మన ఊరు.. మన బడి..టెండర్లను ఖరారు చేయొద్దు

ABN , First Publish Date - 2022-07-07T09:19:24+05:30 IST

మన ఊరు.. మన బడి టెండర్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

మన ఊరు.. మన బడి..టెండర్లను ఖరారు చేయొద్దు

  • హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • 4 టెండర్లను సవాల్‌ చేస్తూ పిటిషన్లు
  • 3 పిటిషన్‌లలో మధ్యంతర ఉత్తర్వులు


హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): మన ఊరు.. మన బడి టెండర్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తుది టెండర్లను ఖరారు చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ బుధవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. మన ఊరు.. మన బడి పథకంలో భాగంగా 26,065 పాఠశాలలకు పెయింట్స్‌ కోసం రూ.820 కోట్లు, ఫర్నిచర్‌కు రూ.195 కోట్లు, డ్యూయల్‌ డెస్క్‌లకు రూ.360 కోట్లు, గ్రీన్‌ చాక్‌బోర్డుకు రూ.164 కోట్లు.. ఇలా మొత్తం కలిపి రూ. 1,539 కోట్లకు పాఠశాల విద్యాశాఖ, రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌ (టీఎ్‌సఈడబ్ల్యూఐడీసీ) టెండర్లను ఆహ్వానించింది. టెండర్‌ నెంబరు 43(డ్యూయల్‌ డెస్క్‌ల కొనుగోళ్లు), టెండర్‌ నెంబరు 44(ఫర్నిచర్‌ సేకరణ)లను సవాల్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్రీయ భండార్‌, జెనిత్‌ మెటాప్లాస్ట్‌, వీ3 ఎంటర్‌ప్రైజెస్‌ అనే మూడు కంపెనీలతో కూడిన జాయింట్‌ వెంచర్‌ సంస్థ రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేసింది.


 ఈ పిటిషన్‌లు బుధవారం జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. పిటిషనర్‌ తరఫున న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ.. కారణాలు లేకుండా బిడ్డింగ్‌ విషయంలో తమను అనర్హత జాబితాలో చేర్చారని.. టెండర్‌ నిబంధనల్లో పేర్కొన్న అన్ని అర్హతలు తమకున్నాయని పేర్కొన్నారు. టెండర్‌ ప్రక్రియలో పాల్గొనే జాయింట్‌ వెంచర్‌ సంస్థ గత ఐదేళ్లలో ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.97.5 కోట్ల విలువైన పనులు చేసి ఉండాలని నిబంధనల్లో ఉందని.. తాము నాలుగేళ్లపాటు రూ. 200 కోట్లకు పైగా పనులు చేశామని తెలిపారు. నిబంధనల్లో పేర్కొన్నదానికంటే ఎక్కువ అనుభవం ఉన్న తమను.. అనుభవం లేదని పేర్కొంటూ పక్కన పెట్టడం చట్టవిరుద్ధమన్నారు. తమకంటే తక్కువ అనుభవం ఉన్న ఎలిగాంట్‌ మెథోడెక్స్‌ను అర్హత కలిగిన బిడ్డర్‌గా గుర్తించడం చెల్లదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. టెండర్‌కు దరఖాస్తు చేసే సమయంలో పిటిషనర్‌ సంస్థ ఈ అనుభవ ధ్రువపత్రాలను సమర్పించిందా? లేదా? అనేది తెలియదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. పాఠశాల విద్యాశాఖ, టీఎ్‌సఈడబ్ల్యూఐడీసీ, కార్పొరేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌, ప్రైవేటు పార్టీ అయిన ఎలిగాంట్‌ మెథోడెక్స్‌లకు నోటీసులు జారీచేసింది. టెండర్‌ ప్రక్రియను కొనసాగించవచ్చని.. తుది టెండర్లను ఖరారు చేయరాదని మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. విచారణ ఈ నెల 11కు వాయిదా పడింది.


గ్రీన్‌ చాక్‌ బోర్డుల టెంబర్‌ ఖరారు చేయొద్దు.. 

26,065 పాఠశాలలకు గ్రీన్‌ చాక్‌బోర్డుల కొనుగోళ్లకు సంబంధించిన టెండర్‌ నెంబరు 45ని సవాల్‌ చేస్తూ కేంద్రీయ భండార్‌, వైట్‌ మార్క్‌ అనే కంపెనీల జాయింట్‌ వెంచర్‌ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇందులో పాఠశాల విద్యాశాఖ, టీఎ్‌సఈడబ్ల్యూఐడీసీ, టీఎ్‌సఈడబ్ల్యూఐడీసీ చీఫ్‌ ఇంజనీర్‌, కావేరీ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌, ప్రిన్స్‌బోర్డు అనే సంస్థలను పార్టీలుగా చేర్చింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు తుది టెండర్లను ఖరారు చేయరాదని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఈ టెండర్లకు సంబంధించిన అన్ని పిటిషన్‌లు ఒకే ధర్మాసనం ఎదుట లిస్ట్‌ అయ్యేలా చీఫ్‌ జస్టిస్‌ నుంచి సూచనలు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది.


పెయింట్స్‌ సరఫరా టెండర్‌పై..

రాష్ట్రంలోని పాఠశాలలకు పెయింట్స్‌ సరఫరాకు చేసేందుకు ఉద్దేశించిన టెండర్‌ నెంబరు 46ను సవాల్‌ చేస్తూ స్పందన లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ జరగాల్సి ఉంది.

Updated Date - 2022-07-07T09:19:24+05:30 IST