విద్యుదుత్పత్తిపై గొడవలొద్దు!

ABN , First Publish Date - 2022-08-05T07:54:08+05:30 IST

విద్యుదుత్పత్తిపై గొడవలొద్దు!

విద్యుదుత్పత్తిపై గొడవలొద్దు!

ఎవరి జల విద్యుత్కేంద్రాలు వారివే.. కరెంటుపై వాదులాడుకోవద్దు

సాగర్‌లో తాగు, సాగు అవసరాలు ఉన్నప్పుడే శ్రీశైలంలో జలవిద్యుత్‌

ఆర్‌ఎంసీ భేటీలో రెండు రాష్ట్రాల నిర్ణయం


హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్ర భూభాగంలో ఉన్న జలవిద్యుత్కేంద్రాలు ఆ రాష్ట్రానికే చెందుతాయని, వాటిలో జరిగే విద్యుదుత్పాదనపై తగవులాడుకోరాదని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు నిర్ణయించాయి. గురువారం జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆధ్వర్యంలో రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ) సమావేశం జరిగింది. దీనికి కృష్ణా బోర్డు నుంచి రవికుమార్‌ పిళ్లై, ముత్తంగ్‌, తెలంగాణ నుంచి ఈఎన్‌సీ సి.మురళీధర్‌, అంతర్రాష్ట్ర విభాగం సీఈ మోహన్‌కుమార్‌, ఆంధ్ర నుంచి ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి హాజరయ్యారు. తొలుత జలవిద్యుత్‌పై చర్చ జరిగింది. ఏ రాష్ట్రంలో ఉన్న జలవిద్యుత్కేంద్రాలు ఆ రాష్ట్రానికే చెందుతాయని, వాటిలో జరిగే విద్యుదుత్పత్తిపై అభ్యంతరాలు వ్యక్తం చేయరాదని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. జలవిద్యుత్‌పై కేఆర్‌ఎంబీ సెక్రటేరియట్‌ ఆదేశాలు చెల్లవని, దీనికోసం శాశ్వత ప్రాతిపదికన బోర్డు సభ్యులతో స్టాండింగ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. బోర్డుకు ఎలాంటి అధికారాలూ లేవని, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే సూచనలైనా, సలహాలైనా ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. ఇక నాగార్జున సాగర్‌ తెలంగాణకే చెందుతుందని బోర్డు తన మినిట్స్‌లో పేర్కొనడాన్ని ఆంధ్ర తప్పుపట్టడంతో అందులో నుంచి ‘తెలంగాణ’ పదాన్ని తొలగించారు. రూల్‌ కర్వ్‌ ముసాయిదాపై చర్చిస్తూ.. బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులుగా ఉండాలని కేంద్ర జల సంఘం గుర్తు చేసిందని బోర్డు వివరించగా.. జలవిద్యుత్‌ అవసరాలకే శ్రీశైలం కట్టారని, కనీస నీటిమట్టం 834 అడుగులుగా ఉంచాల్సిందేనని తెలంగాణ పట్టుబట్టింది. ఇప్పటిదాకా ఏటా జూలై 1 నుంచి అక్టోబరు 31 దాకా శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులుగా ఉండాలని పేర్కొనగా.. ఇందులో జూలైని తొలగించి, జూన్‌ 1 చేర్చాలని ఆంధ్ర ప్రతిపాదించింది. సాగర్‌లో తాగు, సాగునీటి అవసరాలు ఉన్న సమయంలో శ్రీశైలంలో కనీస నీటిమట్టం పరిగణనలోకి తీసుకోరాదని తెలంగాణ స్పష్టం చేసింది. దీనిపై త్వరలోనే సమావేశం తాలూకు మినిట్స్‌ పంపిస్తామని.. ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తే వాటినే తుది నిర్ణయాలుగా పరిగణనలోకి తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ నెల మూడో వారంలో తదుపరి ఆర్‌ఎంసీ భేటీ.. అనంతరం జరిగే బోర్డు సమావేశంలో జలవిద్యుత్‌, రూల్‌ కర్వ్‌, వరద జలాల గుర్తింపుపై చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.


వరద జలాలు పరిగణనలోకి  తీసుకోవద్దు..

వరద జలాలను లెక్కించాలి తప్ప పరిగణనలోకి తీసుకోరాదని కోరినట్లు ఆంధ్ర  ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఆర్‌ఎంసీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. సాగర్‌లో తాగు, సాగునీటి అవసరాలు ఉంటేనే శ్రీశైలంలో జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని కోరామని చెప్పారు. సాగునీటి అవసరాలకు 854 అడుగులు, జలవిద్యుదుత్పత్తికి 834 అడుగులు, తాగునీటి అవసరాలకు 815 అడుగుల కనీస నీటిమట్టం శ్రీశైలంలో ఉండాలని కోరినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2022-08-05T07:54:08+05:30 IST