వారికి బియ్యం ఇవ్వరట!

ABN , First Publish Date - 2022-07-29T05:25:47+05:30 IST

కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలకు రాష్ట్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఉచిత బియ్యం పంపిణీకి జిల్లా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఉచిత బియ్యం కేవలం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులకే అందించనున్నారు.

వారికి బియ్యం ఇవ్వరట!

ఉచిత బియ్యానికి 12 వేల కార్డులు దూరం

  1 నుంచి ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులకే పంపిణీ

  స్వల్ప సంఖ్యలో లబ్ధిదారులపై కరుణ చూపని వైనం

  పెదవి విరుస్తున్న జిల్లావాసులు

 (పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలకు రాష్ట్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఉచిత బియ్యం పంపిణీకి జిల్లా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఉచిత బియ్యం కేవలం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులకే అందించనున్నారు. జిల్లాలో కేవలం 12 వేల మంది కార్డుదారులకు మాత్రమే ఇకపై ఉచిత బియ్యం అందవు. ఇన్నాళ్లు అందించి ఇప్పుడు స్వల్ప సంఖ్యలో ఉన్న కార్డు లబ్ధిదారులకు ఎందుకు ఉచిత బియ్యం అందించరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది సరికాదని దీనిపై అధికారులు స్పందించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.  

ఇదీ పరిస్థితి.. 

కరోనా కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం కింద ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలుపు రేషన్‌కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారునికి నెలకు 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేస్తోంది.  కాగా ఇప్పటివరకూ జిల్లాలో 2.75 లక్షల కార్డుదారులు  ఉచిత బియ్యం  పొందారు.  ఐదు దశల్లో ఈ పథకాన్ని అమలు చేసిన కేంద్రం మరో ఆరు నెలలు అంటే ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు ఈ కార్యక్రమాన్ని పొడిగించింది. అయితే ఏప్రిల్‌ నుంచి జూలై  వరకు జిల్లాలో ఉచిత బియ్యం పంపిణీ కాలేదు. దీంతో ప్రతిఒక్క కార్డుదారుడు ఐదు కిలోల చొప్పున మొత్తంగా నాలుగు నెలలకు 20 కిలోల వంతున బియ్యం నష్టపోయారు. తాజాగా కేంద్రం ఆదేశాలతో వచ్చేనెల నుంచి  ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులకు మాత్రమే ఉచిత బియ్యం పంపిణీ చేస్తారు. అంటే జిల్లాలో 2.63 లక్షల మందికి ఉచిత బియ్యం అందనుంది. కేవలం 12 వేల కార్డులు ఈ పథకానికి దూరం కానున్నాయి. ఇదిలా ఉండగా ఉచిత బియ్యం పంపిణీకి   సంబంధించి వలంటీర్ల ద్వారా కూపన్లు జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఉదయం నగదుకు - మధ్యాహ్నం ఉచితం.. 

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ఉన్న కార్డు జాబితాను గ్రామ రెవెన్యూ అధికారి లాగెన్‌కు పంపిస్తారు. ఉచిత బియ్యంపై కరపత్రాలు పంపిణీ చేస్తారు. రేషన్‌ దుకాణాల వద్ద బ్యానర్లు కడతారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఉదయం వేళల్లో రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయికి అందిస్తున్న బియ్యాన్ని 2,75,706 కార్డులకు  అందించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేస్తారు. కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని మధ్యాహ్నం 3 గంటల నుంచి డీలర్ల ద్వారా రేషన్‌ డిపోల వద్ద పంపిణీ చేస్తారు. మొత్తంగా జిల్లాలోని 15 మండలాల్లో 521 రేషన్‌ డిపోలు ఉన్నాయి. పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాల పరిధిలో 53 దుకాణాలు ఉన్నాయి.   ఆన్‌లైన్‌ ద్వారా 511 దుకాణాలు, ఆఫ్‌లైన్‌లో 63 దుకాణాలు పనిచేస్తున్నాయి. మొత్తంగా 574  రేషన్‌ డిపోల పరిధిలో 219 సచివాలయాలు గ్రామీణ ప్రాంతంలో ఉండగా, పార్వతీపురం, సాలూరు పట్టణాల పరిధిలో 29 సచివాలయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 169 ఎండీయూ వాహనాలు ఉండగా, 27 వాహనాలు పట్టణాల పరిధిలో ఉన్నాయి. మొత్తం 196 వాహనాల ద్వారా బియ్యాన్ని అందిస్తున్నారు. 

12 వేల కార్డులకు అందించలేరా?   

 జిల్లాలో సుమారు 12 వేల కార్డులు ఉచిత బియ్యం పథకానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.  దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరికి బియ్యం అందించి, మరొకరికి అందించకపోతే ప్రజల స్పందన ఎలా ఉంటుందోనని మరోవైపు రేషన్‌ డిపోల డీలర్లు ఆందోళన చెందుతున్నారు. దీనిపై  ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రేషన్‌ కార్డుదారులు కోరుతున్నారు. 

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులకే.. 

జిల్లాలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులకు మాత్రమే ఉచిత బియ్యం పంపిణీ జరుగుతుంది. మన్యం జిల్లాలో అత్యధిక కార్డులకు బియ్యం అందించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేవలం 12 వేల మందికి మాత్రమే కేంద్రం అందించే ఉచిత బియ్యం అందవు.   

- మధుసూదనరావు, ఇన్‌చార్జి డీఎస్‌వో, పార్వతీపురం మన్యం జిల్లా

  


Updated Date - 2022-07-29T05:25:47+05:30 IST