ఒత్తిడి చేయరేం!

ABN , First Publish Date - 2022-08-14T05:23:00+05:30 IST

ప్రజల నుంచి వివిధ పన్నులను నగర పాలక సంస్థ ముక్కు పిండి వసూలు చేస్తోంది. సకాలంలో చెల్లించని ప్రజలపై అపరాధ రుసుం వేసి మరీ రాబెడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల విషయంలో మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. పన్ను బకాయిలు పేరుకుపోతున్నా ఒత్తిడి చేయడం లేదు.

ఒత్తిడి చేయరేం!
విజయనగరం కార్పొరేషన్‌ కార్యాలయం


ప్రజల నుంచేమో ముక్కుపిండి వసూలు
ప్రభుత్వ కార్యాలయాల బకాయి రూ.16.29 కోట్లు
నోటీసులతోనే సరిపెట్టుకుంటున్న అధికారులు
విజయనగరంలో పేరుకుపోతున్న ఆస్తి పన్ను బకాయి



ప్రజల నుంచి వివిధ పన్నులను నగర పాలక సంస్థ ముక్కు పిండి వసూలు చేస్తోంది. సకాలంలో చెల్లించని ప్రజలపై అపరాధ రుసుం వేసి మరీ రాబెడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల విషయంలో మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. పన్ను బకాయిలు పేరుకుపోతున్నా ఒత్తిడి చేయడం లేదు. ఈ వివక్షత సరికాదని సీనియర్‌ సిటిజన్లు మండిపడుతున్నారు. కార్పొరేషన్‌కు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు రూ.16.29 కోట్ల పన్ను బకాయిలు ఉండడం గమనార్హం.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి/ రింగురోడ్డు)
కార్పొరేషన్‌ ప్రజలు పన్నుల భారంతో సతమతమవుతున్నారు. ఇటీవల ఇంటి పన్నులను భారీగా పెంచారు. భారమైనా అపరాధ రుసంపై భయంతో ప్రజలు సకాలంలో చెల్లిస్తున్నారు. ఆర్థిక కారణాలతో ఎవరైనా పేదలు ఆలస్యం చేస్తే వారిపై కార్పొరేషన్‌ అధికారులు జులం ప్రదర్శిస్తున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు. కార్యాలయాలు పన్ను చెల్లించకపోయినా వారిని ప్రశ్నించడం లేదు. జిల్లాకే తలమానికమైన కలెక్టర్‌ కార్యాలయం భారీగా ఆస్తి పన్ను బకాయి పడింది. రూ.2.32 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయం అయితే రూ.2.68 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉంది. ఎస్పీ కార్యాలయం రూ.41.20 లక్షల బకాయి ఉంది. ఇంకా అనేక శాఖలు ఆస్తిపన్నును ఏళ్ల తరబడి చెల్లించడం లేదు. కార్పొరేషన్‌ అధికారులు వీరిపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కోట్ల రూపాయల్లో డిమాండ్‌ ఉంది. అన్ని  శాఖలు కలిపి రూ.16.39 కోట్ల బకాయి ఉంది. కార్పొరేషన్‌ వసూలు చేసింది కేవలం రూ.58.96 లక్షలే. విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలో ఈ ఏడాది ఇంటి పన్నుల రూపంలో ఇప్పటి వరకు రూ.15.44 కోట్లు వసూలు చేశారు. మొత్తంగా రూ.43.36 కోట్ల డిమాండ్‌ ఉండగా బకాయిల్లో ఎక్కువ శాతం వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన వారే కావడం విశేషం. ఆ  భవనాలు కూడా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు చెందినవే ఎక్కువ ఉన్నాయి. ఇలా ఇటు ప్రభుత్వ కార్యాలయాలు, అటు ప్రజాప్రతినిధులు పన్నులు సకాలంలో చెల్లించకుండా కార్పొరేషన్‌ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారు.

నోటీసులు పంపిస్తున్నాం
పన్నుల వసూలు విషయంలో సాధారణ పౌరులే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు కూడా నోటీసులు పంపిస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల వద్ద తగినంత నిధులు లేని కారణంగా చెల్లించలేకపోతున్నామని వారు చెబుతున్నారు. అందుకే కాస్తా వెసులుబాటు ఇస్తున్నాం. వారి బకాయిల నివేదికను ప్రభుత్వానికి పంపిస్తున్నాం.
               - ఆర్‌.శ్రీరాములునాయుడు, కమిషనర్‌, నగరపాలక సంస్థ.


ఆస్తి పన్ను బకాయిలు
--------------------------------------------------
విభాగం పేరు                 బకాయిలు
                రూపాయల్లో
-----------------------------------------------------
డిప్యూటీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌    2,68,76,000
కలెక్టర్‌ కార్యాలయం :        2,32,59,728
హౌసింగ్‌ క్వార్టర్స్‌ డీఈ       1,72,19,878
సొసైటీ ఆఫ్‌ ప్రాజెక్ట్‌ విలేజ్‌ డవలెప్‌మెంట్‌ 1,05,74,423
పోస్టల్‌ శాఖ              98,31,466
 టెలికాం డీఈ కార్యాలయం      66,23,130
పశుసంవర్ధక శాఖ డీడీ      54,84,979
కోపరేటివ్‌ సెంట్రల్‌ సోర్స్‌      52,03,079
జిల్లా పరిషత్‌ సీఈవో         50,52,505
జిల్లా పరిశ్రమల శాఖ      50,40,880
ఆర్‌అండ్‌బీ బంగ్లా          47,47,475
ఎస్పీ కార్యాలయం          41,20,134
వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌      39,53,365
ఆర్డీవో కార్యాలయం          39,30,136
పోలీస్‌ సంక్షేమ శాఖ          36,69,608
------------------------------------------

Updated Date - 2022-08-14T05:23:00+05:30 IST