మహనీయులను మరువరాదు

ABN , First Publish Date - 2022-08-07T04:18:10+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు పోరాడి ప్రాణాలు అర్పించినమహనీయుల త్యాగాలను ప్రజలు ఎన్నటికీ మరువరాదని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అన్నారు.

మహనీయులను మరువరాదు
చిత్ర ప్రదర్శనను తిలకిస్తున్న కలెక్టర్‌

ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయాలి
కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌
స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రారంభం


నంద్యాల టౌన్‌, ఆగస్టు 6 : దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు పోరాడి ప్రాణాలు అర్పించినమహనీయుల త్యాగాలను ప్రజలు ఎన్నటికీ మరువరాదని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అన్నారు. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌-హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా సమాచార పౌర సంబంధాల శాఖ, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌లోని వైఎస్సార్‌ సెంటినరీ హాల్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ను కలెక్టర్‌ శనివారం ప్రారంభించారు. స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ ఈ నెల 15 దాకా ఉంటుందని అన్నారు. ఈ నెల 14న నంద్యాల జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానిస్తామని అన్నారు. 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు జెండాలను, కర్రలను ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామన్నారు. పట్టణాల్లోని ముఖ్య కూడళ్లలో హోర్డింగులు, ప్లెక్సీలను ఏర్పాటు చేస్తామన్నారు. 15వ తేదీ వరకు జిల్లాలో స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర, దేశభక్తి తదితర అంశాలపై ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13న జాతీయ పతాకంతో సెల్ఫీ దిగి హర్‌ ఘర్‌ తిరంగా డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. త్యాగధనులు, దర్శనీయ స్థలాలు, దేశభక్తికి సంబంధించిన ఫొటోలు, జిల్లా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల ఫొటోల వివరాలను జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి జయరావు కలెక్టర్‌కు వివరించారు. జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల్లో యల్లూరి స్వామిరెడ్డి, పెండేకంటి వెంకట సుబ్బయ్య, కాదర్‌బాద్‌ నరసింగరావు,  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వడ్డె ఓబన్న,  గుర్రం వెంకటరెడ్డి, గమాగోల చిత్రపటాలను కలెక్టర్‌ ప్రత్యేకంగా తిలకించారు. అనంతరం జాతీయ జెండాతో సెల్ఫీ దిగి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పుల్లయ్య, సమాచార శాఖ డీఐపీఆర్‌ జయరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T04:18:10+05:30 IST