‘రెండుసార్ల’తో ఆగిపోను

ABN , First Publish Date - 2022-05-13T08:52:17+05:30 IST

రెండుసార్లు ప్రధానమంత్రిగా చేశాం.. ఇక చాలు అని సరిపెట్టుకునే తత్వం తనది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

‘రెండుసార్ల’తో ఆగిపోను

చాలామందిలా చాలిక అని అనుకోను

ఓ నేత ఇదే సలహా ఇచ్చారు

రెండు సార్లు ప్రధాని అయ్యారు

ఇంకేం కావాలని అడిగారు

సంతృప్తిపడి సరిపెట్టుకునే 

తత్వం కాదు నాది

ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు


బారుచ్‌, మే 12 : రెండుసార్లు ప్రధానమంత్రిగా చేశాం.. ఇక చాలు అని సరిపెట్టుకునే తత్వం తనది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తనను ఇటీవల కలిసిన ఓ ప్రముఖ నాయకుడు ఇదే సలహా తనకు ఇవ్వగా, సున్నితంగా తోసిపుచ్చానని చెప్పారు. గుజరాత్‌లోని బారుచ్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో వర్చువల్‌ విధానంలో మోదీ పాల్గొన్నారు. వృద్ధులు, వితంతువులు, విధి వంచిత పౌరులను దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన పథకాలను వందశాతం అమలుచేసిన సందర్భంలో బారుచ్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఈ దేశ ప్రజలకు సంక్షేమ పథకాలు వందశాతం అమలయ్యేలా చూడాలన్నదే ఒక నేతగా తన కల అన్నారు. ‘‘పెద్ద లీడరు ఒకాయన ఒకరోజు నన్ను కలిశారు. రాజకీయాల్లో నన్ను నిత్యం విమర్శించే ఆయనను వ్యక్తిగతంగా నేను గౌరవిస్తా.  కొన్ని అంశాలు రుచించకపోవడంతో ఆయన నా వద్దకు వచ్చారు. మా భేటీలో ఆయన ఒక సలహా ఇచ్చారు ‘‘దేశం నిన్ను రెండుసార్లు ప్రధానిగా ఎన్నుకుంది. ఇంకా నీకు ఏం కావాలి?’’ అని అడిగారు. రెండుసార్లు ప్రధానిగా చేస్తే, జీవితంలో అన్నీ పొందినట్టేనన్న భావం ఆ నేత మాటల్లో వ్యక్తమయింది. అయితే.. మోదీ మిగతా నేతలకు భిన్నమని, గుజరాత్‌ నేలే నాకు ఆ ప్రత్యేకతను ఇచ్చిందని  ఆయనకు తెలియదు. ‘అయిందేదో అయింది.. ఇక అవన్నీ వదిలేసి విశ్రాంతి తీసుకుందాం’ అని తేలికపడబోను. పథకాలు వందశాతం అమలై, పూర్తి సంతృప్తికర స్థాయికి ప్రజలను చేర్చాలనేదే నా కల. అప్పటివరకు విశ్రమించేది లేదు’’ అని మోదీ స్పష్టం చేశారు. సదరు నేత పేరు మోదీ ప్రస్తావించకపోయినా.. ఆ సలహా ఎన్సీపీ నేత  పవార్‌ ఇచ్చి ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.  

Read more