కలెక్టరు ఆదేశాలూ బేఖాతర్‌

ABN , First Publish Date - 2021-07-20T06:13:20+05:30 IST

అధికారుల కళ్లముందే పద్మాలయ చెరువు కబ్జాకు గురవుతోంది. అక్రమార్కులు చెరువు కట్టను ధ్వంసం చేసి దారి ఏర్పాటు చేశారు.

కలెక్టరు ఆదేశాలూ బేఖాతర్‌
కబ్జాదారులు ధ్వంసం చేసిన పద్మాలయ చెరువు కట్ట

పదెకరాల పద్మాలయ చెరువు భూమి ఆక్రమణ 

డంపింగ్‌ యార్డు చుట్టూ ప్రహారీ నిర్మాణం


శ్రీకాళహస్తి, జూలై 19: అధికారుల కళ్లముందే పద్మాలయ చెరువు కబ్జాకు గురవుతోంది. అక్రమార్కులు చెరువు కట్టను ధ్వంసం చేసి దారి ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్న డంపింగ్‌ యార్డు స్థలాన్నీ ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మించారు. చెరువు ఆక్రమణలు తొలగించాలన్న కలెక్టరు ఆదేశాలను ఒక్కరూ పట్టించుకోవడం లేదు. 

తొట్టంబేడు తహసీల్దారు కార్యాలయానికి కూతవేటు దూరంలో సర్వే నెం.28-3లో రెండెకరాల విస్తీర్ణంలో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేశారు. ఆ పక్కనే సర్వే నెం.12లో 20.77 ఎకరాల విస్తీర్ణంలో పద్మాలయ చెరువుంది. శ్రీకాళహస్తి సమీపంలోని చెన్నై రహదారి పక్కనే ఉండడంతో ఎకరా భూమి ధర రూ.6 కోట్లకుపైగా పలుకుతోంది. దీంతో అక్రమార్కుల కన్ను ఈ చెరువు, డంపింగ్‌యార్డుపై పడింది. ఈ కబ్జాలపై గతనెల 25న ‘పద్మాలయ చెరువును చెరబట్టారు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన కలెక్టరు హరినారాయణన్‌ ఆక్రమణలు తొలగించాలని అప్పట్లో తొట్టంబేడు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు.. తహసీల్దారు పరమేశ్వరస్వామి సర్వే జరిపి పద్మాలయ చెరువు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. 

చెరువు కట్టను ధ్వంసం చేసి.. 

కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని తొట్టంబేడు తహసీల్దారు హామీఇచ్చినా ఇప్పటి వరకు పురోగతి లేదు. దీంతో శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఏర్పడినప్పటి నుంచి ఉన్న డంపింగ్‌ యార్డు స్థలం చుట్టూ కబ్జాదారులు ప్రహరీ నిర్మించారు. ఆ పక్కనే ఉన్న పద్మాలయ చెరువుకు చెందిన పదెకరాల స్థలాన్ని ఆక్రమించి గోడ కట్టేశారు. చెరువు కట్టను ధ్వంసం చేసి మరీ ఈ గోడను నిర్మించడం విశేషం. దశాబ్ధాలుగా పురపాలక సంఘ అధీనంలో ఉన్న యార్డు భూమి ఆక్రమణలకు గురవడం వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉండవచ్చన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ కారణంగానే రూ.60 కోట్ల విలువైన భూములు కబ్జాకు గురైనా.. మున్సిపల్‌ అధికారులు, అటు తొట్టంబేడు రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై తహసీల్దారు పరమేశ్వరస్వామి స్పందిస్తూ.. చెరువు, డంపింగ్‌యార్డు భూముల ఆక్రమణలపై సర్వే జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 





Updated Date - 2021-07-20T06:13:20+05:30 IST