అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం..

ABN , First Publish Date - 2022-09-29T04:14:14+05:30 IST

ఉజ్వల భవిష్యత్‌ ఉన్న విద్యార్థినుల అకాల మరణం బాధాకరం. జరిగిన నష్టం పూడ్చలేనిది. మృతిచెందిన విద్యార్థినుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు. ఘటనకు బాధ్యులైనవారిపై చట్టపరంగా పూర్తిస్థాయిలో చర్యలకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చెప్పారు.

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం..
మృతిచెందిన విద్యార్థినులకు నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే బలరాం

విద్యార్థినుల తల్లిదండ్రులకు

 ఎమ్మెల్యే కరణం బలరాం భరోసా

వేటపాలెం(చీరాల), సెప్టెంబరు 28 : ఉజ్వల భవిష్యత్‌ ఉన్న విద్యార్థినుల అకాల మరణం బాధాకరం. జరిగిన నష్టం పూడ్చలేనిది. మృతిచెందిన విద్యార్థినుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు. ఘటనకు బాధ్యులైనవారిపై చట్టపరంగా పూర్తిస్థాయిలో చర్యలకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చెప్పారు. దేశాయిపేట పంచాయతీ పరిఽధిలోని సిలోన్‌కాలనీకి చెందిన సువర్ణకమల, కేపాల్‌ కాలనీకి చెందిన గీతాంజలి, వేటపాలెంకు చెందిన జయశ్రీలు స్థానిక శ్రీ అనుజ్ఞ హై స్కూలు(వేటపాలెం), శ్రీ వివేక ఇంగ్లీష్‌ మీడియం స్కూలు(రామనగరం)లో చదువుతున్నారు. స్కూలు యాజమాన్యం ఏర్పాటుచేసిన విహారయాత్రకు వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు ప్రమాదంలో నీటిలో కొట్టుకుపోయి మృతిచెందారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. ఈ నేపథ్యంలో మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బలరాం వారి ఇంటికి వెళ్లి విద్యార్థినుల మృతదేహాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబసభ్యులు, వారి బంధుమిత్రులు ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే బలరాంను కోరారు. స్కూలు నిర్వాహకులు విహారయాత్ర పేరుతో విద్యార్థులను తీసుకెళ్లారన్నారు. అల్లూరిసీతారామరాజు జిల్లా, చింతూరు మండలం సాకిలేరు వాగును సందర్శించిన సమయంలో నీటిప్రవాహంలో గల్లంతయ్యారని, ఆ తరువాత విగత జీవులయ్యారని కన్నీరుమున్నీరు అయ్యారు. స్కూలు యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే బలరాంకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరాం మాట్లాడుతూ బాధిత కుటుంబసభ్యులకు అండగా ఉంటామన్నారు. అలానే ఘటనలో యాజమాన్య నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేవిధంగా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట పలువురు అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


Updated Date - 2022-09-29T04:14:14+05:30 IST