రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో నిర్మాత కోనేరు సత్యనారాయణ ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ తదనంతర పరిస్థితుల ప్రభావంతో ఈ చిత్రాన్ని రవితేజ చేయడం లేదని సోషల్, వెబ్ మీడియాలో వదంతులు వినిపించాయి. వాటిని అస్సలు నమ్మవద్దని నిర్మాత తెలిపారు. కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘లాక్డౌన్ వల్ల సినిమా పనులు ఆగిపోయాయి. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే ఘనంగా చిత్రాన్ని ప్రారంభిస్తాం. ‘రాక్షసుడు’ తర్వాత దర్శకుడు రమేశ్ వర్మ చక్కటి కథతో వచ్చారు. రవితేజ అభిమానులు సహా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కమర్షియల్ ఎంటర్టైనర్గా చిత్రాన్ని రూపొందిస్తాం’’ అన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.