మనుషులను మ్యాన్‌హోల్‌లోకి దించొద్దు.. ఇది చట్టారీత్యా నేరం..

ABN , First Publish Date - 2022-05-26T15:23:46+05:30 IST

మనుషులను మ్యాన్‌హోల్‌లోకి దించొద్దు.. ఇది చట్టారీత్యా నేరం..

మనుషులను మ్యాన్‌హోల్‌లోకి దించొద్దు.. ఇది చట్టారీత్యా నేరం..

  • సమస్య పరిష్కారానికి 155313కు కాల్‌ చేయండి
  • వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్‌

హైదరాబాద్‌ సిటీ : మనుషులను మ్యాన్‌ హోళ్లలోకి (Manholes) దించవద్దని, ఇది చట్టరీత్యా నేరమని వాటర్‌బోర్డు (Water Board) ఎండీ దానకిశోర్‌ తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా వాటర్‌బోర్డు కస్టమర్‌ కేర్‌ నెంబరు (155313)కు ఫోన్‌ చేస్తే పరిష్కరిస్తామని తెలిపారు. బుధవారం నగరంతో పాటు ఓఆర్‌ఆర్‌ పరిధిలోని అన్ని వాటర్‌బోర్డు డివిజన్లలో భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్మికులు, సిబ్బందితో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, వాటర్‌బోర్డు అధికారులు పాల్గొన్నారు.


పనులు చేస్తున్నప్పుడు రక్షణ పరికరాలను కచ్చితంగా ఉపయోగిస్తామని కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్‌ మాట్లాడుతూ వాటర్‌బోర్డులో పనిచేస్తున్న సీవరేజి కార్మికులకు మురుగునీటి నిర్వహణ, భద్రతపై ఈ నెల 25 నుంచి జూన్‌ 1 వరకు వారం రోజులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.  కార్మికులు విధి నిర్వహణలో తప్పకుండా హ్యాండ్‌ గ్లౌజులు, గమ్‌ బూట్స్‌, మాస్కులు, బాడీ సూట్‌ వంటి భద్రతా పరికరాలను ధరించేలా ప్రతీ మేనేజర్‌ తమ సెక్షన్‌ పరిధిలోని సివరేజీ కార్మికులందరికీ అవగాహన కల్పించాలని ఆదేశించారు. అపార్టమెంట్లు, వాణిజ్య భవనాలలో సిల్ట్‌ చాంబర్లు తప్పనిసరిగా నిర్మించుకోవాలని సూచించారు.


వర్షాల కంటే ముందే గుంతలు పూడ్చండి..

వర్షాలు ప్రారంభం అయ్యే నాటికి గుంతలు పూడ్చాలని, తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌కు మూతలు ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్‌ అధికారుల్ని ఎంఏయూడీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ఆదేశించారు. వర్షాలు ప్రారంభం అయ్యే నాటికి వంద శాతం సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలన్నారు. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై ఏప్రిల్‌ 5న జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ చర్చించారని, అయినా ఇంకా పలు చోట్ల పనులు పూర్తి కాకుండా కనిపిస్తున్నాయన్నారు. రక్షణ చర్యల విషయంలో నిర్లక్షంగా వ్యవహరించే అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అర్వింద్‌ కుమార్‌ హెచ్చరించారు. 

Updated Date - 2022-05-26T15:23:46+05:30 IST