బడిని వదలరే!

ABN , First Publish Date - 2022-04-03T08:18:13+05:30 IST

హైకోర్టు ఆక్షేపించినా..చివరకు ఐఏఎ్‌సలకు ‘సేవా శిక్ష’ విధించినా.. ఇవేవీ అధికారుల్లో మార్పును మాత్రం తీసుకురావడంలేదు.

బడిని వదలరే!

  • కోర్టు శిక్షించినా మొండితనమే!
  • ఆవరణలను వదలని ఆఫీసులు.. వైసీపీ రంగులూ ఎక్కడివక్కడే
  • చాలాచోట్ల పాఠశాలల్లోనే ప్రభుత్వ కార్యకలాపాలు
  • గుంటూరులో ఒకే బడిలో మూడు సచివాలయాలు
  • చిత్తూరులో సచివాలయానికి భవనం పూర్తి.. అయినా పాఠశాలలోనే


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌): హైకోర్టు ఆక్షేపించినా..చివరకు ఐఏఎ్‌సలకు ‘సేవా శిక్ష’ విధించినా.. ఇవేవీ అధికారుల్లో మార్పును మాత్రం తీసుకురావడంలేదు. పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల ఆవరణలు ఇంకా వైసీపీ రంగుల రాజకీయాలకు అరుగులుగానే కొనసాగుతున్నాయి. బడుల ఆవరణల్లో విద్యా సంబంధంకాని కార్యకలాపాలు, కార్యాలయాలు నిర్వహించొద్దని హైకోర్టు స్పష్టంగానే చెప్పింది. తన ఆదేశాల అమల్లో జాప్యంపై ఆగ్రహించి.. ఒకదశలో అధికారులకు జైలు శిక్ష విధించింది కూడా. ఆ తర్వాత తీవ్రత తగ్గించి ఆ శిక్షను ‘సేవ’ కిందకు మార్చింది. అయినా.. పాఠశాలల ప్రాంగణాల నుంచి కార్యాలయాలు కదలడం లేదు. రంగులూ వదలడంలేదు. కొన్నిచోట్ల అయితే.. పాఠశాల భవనాల్లోనే తిష్టవేశాయి. గుంటూరుసిటీలోని శ్రీనివాసరావుపేటలో ఇలా ఒక యూపీ స్కూల్‌నే మాయం చేశారు. దాసరి పానకాలరావు మెమోరియల్‌ మునిసిపల్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌లో గతంలో ఏడో తరగతి వరకు విద్యార్థులు చదువుకొనేవారు. అయితే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చిందో అప్పటి నుంచి ఈ స్కూల్‌ భవనాల్లో మూడు సచివాలయాలు ఏర్పాటు చేశారు. అక్కడి ఉపాధ్యాయులను  వేరే స్కూళ్లలోకి సర్దుబాటు చేశారు. సచివాలయాల ఏర్పాటు అనంతరం ఆ యూపీ స్కూలు ఏమైందో కూడా తెలియని పరిస్థితి! 


నిజమేంటి?

ప్రకాశం జిల్లా పి.సి.పల్లి మండలం గుదేవారిపాలెం రైతు భరోసా కేంద్రాన్ని రామాపురం ప్రభుత్వ పాఠశాలకు చెందిన భవనంలో ఏర్పాటుచేశారు. కేంద్రంలో శుక్రవారం వ్యవసాయ శాఖ ఉద్యోగులు విధు లు నిర్వహించారు.  వైసీపీ రంగులూ అలాగే ఉంచేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. అధికారులు పొంతన లేకుండా స్పందించారు. బడి ఆవరణలో ఆర్‌బీకేను నిర్వహించడం లేదని మండల విద్యాశాఖాధికారి జె.ప్రసాదరావు చెబితే.. ప్రత్యామ్నాయ భవనం లేకే ప్రభుత్వ పాఠశాలలో ఆర్‌బీకేను నిర్వహిస్తున్నామని మండల వ్యవసాయ అధికారి శిల్ప వివరణ ఇచ్చారు. 


ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని కేఎ్‌సపల్లి ప్రాథమిక పాఠశాలలో రైతు భరోసా కేంద్రం నడిపిస్తున్నారు. వివిధ పనులపై ఆర్‌బీకేకు వచ్చే రైతులు గట్టిగా మాట్లాడుతుండటం విద్యార్థుల చదువులకు ఆటంకంగా మారింది. ఈ కేంద్రానికి వైసీపీ రంగులూ తొలగించలేదు. 

కృష్ణాజిల్లా గుడివాడ రూరల్‌ మండలం చౌటపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, వత్సవాయి మండలం చిట్యాల గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణల్లోని గ్రౌండ్‌లో సచివాలయ భవన నిర్మాణం చేపట్టారు. నిర్మాణం దాదాపు పూర్తయింది. నిధులు రాక కాంట్రాక్టర్లు ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. చందర్లపాడు జడ్పీహెచ్‌ఎస్‌ ఆవరణలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించారు. గతంలో ఇదే ఆవరణలో ఎస్సీ బాలికల వసతి గృహం ఉండేది. పిల్లలు లేరని దీన్ని మూసివేశారు. దాన్ని పడగొట్టి ఆ స్థానంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రం నెలకొల్పారు. 

కడప జిల్లా చిన్నమండెం మండలంలోని మల్లూరు ప్రాఽథమిక పాఠశాలలో రైతు భరోసా కేంద్రం నడుస్తోంది. అయితే..బోర్డు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. 

చిత్తూరు జిల్లా వి.కోట పట్టణంలోని ఖాజీపేట మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాలలోనే సచివాలయం తిష్టవేసింది. స్కూలు వెలుపల నూతన భవన నిర్మాణం పూర్తయినా కూడా ఈ కార్యాలయాన్ని తరలించడం లేదు. శుక్రవారం సచివాలయం తెరిచి సిబ్బంది పనిచేయడం కనిపించింది. 

తిరుపతి రూరల్‌ మండలం పాడిపేటలో మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాలలోనే సచివాలయం నిర్వహిస్తున్నారు. వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని పాఠశాల ఆవరణలో సచివాలయ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. కోర్టు ఆదేశాల తర్వాతా పనులు ఆగలేదు. వైసీపీ రంగులే అద్దుతున్నారు. 


స్పీకర్‌ గ్రామంలోనూ..

శ్రీకాకుళంజిల్లా ఆమదాలవలస మండలం తొగరాం స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్వగ్రామం. ఈ గ్రామంలోని  ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రైతుభరోసా కేంద్రం నడుస్తోంది. వైసీపీ రంగులు కూడా తొలగించలేదు. 

Updated Date - 2022-04-03T08:18:13+05:30 IST