మహనీయులను మరవద్దు

ABN , First Publish Date - 2022-08-16T05:56:54+05:30 IST

Don't forget thదేశ స్వాతంత్య్రం కోసం వీరోచిత పోరాటం చేసిన మహనీయులను ఎన్నటికీ మరవద్దని, వారి త్యాగాలను ఎప్పటికీ స్మరించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. e nobles

మహనీయులను మరవద్దు

- ప్రజల్లో దేశభక్తిని నింపేందుకే వజ్రోత్సవాలు

- జిల్లాలో 32,834 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు

- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌ కుమార్‌


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

దేశ స్వాతంత్య్రం కోసం వీరోచిత పోరాటం చేసిన మహనీయులను ఎన్నటికీ మరవద్దని, వారి త్యాగాలను ఎప్పటికీ స్మరించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావడంతో స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, దేశభక్తి భావనను ప్రజల్లో నిలిపేందుకు ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వజ్రోత్సవ ద్విసప్తాహంను ప్రభుత్వం నిర్వహిస్తున్నదని అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. 

దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ద్వారా 232 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారి ఖాతాల్లో డబ్బులను జమ చేశామని, 130 యూనిట్లను పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఆసరా పథకం ద్వారా 75,725 మంది దివ్యాంగులకు 3016బ రూపాయలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఎయిడ్స్‌, ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు 2016బ రూపాయలు ఇస్తున్నామన్నారు. కొత్తగా మరో 32,834 మందికి పింఛన్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఇప్పటి వరకు 2103 స్వశక్తి సంఘాలకు రూ.113.27 కోట్లు, స్త్రీనిధి ద్వారా రూ. 7.51 కోట్ల రుణాలను అందించామన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా 18,04,780 పనిదినాలను కల్పించి రూ.38.35 కోట్లు చెల్లించామన్నారు. రైతులకు పెట్టుబడిసాయం అందించేందుకు అమలు చేస్తున్న రైతుబంధు పథకం ద్వారా వానాకాలం పంటకు గాను జిల్లాలో 1,42,295 మంది రైతులకు 136.52 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. 2021లో మరణించిన 370 మంది రైతుకుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున 18.5 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశామన్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 79,332 మంది రైతులకు 15.86 కోట్ల  రూపాయలను అందించామన్నారు.

- చేనేత కార్మికులకూ బీమా..

 రైతులతో పాటు చేనేత కార్మికులకు సైతం బీమా పథకాన్ని ఈ నెల 7వ తేదీ నుంచి ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చిందన్నారు. జిల్లాలో 42 మంది అర్హులను గుర్తించామని, 70 మరమగ్గాలకు 50 శాతం సబ్సిడీతో విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం వల్ల కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో 10 అవార్డులు రాష్ట్రానికి దక్కాయని, అందులో జిల్లాలోని మంథని మండలం నాగారం, ముత్తారం మండలం హరిపురం గ్రామపంచాయతీలకు అవార్డులు దక్కడం గర్వకారణమన్నారు. జిల్లాలోని 267 పంచాయతీల్లో 265 డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు, 353 పల్లెప్రకృతి వనాలు, 266 నర్సరీలు, 72 గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టణప్రగతిలో భాగంగా పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 12 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్లు ఇచ్చామన్నారు. మాతాశిశు మరణాలను తగ్గించడానికి ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 1,151 కేసీఆర్‌ కిట్లను పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు 3,297 మంది గర్భిణీలకు ప్రసవాలు జరిగాయన్నారు. సాధారణ ప్రసవాలు జరిపేందుకు 70 మంది స్టాఫ్‌ నర్సులు, 25 మంది డాక్టర్లకు దక్షిణ అనే శిక్షణ ఇచ్చామన్నారు. పెద్దపల్లిలో 100 పడకలు, మంథనిలో 50 పడకల ఆసుపత్రులను ఆరంభించుకున్నామన్నారు. 

- ‘మన ఊరు-మన బడి’ ద్వారా..

మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా మొదటి విడతలో జిల్లాలోని 191 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించామన్నారు. ఇందుకోసం 1,753 మంది ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలకు శిక్షణ ఇచ్చామన్నారు. బడిబాట ద్వారా 3,345 మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించామని వివరించారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేసేందుకు రూ. 677 కోట్లు వెచ్చించామన్నారు. ఇంట్రా విలేజ్‌ కింద 227 కోట్ల రూపాయల వ్యయంతో 321 ట్యాంకులు, 1,48,286 నల్లా కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు. విద్యుత్‌శాఖ ద్వారా జిల్లాలోని 72,413 వ్యవసాయ కనెక్షన్లకు ప్రతి ఏటా 108.64 కోట్ల  రూపాయలతో రైతులకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 101 యూనిట్లలోపు కోటి 60 లక్షలతో ఉచితంగా విద్యుత్‌ ఇస్తున్నామన్నారు. ఇటీవల ఎన్టీపీసీలో 100 మెగావాట్ల నీటిలో తేలియాడే సోలార్‌ విద్యుత్‌ ప్లాంటును ప్రారంభించుకున్నామన్నారు. అటవీ శాఖ ద్వారా గత ఏడాది 47 లక్షల మొక్కలను నాటామని, ఈ ఏడాది మరో 44 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. రోడ్లు భవనాల శాఖ ద్వారా 110.78 కోట్ల రూపాయలతో 185 కిలోమీటర్ల వరకు 17 డబుల్‌ రోడ్ల విస్తరణ పనులు,  133 కోట్ల రూపాయలతో 13 వంతెనలు, 48.97 కోట్ల రూపాయలతో 44 కిలోమీటర్ల వరకు గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేశామన్నారు.  3.2 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు,  57.8 కోట్ల రూపాయలతో సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణం చేశామని, 56 కోట్ల రూపాయలతో రామగుండం వైద్య కళాశాల పనులను పూర్తి చేస్తామన్నారు. పరిశ్రమల శాఖ ద్వారా 428 చిన్న పరిశ్రమలను నెలకొల్పి 4,955 మందికి ఉపాధి కల్పించామన్నారు. పీఎం ఉపాధి కల్పన పథకం కింద రూ.2.35 కోట్లతో 60 యూనిట్లు నెలకొల్పామన్నారు. 

- 2,854 మంది విద్యార్థులకు వసతి..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా 37 గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయని, ఇందులో 2854 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ఎస్సీలకు రూ.5.76 కోట్లు, ఎస్టీలకు రూ. 1.31 కోట్లు, బీసీలకు రూ. 19.33 కోట్లు, మైనార్టీలకు రూ.1.82 కోట్లు మంజూరు చేశామన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న 16 జంటలకు రూ. 2.50 లక్షల చొప్పున రూ. 40 లక్షలు, ఎస్టీ ఇద్దరు జంటలకు రూ.లక్ష పంపిణీ చేశామన్నారు. 348 నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు, 1129 రజకుల లాండ్రీలకు, 5 దోబీఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలోని 706 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి ద్వారా జిల్లాలో 20,205 మంది లబ్ధిదారులకు రూ. 201.51 కోట్ల విలువైన చెక్కులను, షాధీముబారక్‌ ద్వారా 1,425 మంది లబ్ధిదారులకు రూ. 12.83 కోట్ల చెక్కులను పంపిణీ చేశామన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు గానూ ప్రతి సీజన్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, గడిచిన యాసంగి సీజన్‌లో 2,74,310 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులకు వినోద్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

- ఆసరా పింఛన్ల పత్రాల పంపిణీ

 ఆసరా పథకం కింద జిల్లాలో కొత్తగా 32,834 మందికి ఆసరా పింఛన్ల పత్రాలను వినోద్‌ కుమార్‌ పంపిణీ చేశారు. అలాగే బ్యాంకు లింకేజీ పథకం కింద 316 స్వశక్తి సంఘాలకు 23.98 లక్షల చెక్కులను మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన వివిధ శాఖల ద్వారా ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. 

Updated Date - 2022-08-16T05:56:54+05:30 IST