అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం...

ABN , First Publish Date - 2022-01-19T05:39:28+05:30 IST

అకాల వర్షం వల్ల పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడొద్దని, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకే తాము ఇక్కడికి క్షేత్ర పరిశీలనకు వచ్చామని అన్నారు.

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం...
పరకాల మండలం నాగారం గ్రామంలో నష్టపోయిన పంటను పరిశీలిస్తున్న మంత్రుల బృందం

అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి..
బాధిత రైతులను చూస్తే గుండె తరుక్కుపోతోంది..
తగిన పరిహారం అందేలా చూస్తాం..
సీఎం సానుభూతితో ఉన్నారు..
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి
నాలుగు మండలాల్లో పర్యటన
దెబ్బతిన్న పంటల పరిశీలన.. రైతులకు ఓదార్పు
తమను ఆదుకోవాలని కన్నీరుమున్నీరైన రైతులు


నర్సంపేట టౌన్‌/పరకాల/నడికూడ/రేగొండ, జనవరి 18 :
అకాల వర్షం వల్ల పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడొద్దని, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకే తాము ఇక్కడికి క్షేత్ర పరిశీలనకు వచ్చామని అన్నారు. మంగళవారం ఆయన  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, రాష్ట్ర  రైతు బంధు సమితి  అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులతో కలిసి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఐదు మండలాల్లో పర్యటించారు.  హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట, నాగారం.. నడికూడ మండలంలోని నడికూడ, పులిగిల్ల... వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ఇప్పల్‌తండా.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని చెన్నాపూర్‌ గ్రామాల్లో వారి పర్యటన సాగింది.

ఈ సందర్భంగా వారు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం గురించి ఆరా తీశారు. మంత్రులను చూడగానే పంటలు కోల్పోయిన రైతులు దెబ్బతిన్న మిర్చి, మొక్కజొన్న పంటలను చూపిస్తూ భోరున విలపించారు. చేతికందిన పంట నోటికందకుండా పోయిందని, ఇక తాము ఎలా బతకాలని వాపోయారు. తమను ఆదుకోవాలని మంత్రుల కాళ్లమీద పడి వేడుకున్నారు. మంత్రులు వారిని ఓదార్చారు.  అకాల వర్షం వల్ల పంటలకు జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించి తగిన సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పరకాల మార్కెట్‌లోని  రైతువేదిక వద్ద మంత్రి నిరంజన్‌ రెడ్డి  రైతులను ఉద్దేశించి మాట్లాడారు.  అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను చూస్తే తన గుండె తరుక్కుపోయిందని, పంటలు బాగా దెబ్బతిన్నది వాస్తవమేనని అన్నారు. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నష్టపోయిన రైతుల పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను సమర్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలవల్ల రైతులు అన్యాయమై పోతున్నారని ఽధ్వజమెత్తారు. దేశ పాలకుల వ్యవసాయ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని విమర్శించారు. రైతులకు వెనుదన్నుగా నిలుస్తున్నది దేశంలో కేసీఆర్‌ ఒక్కరేనన్నారు.   

నర్సంపేట మండలం ఇప్పల్‌తండాలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ  భారత దేశంలో వరి సాగులో గతంలో పంజాబ్‌ ముందుండేదని, నేడు తెలంగాణలో పంజాబ్‌ కంటే ఎక్కువగా ధాన్యం పండించి రికార్డు సాధించిందన్నారు. కానీ కేంద్రం చేతులెత్తేసి ధాన్యం కొనలేమని, నిల్వ చేయడానికి గోదాములు లేవంటోందని తెలిపారు. కేంద్రం ఉపాఽధి హామీలో వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేస్తే నేడు కూలీల కొరత ఉండేది కాదన్నారు. అనంతరం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఉమ్మడి జిల్లా తాజా వ్యవసాయ పరిస్థితులు, పంట నష్టాలు, వాటి అంచనాలు, ప్రాథమిక నివేదికలు, ప్రత్యామ్నాయ పంటల సాగు వంటి పలు అంశాలపై మంత్రులు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రుల పర్యటనలో ఇంకా  ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్‌, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు ఽచల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య,  శంకర్‌నాయక్‌, వరంగల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర  జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ఆదుకోండి సారూ..
‘సార్‌.. అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయాం మీరే ఆదుకోవాలి’ అంటూ నర్సంపేట మండలం ఇప్పల్‌తండాలో దెబ్బతిన్న పంటల పరిశీలనకు వచ్చిన మంత్రులకు బాధిత రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. మంత్రులు నర్సంపేటకు మధ్యాహ్నం 2గంటల తర్వాత రాగా, అక్కడి నుంచి నేరుగా ఇప్పల్‌ తండాకు చెందిన దారావత్‌ యాదమ్మ మిర్చి పంట క్షేత్రానికి వెళ్లారు. నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే పంట క్షేత్రంలో కూర్చొని రైతులను పిలిపించి వారితో మాట్లాడారు.  మిర్చికి ఎకరానికి రూ.లక్ష నుంచి  రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టామని, గతంలో వచ్చిన పంట దిగుబడి ఆదాయంతోపాటు వడ్డీవ్యాపారుల వద్ద అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి మిర్చి, మొక్కజొన్న సాగు చేశామన్నారు. అకాల వానతో అంతా  తుడిచిపెట్టుకుపోయిందని, ప్రభుత్వమే ఆదుకోవాలని చేతులు జోడించి మంత్రులను వేడుకున్నారు.


మనసున్న మారాజు సీఎం: మంత్రి ఎర్రబెల్లి



నర్సంపేట టౌన్‌/పరకాల/నడికూడ/రేగొండ, జనవరి 18 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనసున్న మారాజు.. రైతులకు ఆయన ఎప్పుడూ అండగా ఉంటారు.. వారి కష్టాలను తీరుస్తారు.. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పరకాల, నడికూడ, రేగొండ, నర్సంపేట మండలాల్లో ఆయన దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  పంట నష్టం జరిగిన బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మిర్చి రైతుల పరిస్థితి బాధాకరంగా ఉందన్నారు. చేతికొచ్చిన పంట నేలపాలు కావడం కన్నా అత్యంత దురదృష్టకరం మరొకటి ఉండదన్నారు. ఎరువులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ రైతులను నాశనం చేయాలని కేంద్రం  కుట్రపూరిత ఆలోచన చేస్తోందని, రాష్ట్రానికి ఒక్క రూపాయి సాయం చేసే పరిస్థితి లేదని అన్నారు.  ఉమ్మడి  జిల్లాలో 56 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే, ఒక్క నర్సంపేట నియోజకవర్గంలోనే 25వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఇక్కడి  పరిస్థితులను  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తమ దృష్టికి, తమ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. సీఎం మనసున్న మారాజని, ఆయన రైతు బిడ్డ అని రైతుల కష్టాలను తప్పకుండా తీరుస్తాడని భరోసా ఇచ్చారు.




మంత్రులకు నిరసన సెగ

నర్సంపేట టౌన్‌, జనవరి 18 : నర్సంపేట మం డలంలోని ఇప్పల్‌తండాలో పంటలను  సందర్శించడానికి వచ్చిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులకు రైతుల నుంచి నిరసన సెగ త గిలింది.  ఇప్పల్‌తండాలో అధికారులు, ప్రజాప్రతినిధులు పంట స్థలంలోనే ఓ ప్రదేశంలో వేదికను  ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం తర్వాత మంత్రులు ఇప్పల్‌తండాకు చేరుకోరుని బాదావత్‌ యాదమ్మ మిర్చి పంట క్షేత్రంలోకి వెళ్లి పరిశీలన చేసిన మం త్రులు, అక్కడే నేలపై కూర్చొని రైతులతో సమావేశమయ్యారు. సమావేశ స్థలానికి కొద్ది దూరంలో ఉన్న ఆకులతండా, ఇప్పల్‌తండా, ఇటుకాలపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఒక్క రైతు మిర్చి తో టనే మంత్రులు పరిశీలించడం ఏమిటని, తాము  ఉదయం నుంచి ఎదురుచూస్తున్నామని తమ పం టలను ఎందుకు పరిశీలించరని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రుల సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించారు. దీంతో వారు ప్రభుత్వానికి, మం త్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.


కన్నీటి విన్నపాలు


పరకాల/నడికూడ జనవరి 18: పరకాల నియోజకవర్గంలోని పరకాల, నడికూడ మండలాల్లో మంత్రులు, అ ధికారులు దెబ్బతిన్న మిర్చి, మొక్కజొన్న, కూరగాయల తోటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. మంత్రులు వెళ్లిన ప్రతీ చేను వద్ద రైతులు వారి కాళ్లమీద పడి సహా యం చేయాలని వేడుకున్నారు. పరకాల మండలం మ ల్లక్కపేటలో మిర్చిపంట నష్టపోయిన మహిళా రైతు మంత్రుల కాళ్ల మీద పడింది.

పరిహారం ఇప్పించాలని వేడుకుంది. అలాగే నడికూడ మండలకేంద్రంలో మంత్రుల సూచన మేరకు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు రైతుల వివరాలు తీసుకుంటుండగా ముకిడె అమృత అనే మహిళ రైతు కలెక్టర్‌ కాళ్లమీద పడింది. తమ మిర్చి పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని న్యాయం చేయాలని ప్రాధేయపడింది. ఇది అక్కడున్న వారిని కలిచివేసింది.

Updated Date - 2022-01-19T05:39:28+05:30 IST