అమెరికాలో ట్రంప్ కార్డ్, ఇక్కడ బెంగాలీ కార్డా? మోదీపై మమత ఫైర్

ABN , First Publish Date - 2021-04-12T23:15:00+05:30 IST

హద్దులు దాటి మాట్లాడే ప్రధానిని ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు

అమెరికాలో ట్రంప్ కార్డ్, ఇక్కడ బెంగాలీ కార్డా? మోదీపై మమత ఫైర్

కోల్‌కతా : హద్దులు దాటి మాట్లాడే ప్రధానిని ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇందుకు చాలా సిగ్గుపడుతున్నానని అన్నారు. తాను అన్ని వర్గాల కోసమే శ్రమిస్తున్నానని, తానేం చేయలేదో చెప్పాలని బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీ హఠావో, దేశ్‌కో బచావో... ఇక ఇదొక్కటే మిగిలిందని దీదీ పేర్కొన్నారు. వామపక్షాలు, కాంగ్రెస్ రెండు పార్టీలూ బీజేపీకి ఏజెంట్లని మమత విమర్శించారు. ట్రంప్‌ను గెలిపించడానికి ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లారని, ట్రంప్ కార్డ్ ప్లే చేశారని, ఇప్పుడు బెంగాల్‌కు వచ్చి బెంగాల్ కార్డ్ వాడుతున్నారని ఎద్దేవా చేశారు. బెంగాల్‌లో జరుగుతున్న విషయాలను కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు. ‘‘చేతులెత్తి సవినయంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను. ఒక్క బీజేపీ మాటలే వినకండి. అందరి మాటలూ వినండి. పక్షపాత బుద్ధి కూడదు’’ అంటూ మమత హితవు పలికారు. కొందరు తమ నోరును అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు బెంగాల్ లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని, అలాంటి వారిని జైళ్లో పెట్టాలని, రాజకీయాల నుంచి తొలగించాలని మమత నిప్పులు చెరిగారు. 

Updated Date - 2021-04-12T23:15:00+05:30 IST