మద్యం దుకాణం వద్దేవద్దు!

ABN , First Publish Date - 2022-08-12T05:30:00+05:30 IST

మద్యం దుకాణాలను జనావాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రజల ధన, మాన ప్రాణాలతో అటలాడుతున్నారని ప్రజలు అగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తమ గ్రామంలో మద్యం దుకాణం వద్దేవద్దని కుప్పం పురపాలక సంఘం పరిధిలోని తంబిగానిపల్లె గ్రామస్థుల నిరసన తెలిపారు

మద్యం దుకాణం వద్దేవద్దు!
దుకాణం నిర్వాహకునితో వాగ్వాదం చేస్తున్న గ్రామస్థులు

కుప్పంలో దుకాణం వద్ద గ్రామస్థుల నిరసన


కుప్పం, ఆగస్టు 12: మద్యం దుకాణాలను జనావాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రజల ధన, మాన ప్రాణాలతో అటలాడుతున్నారని ప్రజలు అగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తమ గ్రామంలో మద్యం దుకాణం వద్దేవద్దని నిరసన తెలిపారు. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని 5వ వార్డు కిందికి వచ్చే తంబిగానిపల్లె గ్రామంలో శుక్రవారం ఈ నిరసన జరిగింది. ప్రభుత్వం ఇటీవల మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్‌ కొందరు పాడుకున్నారు. వారు తంబిగానిపల్లె గ్రామ పరిధిలోని చెక్‌పోస్టు వద్ద వాణిమహల్‌ సమీపంలోని ఒక షెడ్డులో మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పలమనేరు-కుప్పం జాతీయ రహదారికి ఆనుకుని ఈ షెడ్డు ఉంది. రెండుమూడురోజులుగా నిర్వాహకులు ఇక్కడికి వస్తూపోతూ ఉండడం, ఏర్పాట్లు చేస్తుండడం చూసిన తంబిగానిపల్లె గ్రామస్థులు శుక్రవారం షెడ్డు వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మద్యం దుకాణం వద్దేవద్దంటూ నినాదాలు చేశారు. ఇంతలో నిర్వాహకుడు అక్కడికి చేరుకోగా ఆయనతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నానని, తనకు అడ్డు రావద్దని నిర్వాహకుడు గ్రామస్థులతో చెప్పాడు. అయితే గ్రామస్థులు ఆయన మాట వినలేదు. తాము పుట్టి బుద్ధి ఎరిగినప్పటినుంచి తంబిగానిపల్లెలో కానీ, సమీపంలో కానీ మద్యం దుకాణాలు లేవన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయడంవల్ల గ్రామస్థులమైన తాము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఆకతాయిలు. తాగుబోతులు దుకాణం వద్దకు వస్తారని, వారితో ఆగవాళ్లు, పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ రహదారికి ఆనుకుని ఏర్పాటు చేయడంవల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగి గ్రామస్థుల ప్రాణాలు సైతం పోయే ప్రమాదముందన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరడాన్ని గుర్తు చేశారు. మళ్లీ తాము దుకాణం వద్దకు వచ్చి ఆందోళన చేయకముందే ఏర్పాట్లను ఉపసంహరించుకుని వెనుదిరగాలని డిమాండ్‌ చేశారు. లేదంటే గ్రామం మొత్తం వచ్చి దుకాణం ముందు బైఠాయించి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంబంధిత అధికారులు కూడా మద్యం దుకాణం ఇక్కడ లేకుండా చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-08-12T05:30:00+05:30 IST