కేంద్రాన్ని వదలొద్దు

ABN , First Publish Date - 2022-08-20T08:52:54+05:30 IST

విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) కరెంట్‌ అమ్మకాలు, కొనుగోళ్లు జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై సీఎం కేసీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు.

కేంద్రాన్ని వదలొద్దు

విద్యుత్తు కొనుగోళ్లకు చెల్లింపులు చేయకుంటే చర్యలు తీసుకోవాల్సింది ఉత్పత్తి సంస్థలే

హైకోర్టు ఆదేశాలను కేంద్రం ఉల్లంఘించింది.. కోర్టు ధిక్కార పిటిషన్‌ వేయండి

డిస్కమ్‌లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం.. 22న పిటిషన్‌ వేయాలని డిస్కమ్‌ల నిర్ణయం20 మిలియన్‌ యూనిట్లు కొనలేకపోయాం.. 1000-1500 మెగావాట్ల డిమాండ్‌ కుదింపుగట్టెక్కించిన జలవిద్యుత్తు: ట్రాన్స్‌కో సీఎండీ.. ఏపీ సహా 6 రాష్ట్రాలపై ఆంక్షల ఎత్తివేత.. కేంద్రం నిర్ణయం 


52.86 కోట్లే!

తెలంగాణ బకాయిలింతే.. 

ప్రాప్తి తాజా లెక్కల్లో వెల్లడి

పూర్తిగా చెల్లించాం: డిస్కమ్‌లు


హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) కరెంట్‌ అమ్మకాలు, కొనుగోళ్లు జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై సీఎం కేసీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఎనర్జీ ఎక్స్చేంజ్‌లో క్రయవిక్రయాలపై ఆంక్షలు విధించడానికి వీల్లేదన్న హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందున.. కేంద్రంపై కోర్టు ధిక్కార కేసు పెట్టాలని డిస్కమ్‌లను ఆదేశించారు. తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు చెందిన 27 డిస్కమ్‌లు కరెంట్‌ అమ్మకాలు, కొనుగోళ్లు జరపకుండా నిషేధం విధిస్తూ విద్యుత్తు క్రయవిక్రయాల లావాదేవీలు నిర్వహించే సంస్థలకు కేంద్రం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, ‘‘విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) డిస్కమ్‌లు, ఉత్పత్తి సంస్థల మధ్య జరిగేవి. ఆయా కొనుగోళ్లకు చెల్లింపులు చేయకపోతే తగిన చర్యలు తీసుకునే అధికారం ఆ సంస్థలకే ఉంటుంది. ఈ వ్యవహారంలో కేంద్రానికి ఏం సంబంధం?’’ అంటూ ధ్వజమెత్తారు. ఆంక్షల అమలుతో విద్యుత్తు సరఫరా వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం పడిందని విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావును సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఆరా తీశారు. కాగా, విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి  పూర్తి చెల్లింపులు చేశామని, సమాచారం కూడా ఇచ్చామని సీఎంకు ప్రభాకర్‌రావు తెలిపారు. అయినా ఆంక్షలు విధించడం వెనుక కారణాలేంటో తెలియడంలేదని అన్నారు. విద్యుత్తు క్రయవిక్రయాలపై ఆంక్షలు విధించడానికి వీల్లేదంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో కేంద్రంపై కోర్టు ధిక్కార కేసు పెట్టాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 22న పిటిషన్‌ దాఖలు చేస్తామని ప్రభాకర్‌రావు తెలిపారు. కేంద్రం నిర్ణయంతో శుక్రవారం 20 మిలియన్‌ యూనిట్ల దాకా కరెంట్‌ను కొనుగోలు చేయలేకపోయామని, అయినప్పటికీ డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా చేస్తున్నామని అన్నారు. విద్యుత్తు సరఫరాలో సాధ్యమైనంత మేర అంతరాయం లేకుండా చూడాలని సీఎం ఆదేశించగా.. ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండటంతో పూర్తిస్థాయిలో జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామని, దీంతో గట్టెక్కగలిగామని ఆయన సీఎంకు వివరించారు. కేంద్రం ఆంక్షల నేపథ్యంలో విద్యుత్తు సంస్థలు శుక్రవారం రాష్ట్రంలో కరెంట్‌ కోతల విధింపు ద్వారా 1000-1500 మెగావాట్ల దాకా డిమాండ్‌ను కుదించాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు కోతలు అమలయ్యాయి. 26 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు సరఫరాను కుదించారు. గురువారం (ఆంక్షలు లేని సమయంలో) రాష్ట్ర డిమాండ్‌ 11,699 మెగావాట్లు ఉండగా, శుక్రవారం ఉదయం 7:06 గంటలకు (ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో) డిమాండ్‌ 8972  మెగావాట్లుగా నమోదైంది. ఉదయం పూట రైతులంతా పంపుసెట్లు ఆన్‌ చేస్తున్న సమయంలోనే విద్యుత్తు సంస్థలు కోతలు అమలు చేశాయి. వ్యవసాయ పంపుసెట్లు నడవాలంటే త్రీఫేజ్‌ కరెంట్‌ అవసరం. దాంతో సింగిల్‌ ఫేజ్‌కు పరిమితం చేసి, మోటార్లు నడవకుండా..


డిమాండ్‌ రాకుండా కట్టడి చేశారు. పగటిపూట విద్యుత్తు సరఫరాలో పూర్తిస్థాయిలో కరెంట్‌ కోతలు అమలు చేశారు. కాగా, రానున్న ఒకటి రెండు రోజుల్లో కరెంట్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. ఇందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు. కరెంట్‌ కోతలకు కారణం కేంద్ర ప్రభుత్వమేనని, విద్యుత్తు కొనుగోళ్లు జరపకుండా అడ్డుకుందని సీఎండీ ఆరోపించారు. ఇందులో రాష్ట్రప్రభుత్వం, విద్యుత్తు సంస్థల తప్పిదమేమీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జలవిద్యుత్తు, థర్మల్‌ విద్యుత్తు, సోలార్‌ విద్యుత్తును పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని, దీనికి రైతులు సహకరించాలని కోరారు. బకాయిలు చెల్లించినప్పటికీ ఆంక్షలు ఎందుకు విధించారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో 12214 మెగావాట్ల డిమాండ్‌ శుక్రవారం ఏర్పడినా కరెంట్‌ సరఫరా చేశామని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం నోటీసు కూడా ఇవ్వకుండా అకస్మాత్తుగా ఆంక్షలు విధించిందని తెలిపారు.


ఆంక్షలు 6 రాష్ట్రాలపైనే

విద్యుత్తు కొనుగోళ్లకు చెల్లింపులు చేయడం లేదనే కారణంతో ఆంక్షలకు గురైన రాష్ట్రాల జాబితా 13 నుంచి 7కు పరిమితమయింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు చెందిన 27 డిస్కమ్‌లు రూ.5085.30 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు గుర్తించి, ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే వీటిలో ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, జార్ఖండ్‌, మణిపూర్‌ రాష్ట్రాలపై విధించిన ఆంక్షలను శుక్రవారం కేంద్రం ఎత్తివేసింది. తెలంగాణను మాత్రం ఆంక్షల పరిధిలోనే ఉంచింది. దీంతో ఆంక్షలు అమలవుతున్న డిస్కమ్‌ల సంఖ్య 27 నుంచి 15కు తగ్గింది. తాజా వివరాల ప్రకారం బకాయిల వివరాలు కూడా తప్పు అని తేలింది. ప్రాప్తి (పేమెంట్‌ ర్యాటిఫికేషన్‌ అండ్‌ అనాలసిస్‌ పవర్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఫర్‌ బ్రింగింగ్‌ ట్రాన్స్‌పరెన్సీ ఇన్‌ ఇన్వాయిసింగ్‌ జనరేటర్స్‌) లెక్కల ప్రకారం ఆంక్షలు అమలవుతున్న 7 రాష్ట్రాల బకాయిలు రూ.1476.17 కోట్లే ఉన్నాయి. తెలంగాణ బకాయిలు కేవలం రూ.52.86 కోట్లేనని తేలింది. అయితే ఇది కూడా వాస్తవం కాదని, ఈ చెల్లింపులు కూడా చేసేశామని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ఇదే అంశాన్ని ఎన్‌ఎల్‌డీసీకి అందించామన్నారు. 


విద్యుత్తు సంస్థలపై  కేంద్రం పెత్తనమేంటి?

జగదీశ్‌రెడ్డి, విద్యుత్తు శాఖ మంత్రి

విద్యుత్తు సంస్థలపై ఆంక్షలు విధించడం దేశద్రోహపూరిత చర్య. రాజకీయ ప్రేరిపిత చర్యలతో రాష్ట్రాలను దెబ్బతీసేందుకు కేంద్ర కుట్ర చేస్తోంది. అయినా.. విద్యుత్తు సంస్థలపై కేంద్రప్రభుత్వ పెత్తనమేంటి? తెలంగాణ ఒక్కరూపాయి కూడా జెన్‌కోలకు బకాయి లేదు. విద్యుత్తు సంస్థలను ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం ఈ చర్యకు పాల్పడింది. విద్యుత్తు రంగం ఉమ్మడి జాబితాలో ఉంది. ఏ నిర్ణయం తీసుకునే అధికారమైనా రాష్ట్రానికే ఉంది. ఇప్పటికే కోర్టు కేసు ఉంది. అయినా న్యాయస్థానం ఉత్తర్వులను కేంద్రం ఉల్లంఘించింది. తెలంగాణను చీకట్లోకి నెట్టేందుకే మోదీ ప్రణాళికలు చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్తు కోతలు విధించాల్సి వస్తే..కేంద్రమే బాధ్యత వహించాల్సివస్తుంది. 

Updated Date - 2022-08-20T08:52:54+05:30 IST