాడు. మరోవైపు కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా ఈ విషయంపై స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో కోహ్లీ పూర్తి లేఖను పోస్ట్‌ చేయడంతో పాటు దానిపై లవ్‌ సింబల్‌ను ఉంచింది.

Updated Date - 2021-09-18T07:43:21+05:30 IST