కుంటను కబలిస్తున్నా పట్టించుకోరా?

ABN , First Publish Date - 2022-05-24T05:41:22+05:30 IST

ఓ వైపు చెరువులు, కుంటల రక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పుకుంటున్నా, మరోవైపు వాటి ఉనికే ప్రశ్నార్థకమవుతున్నది.

కుంటను కబలిస్తున్నా పట్టించుకోరా?
కుంటను ఆక్రమించి నిర్మించిన కాంపౌండ్‌వాల్‌

శివ్వంపేట మండలంలో  రూ. కోట్ల విలువ చేసే కుంట ఆక్రమణ 

అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు 

నర్సాపూర్‌/శివ్వంపేట, మే 23: ఓ వైపు చెరువులు, కుంటల రక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పుకుంటున్నా, మరోవైపు వాటి ఉనికే ప్రశ్నార్థకమవుతున్నది. ఈ దుస్థితి మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలంలో నెలకొన్నది. శివ్వంపేట మండలం గంగాయపల్లి పరిధిలో కోట్ల రూపాయల విలువ చేసే కుంటను ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తున్నా తమ దృష్టికి రాలేదని అధికారులు  చెప్పడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  


నాయకుల రియల్‌ దందా!

 గంగాయపల్లి పరిధిలోని దేశ్‌పాండే కుంట నాల్గు ఎకరాల మేర ఉంటుంది. ఈ కుంటను 2016-17 సంవత్సరంలో మిషన్‌కాకతీయలో భాగంగా స్వయంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పనులకు శిలాఫలకం వేయించి లక్షల రూపాయలతో మరమ్మతులు చేయించారు. అయితే ఇప్పుడు అదే కుంటను అధికార పార్టీకి నాయకులే ఆక్రమించి రియల్‌ వ్యాపారం సాగిస్తున్నా పట్టించుకునే వారు లేకపోవడం గమనార్హం. ఓ వేల కుంట లేక చెరువు పట్టాభూమిలో ఉన్నా వాటికి ఎటువంటి నష్టం చేయకూడదనే కఠిన నిబంధనలు ఉన్నాయి. కాని అవేవీ పట్టించుకోని అధికార పార్టీ నేతలే కుంటను ఆక్రమించి రియల్‌వ్యాపారం సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంగాయపల్లి ప్రాంతంలో ఎకరా భూమి కోటికి పైగా  ధర పలుకుతుండటంతో ఆక్రమణదారులు చెలరేగిపోతూ చెరువులు, కుంటలను కూడా ఆక్రమిస్తున్నారు. కుంట కట్టను కూల్చేసి లెవల్‌ చేసి ఆక్రమించినా అధికారుల దృష్టికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండటంతో తమకెందుకులే అన్నట్లు అధికారులు మిన్నకుంటున్నారా.. లేక వారితో కుమ్మక్కయ్యారా అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  కాగా ఆక్రమించిన కుంటను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని స్థానిక బీజేపీ నాయకులు హెచ్చరించడం గమనార్హం. అంతేకాకుండా జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొంటున్నారు.


 ఆక్రమించినట్టు తేలితే కఠిన చర్యలు: సునీత, నీటిపారుదల శాఖ ఏఈ

 గంగాయపల్లి కుంట ఆక్రమణ విషయం మా దృష్టికి రాలేదు. త్వరలో ఈ విషయమై విచారణ చేసి ఆక్రమణకు గురైనట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం.

 

Updated Date - 2022-05-24T05:41:22+05:30 IST