‘మత్తు’ దిగొద్దు!

ABN , First Publish Date - 2021-07-26T08:24:55+05:30 IST

మద్య నిషేధంపై వైసీపీ ప్రభుత్వ అసలు రంగు క్రమంగా బయటపడుతోంది. ఎంత దాచాలనుకున్నా ‘నిషేధం మాయ’ బహిర్గతమవుతూనే ఉంది.

‘మత్తు’ దిగొద్దు!

  • తాగుడు పెంచేందుకు తంటాలు
  • చుక్క తగ్గొద్దు.. లెక్క తప్పొద్దు..
  • తక్కువ అమ్మే చోట రీలొకేషన్‌ పాలసీ
  • నిజానికి మద్యం తగ్గడమేగా ‘నిషేధం’
  • కానీ, హడావుడిగా ఎక్సైజ్‌ ఆదేశాలు
  • ఆదాయం లేని వంద షాపులు గుర్తింపు
  • ఆ దుకాణాలు రద్దీ ఏరియాలకు తరలింపు
  • ఇప్పటికే కొత్త షాపులకు ఆదేశాలు
  • తాజాగా అమ్మకాలు పెంచే యత్నాలు
  • దుకాణాలు, అమ్మకాలు పెంచుకుంటూ పోతాం

అనంతపురం జిల్లాలోని ఓ సర్కారీ మద్యం షాపు నిర్వహణకు నెలకు రూ.73,496 ఖర్చు అవుతోంది. దాని ప్రకారం ఆ షాపు నెలకు రూ.21.18 లక్షల మద్యం అమ్మాలి. కానీ అక్కడ రూ.10.82 లక్షలే అమ్ముతున్నారు. మరి సంతోషమేగా! తాగుడును తగ్గించడమేగా ‘విడతలవారీ మద్యనిషేధం’ స్ఫూర్తి! కానేకాదు.. ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి ప్రకారం ఇది నాట్‌ ఫీజిబుల్‌ అట! ఇలా అమ్మకాలు తక్కువగా ఉన్న వంద షాపులను రాష్ట్రవ్యాప్తంగా గుర్తించారు. ‘తాగండి... ఊగండి’ స్కీమ్‌ కింద వాటిని రద్దీ ప్రాంతాలకు  తరలించాలని ఆదేశించారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): మద్య నిషేధంపై వైసీపీ ప్రభుత్వ అసలు రంగు క్రమంగా  బయటపడుతోంది. ఎంత దాచాలనుకున్నా ‘నిషేధం మాయ’ బహిర్గతమవుతూనే ఉంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,934 మద్యం షాపుల్లో అతి తక్కువగా అమ్మకాలున్న చివరి వంద షాపులను ప్రభుత్వం గుర్తించింది. ఆ షాపుల నిర్వహణ ‘గిట్టుబాటు కాదు (నాట్‌ ఫీజిబుల్‌)’ అని తేల్చేసింది. ఆ షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు, షాపు అద్దె, రవాణా చార్జీలు, స్వీపర్‌ కూలీ, విద్యుత్‌ బిల్లు, వాచ్‌మెన్‌ వేతనం, ఇతర ఖర్చులు అన్నీ లెక్కగట్టి...అందుకు తగ్గట్టుగా సగటు అమ్మకాలు అక్కడ లేవని వివరించింది. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ మద్య నిషేధ పాలసీ ప్రకారం అమ్మకాలు తగ్గడం అనేది ప్రభుత్వానికి సానుకూలంగా కనిపించాలి. ఇలాగే మిగిలిన షాపుల్లోనూ మద్యం అమ్మకాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్సైజ్‌ శాఖ అందుకు విరుద్ధంగా అమ్మకాలు పెంచడంపై దృష్టిపెట్టింది. ఇలా అమ్మకాలు తగ్గిపోతే ఎలాగంటూ, ఆ షాపులను అక్కడి నుంచి రద్దీగా ఉండే ప్రాంతాలకు మార్చాలని ఆదేశాలు జారీచేసింది. అంటే ఆ వంద షాపులను రీలొకేట్‌ చేసి అమ్మకాలు పెంచాలని క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతోంది. 


దీంతో క్షేత్రస్థాయిలో షాపుల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న డిపో మేనేజర్లు కొత్త షాపులను అద్దెకు తీసుకునే పనిలో పడ్డారని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. అద్దె పెరిగినా అమ్మకాలు బాగా పెరగాలని, అందుకు తగ్గట్టుగా కొత్త ప్రాంతాలకు మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు.  అసలు అధికారుల ఆదేశాలేంటో కిందిస్థాయి యంత్రాంగాని కి అర్థంకావటం లేదు. ఒక ప్రభుత్వం ఒక పాలసీని తీసుకుంటే అందుకు అనుగుణంగా ఉన్నతస్థాయి నుంచి కిందిస్థా యి వరకు పనిచేస్తారు. వైసీపీ ప్రభుత్వంలో అంతా భిన్నమే. ముఖ్యంగా మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వ పాలసీ కి, అధికారుల ఆదేశాలకు మధ్య సంబంధమే లేదు. ఇటీవల రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌భార్గవ చేసిన వ్యాఖ్యలు ఎక్సైజ్‌ వర్గాలనే తికమకకు గురిచేశాయి. అమ్మకాలు తగ్గకుండా చూడాలని.. మరోవైపు ప్రభుత్వ నిషేధం పాలసీకి అనుగుణంగా చర్యలుండాలని రెండు కోణాల్లోనూ ఆయన మాట్లాడారు. అసలు ఆయన ఉద్దేశం ఏంటో వారం రోజులైనా ఇప్పటికీ ఎక్సైజ్‌ అధికారులకు అర్థంకాలేదు. ‘పాలసీకి విరుద్ధంగా అమ్మకాలు పెంచేయాలంటారా? లేక నిషేధానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలా?’ అని ఓ జిల్లాస్థాయి అధికారి వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ఆదాయమే లక్ష్యం. ఆ మాటే చెప్పి అమ్మకాలు పెంచుకోవచ్చనే విమర్శలు వస్తున్నాయి. 


‘రికార్డు’ తగ్గకూడదని..

జూన్‌లో ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.2వేల కోట్ల విలువైన మద్యాన్ని అమ్మింది. జూలైలో ఇప్పటివరకూ సుమారు రూ.1500కోట్లే అమ్మింది. దీంతో ఈనెల కూడా గత నెల తరహాలో భారీగా అమ్మకాలు ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అమ్మే ప్రతి సీసాలో అసలు విలువలో దాదాపు 80శాతం ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుంది. ఈ స్థాయిలో ఆదాయం ఇచ్చే మరో రంగం ప్రభుత్వానికి లేదు. ఈ లెక్కన నెలకు రూ.2వేల కోట్ల మద్యం అమ్మితే, అందులో రూ.1,600 కోట్లు ఆదాయంగా మిగులుతుంది. అందులోనూ మద్యం ద్వారా వచ్చేది రోజువా రీ రాబడి కావడంతో ప్రతిరోజూ ఎంతలేదన్నా రూ.50 కోట్లు తగ్గకుండా ప్రభుత్వ ఖజానాలో పడుతుంది. అందువల్లే  మద్యం అమ్మకాలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఖర్చు ఎక్కువ.. ఆదాయం తక్కువ ఉన్న సర్కారీ మద్యంషాపులు అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. అనంతపురంలో 26, చిత్తూరులో 32, కర్నూలులో 11, కృష్ణాలో 10, తూర్పుగోదావరి, గుంటూరులో చెరో ఏడు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళంలో చెరో రెండు, విజయనగరంలో ఒక షాపు గుర్తించారు. 

Updated Date - 2021-07-26T08:24:55+05:30 IST