పుకార్లను నమ్మొద్దు: సీపీ అంజనీకుమార్‌

ABN , First Publish Date - 2020-03-29T10:43:15+05:30 IST

రెడ్‌జోన్‌ అనే ప్రాంతాలు లేవు... అనవసరమైన పుకార్లను నమ్మొద్దని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు.

పుకార్లను నమ్మొద్దు: సీపీ అంజనీకుమార్‌

బంజారాహిల్స్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రెడ్‌జోన్‌ అనే ప్రాంతాలు లేవు... అనవసరమైన పుకార్లను నమ్మొద్దని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. ఫిలింనగర్‌లో రెడ్‌ జోన్‌ గురించి ప్రస్తావించగా అన్ని పుకార్లేనని స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లో ఉన్న 200 మంది  అడ్డా కూలీ కుటుంబాలకు హర్ష అనే వ్యక్తి నిత్యావసర వస్తువులు బియ్యం, పప్పు, ఇతర సామగ్రిని శనివారం కమిషనర్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఇలాంటి సమయంలో కష్టంలో ఉన్న వాళ్లను అదుకునే వాళ్లు ఎంతో గొప్పవాళ్లన్నారు. కార్మికులు, అడ్డా కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకునేందుకు పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో శ్రమిస్తోందన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలన్నారు.


కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలంతా పోలీసులకు సహకరించాలని సూచించారు. ఇళ్లలో ఉంటూ సామాజిక దూరం పాటించాలన్నారు. రెడ్‌జోన్‌ పేరిట పుకార్లు జరుగుతున్నాయని, ఇలా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వాట్సప్‌ గ్రూప్‌ అడ్మిన్‌లు ఇలాంటి అవాస్తవాలు స్ర్పెడ్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ , ఏసీపీ కేఎస్‌ రావు, సీఐ కళింగరావు తదితరులు పాల్గొన్నారు. 


శానిటైజర్‌తో చేతులు శుభ్రపర్చుకున్నాకే

పేదలకు నిత్యావసర వస్తువులు సరఫరాకు వచ్చిన కమిషనర్‌ అంజనీకుమార్‌ మొదటగా ముఖానికి మాస్కు వేసుకున్నారు. అనంతరం బంజారాహిల్స్‌ పోలీసులు అందించిన శానిటైజర్‌తో చేతులు శుభ్ర పర్చుకున్నారు. ప్రతి ఒక్కరు విధిగా చేతులు ప్రతి గంటకోసారి సబ్బుతో కడుక్కోవాలని, కుదరకపోతే శానిటైజర్‌ ఉపయోగించాలని సూచించారు. 

Updated Date - 2020-03-29T10:43:15+05:30 IST