నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తీసినా పట్టించుకోరా?

ABN , First Publish Date - 2022-08-20T05:20:47+05:30 IST

నీవానదియేటిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వి తరలిస్తున్న రీచ్‌ నిర్వాహకులపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోతే ఎలాగని జీడీ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్‌ భీమనేని చిట్టిబాబునాయుడు ధ్వజమెత్తారు.

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తీసినా పట్టించుకోరా?

కిషన్‌ మృతిపై విచారణకు టీడీపీ డిమాండ్‌ 

గంగాధరనెల్లూరు, ఆగస్టు 19: నీవానదియేటిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వి తరలిస్తున్న రీచ్‌ నిర్వాహకులపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోతే ఎలాగని జీడీ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్‌ భీమనేని చిట్టిబాబునాయుడు ధ్వజమెత్తారు. ఎల్లాపల్లెకి చెందిన కిషన్‌ (32) గురువారం నీవానదియేటిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మృతుడి తల్లిదండ్రులు జీవరత్నమ్మ, సాంబశివనాయుడును శుక్రవారం పలువురు నేతలతో కలిసి ఆయన పరామర్శించారు. నీవా నది యేరులోని ప్రభుత్వ తాగునీటి, రైతుల బోర్ల వద్ద పైపులను ధ్వంసంచేయడంతో పాటు.. ఒక మీటరుకు బదులు 25 అడుగుల వరకు ఇసుకను తోడేస్తున్నారన్నారు. దీనిపై అధికారులకు  స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. బోరువద్ద ఇష్టారాజ్యంగా ఇసుక తీయడంపై రీచ్‌ సిబ్బందిని ప్రశ్నించినందుకే కిషన్‌ను చంపేసి నీళ్లలో పడేశారని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. కిషన్‌ మృతిపై కలెక్టర్‌, ఎస్పీని కలిసి సమగ్రవిచారణకు డిమాండ్‌చేసి, బాధితకుటుంబానికి న్యాయంజరిగేలా చూడాలని కోరతామన్నారు. ఆయనతోపాటు చిత్తూరు పార్లమెంట్‌ టీడీపీ ఎస్సీసెల్‌ ప్రధానకార్యదర్శి దేవసుందరం, తెలుగురైతు ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మోహన్‌నాయుడు, మాజీ ఆత్మచైర్మన్‌ దేవరాజులు, నేతలు జ్యోతీశ్వర్‌రెడ్డి, చిదంబరం, ఉలగనాధం, భక్తవత్సలంనాయుడు, రవినాయుడు, రామచంద్ర పాల్గొన్నారు.

నేడు అంత్యక్రియలు 

కిషన్‌ మృతదేహానికి గురువారమే చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. విదేశాల్లో ఉన్న మృతుడి సోదరుడు కిరణ్‌ శనివారం గ్రామానికి చేరుకోనున్నారు. అదే రోజు ఎల్లాపల్లెలో కిషన్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.


Updated Date - 2022-08-20T05:20:47+05:30 IST