పోలీసులు సంయమనం పాటించాలి

ABN , First Publish Date - 2020-03-30T10:20:46+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో పోలీసులు విధి నిర్వహణలో సంయమనం

పోలీసులు సంయమనం పాటించాలి

ప్రజలను కొట్టొద్దు, తిట్టొద్దు

ప్రభుత్వ వాహనాలతోపాటు మీడియా వారినీ అనుమతించాలి

విధివిధానాలు తెలియజేసిన డీఎస్పీ ప్రసాద్‌


ఒంగోలు(క్రైం), మార్చి 29 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో పోలీసులు విధి నిర్వహణలో సంయమనం పాటించాలని ఒంగోలు డీఎస్పీ కె.వి.వి.ఎన్‌.వి. ప్రసాద్‌ సూచించారు. ఆదివారం సాయంత్రం ప్రకాశం భవనం వద్ద పోలీసులు లాక్‌డౌన్‌ విధుల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనల గురించి వివరించారు. పోలీసులు ప్రజలను కొట్టడం, తిట్టడంతోపాటు వారి వాహనాలను డ్యామేజీ చేయకూడదన్నారు. ద్విచక్రవాహనంపై అవసరాన్ని బట్టి ఇరువురిని అనుమతించాలని, నిత్యావసర వస్తువుల రవాణాను అడ్డుకోకూడదని, అదే వాహనాలలో ప్రజారవాణాను అనుమతించకూడదని చెప్పారు.


మాస్కులు ధరించలేదని ఎవరి మీద కఠినంగా వ్యవహరించవద్దని, ప్రజారవాణాకు కార్లు, బస్సులు, ఆటోలను అనుమతించకూడదని తెలిపారు. సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే వారిని ఉన్నతాధికారుల అనుమతి లేకుండా రానివ్వద్దని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వాహనాలను అనుమతించాలన్నారు. అలాగే ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా వారిపై దురుసుగా ప్రవర్తించవద్దని ఆదేశించారు.

Updated Date - 2020-03-30T10:20:46+05:30 IST