Abn logo
Feb 22 2020 @ 02:13AM

‘కాశీంపై దుష్ర్పచారాన్ని నమ్మకండి’

విశ్వవిద్యాయంలో ‘ప్రొఫెసర్‌’గా రోజూ రిజిస్టర్‌లో సంతకాలు పెడుతూ, పాఠాలు బోధిస్తూ, నెలనెలా జీతం తీసుకున్నవాడు పరారీలో ఉన్నట్లు ఎలా అవుతుంది? 


ప్రియమైన తెలుగు ప్రజలారా..

నా భర్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌, డా.సి. కాశీంను జనవరి 18న పోలీసులు అరెస్టు చేసిన సంగతి మీకు తెలిసిందే. పద్దెనిమిది సంవత్సరాల మా సహచర్యంలో కాశీం ఎలాంటివాడు, రోజువారీ జీవితంలో ఏమేం చేస్తాడో అందరికంటే ఎక్కువగా తెలిసే అవకాశం నాకే ఉంది. కనుక కాశీంకు సంబంధించి మీడియాలో ప్రచారం అవుతున్న అవాస్తవాలను, వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యాలను మీ దృష్టికి తీసుకురావడం అవసరం అని భావించి ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.


లేనివాటిని సృష్టించి, అబద్ధాలను ప్రచారం చేసే క్రమం కాశీంను అరెస్టు చేసిన రోజే ప్రారంభమైంది. ఆ రోజు తెల్లవారుజామునే పోలీసులు తమవెంట రెండు గడ్డపారలతోపాటు ఒక పుస్తకాల కట్ట కూడా తెచ్చారు. తలుపు పగులగొట్టుకుని లోపలికి వచ్చిన తరువాత తాము తెచ్చిన పుస్తకాలను మా ఇంట్లో పెట్టి వీడియో తీశారు. ఆ తరువాత మూడు గంటలపాటు ప్రశ్నలు వేసి చివరికి కాశీంను అరెస్టు చేసి తీసుకెళ్లారు. తర్వాత కాశీం ఇంట్లో నిషేధిత పుస్తకాలు దొరికినట్లు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. పోలీసులు చెప్తున్న ఆ పుస్తకాలు తెలుగు సమాజానికి పరిచయం అక్కర్లేనివి. వీటిలో, తొలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ దాని నుండి ప్రేరణ పొంది రాసిన మొట్టమొదటి ప్రత్యేక తెలంగాణ కవిత్వ సంకలనం ‘జై తెలంగాణ విప్లవ ఢంకా’, తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతను తెలియజేసే ‘ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు– విద్రోహ రాజకీయాలు’ ‘హైదరాబాద్‌ స్వాతంత్య్ర సంరంభం’, ‘తెలంగాణ విద్యారంగం– ఉపాధ్యాయ ఉద్యమం’, ‘తెలంగాణ సవరించిన పెన్షన్‌ నియమాలు–1980’, ‘తెలంగాణలో దళిత బహుజనుల ప్రజారాజ్యం’, కాశీం రాసిన, తెలంగాణ సమాజంలో విస్తృత ప్రాచుర్యం పొంది మూడుసార్లు పునర్ముద్రణ పొందిన ‘నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్న’, మొత్తం బహుజన సమాజానికి చుక్కానిలా ఉన్న ‘బహుజన కెరటాలు’ పత్రిక, తెలంగాణ వాగ్గేయ సాహిత్యాన్ని శిఖరాయమానం చేసిన గోరటి వెంకన్న, అరుణోదయ విమలక్క రాసిన పాటల పుస్తకాలు, అభిజిత్‌ బెనర్జీ పుస్తకం ఉన్నాయి. పోలీసులు చాలా కీలకమని భావిస్తున్న, కాశీం రాసిన ‘అకడమిక్‌ అన్‌టచబిలిటీ’ పుస్తకం కూడా ఉన్నది. తన దళిత కులం కారణంగా ఎదుర్కొన్న అణచివేతను, విద్యారంగంలో అమలవుతున్న కుల వివక్షను విశ్లేషించే పుస్తకం ఇది. ఇది బ్రాహ్మణిజాన్ని నమ్మే రాజ్యానికీ, అందులో భాగమైన పోలీసులకీ కంటగింపు అయ్యింది. అందుకే అరెస్టు సమయంలో దాని గురించి పదే పదే మాట్లాడారు. ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి దగ్గర పుస్తకాలు ఉండటం ఎట్లా నేరమౌతుందో అర్థం కావడంలేదు. అందుకే కావచ్చు ‘ఈ పుస్తకాలు ఏరకంగా నిషేధితమైనవో’ చెప్పాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పోలీసులను అడిగారు. ప్రొఫెసర్‌ ముసుగులో మావోయిస్టు కార్యకలాపాలు సాగిస్తున్నాడనీ, మావోయిస్టు అగ్రనాయకులతో నిత్యం సంబంధాల్లో ఉంటున్నాడనీ, వాళ్లకు డబ్బు పంపిస్తున్నాడనీ ఆరోపణ చేస్తున్నారు. 2016 నుండి పరారీలో ఉన్నట్లు రాశారు. విశ్వవిద్యాయంలో ‘ప్రొఫెసర్‌’గా రోజూ రిజిస్టర్‌లో సంతకాలు పెడుతూ, పాఠాలు బోధిస్తూ, నెలనెలా జీతం తీసుకున్నవాడు పరారీలో ఉన్నట్లు ఎలా అవుతుంది? అని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ ఆరోపణలు తప్పు అని ఆ తరువాత పోలీసులు చేతులు దులిపేసుకోవచ్చుగానీ, ఇది కాశీం వ్యక్తిత్వాన్ని హత్యచేసినట్లు కాదా! నేనూ, మా పిల్లలు ఎదుర్కొనే అవమానాలు, మా మానసిక క్షోభను ఎవరు తీర్చగలరు?


పోలీసులు కాశీం కేసులో నన్ను కూడా చేర్చారు. దానికి తోడు బయట మీడియాలో ‘స్నేహ, మావోయిస్టు అగ్రనాయకుడు మల్లా రాజిరెడ్డి కూతురు’ అనే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. మా నాన్న మల్లా రాజిరెడ్డి అన్నది ఎంత నిజమో, నాకు ఊహ తెలియని నాడే నా తల్లిదండ్రులు నన్ను వదిలేసిపోయినదీ, ఆ తరువాత మా అమ్మతోగానీ, నాన్నతోగానీ నాకు ఎటువంటి సంబంధాలు లేనిదీ, నన్ను పెంచిన మా బంధువులకే కాదు, సమాజానికీ తెలుసు. నా తండ్రి మావోయిస్టు నాయకుడవునో కాదో తెలియదు, అయినా, ఆయన కూతురునైనంత మాత్రాన, కాశీంకు భార్యను అయినంత మాత్రాన నేనెట్లా నేరస్తురాలినవుతాను! ఈ విషయాన్ని కూడా ప్రధాన న్యాయమూర్తి పోలీసులతో అన్నారు. కాశీం ప్రధాన సంపాదకుడిగా ఉన్న ‘నడుస్తున్న తెంగాణ పత్రిక’ను కూడా నిషేధిత పుస్తకాల జాబితాలో చేర్చారు. 2010లో ప్రారంభమై ఐఎస్‌ఎస్‌ఎన్‌ నంబర్‌ కూడా ఉన్న ఈ పత్రికను నిషేధిత పుస్తకాల జాబితాలో చూపుతున్నారు. 


కాశీం తన విద్యార్థుల్ని మావోయిస్టులుగా మారుస్తున్నాడని విషప్రచారం చేస్తున్నారు. అదే లక్ష్యంగా పెట్టుకుంటే ఆయన విద్యార్థులు పోలీసులు, టీచర్లు, న్యాయవాదులు, పరిశోధకులు ఎట్లా అవుతున్నారు! కాశీం పరారీలో ఉంటే విద్యాబోధన ఎక్కడిది, విద్యార్థులు మావోయిస్టులుగా ఎలా తయారవుతారు? ‘అత్యాధునిక ఆయుధాలతో 150 మంది తీవ్రవాదులు రహస్యంగా ఉన్నారు. వారందరి భావజాలాన్ని కాశీం వ్యాప్తి చేస్తున్నారు’ అని పోలీసులు కౌంటర్‌ పిటీషన్‌లో పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి. కాశీం ప్రొఫెసర్‌ కాకముందు నుండే మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పనిచేస్తున్న కార్యకర్తగా, వక్తగా ప్రజలందరికీ తెలుసు. తెలుగు అకాడమీ కూడా ఆయన పుస్తకాలను, వ్యాసాలను ప్రచురించింది కదా! కాశీం రాసిన ‘ తెలంగాణ సాహిత్యం’ ఉస్మానియా విశ్వవిద్యాయ పీజీ తెలుగు కోర్సుకు పాఠ్యాంశంగా ఉంది. ఇవన్నీ కూడా రహస్యంగా పనిచేస్తున్నవారి భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం రాసినవేనా! 


తెలంగాణ ఉద్యమ సమయంలో కాశీం మీద హత్యాయత్నం జరిగింది. తల పగిలి పదహారు కుట్లు పడినా, చావు దాకా వెళ్లొచ్చినా ఉద్యమంలో వీడలేదు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణ దశలో ఉన్నది. కాశీంవంటి వారు ఈ సమాజానికి ఎంత అవసరమో విజ్ఞులైన మీ అందరికీ తెలుసు. పోలీసులు చేస్తున్న ప్రచారంలో ఇసుమంతైనా నిజం లేదు. ఆ దుష్ప్రచారాన్ని, దాని వెనుక ఉన్న తప్పుడు ఉద్దేశ్యాలను మీరంతా అర్థం చేసుకోవలసిందిగా విజ్ఞప్తి. 

మీ స్నేహలత

Advertisement
Advertisement
Advertisement