Abn logo
Sep 11 2021 @ 18:45PM

రాజకీయ పదవులు ఆశించొద్దు: కేజ్రీవాల్ ఉద్బోధ

న్యూఢిల్లీ: రాజకీయ పదవులు ఆశించవద్దని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేషనల్ కౌన్సిల్ కొత్త సభ్యులకు ఆ పార్టీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్బోధ చేశారు. ఆప్ కొత్త సభ్యులతో శనివారంనాడు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, పదవులు ఆశించడం ఆప్‌లో ఉండదని, ప్రజా సంక్షేమం కోసమే అంతా పాటుపడాలని, పనిలోనే ఆనందాన్ని పొందాలని అన్నారు. ''మీ పనితీరు ఎలా ఉండాలంటే...మీరు పదవి అడగడం కాదు. పార్టీనే పదవి చేపట్టమని మిమ్మల్ని కోరేలా ఉండాలి. పదవి కోరారంటే ఆ పదవికి తగిన అర్హత మీకు లేనట్టే. ఆశాపరులైన వారు ఇతరులకు సేవ ఎలా చేస్తారు? పదవిపై మోజును ముందు వదిలించుకోవాలి'' అని కేజ్రీవాల్ అన్నారు.


పార్టీకి ఉన్న ఇమేజ్‌ను కేజ్రీవాల్ వివరిస్తూ, ప్రజలు బీజేపీతోనే, కాంగ్రెస్‌తోనో ఆప్‌ను పోల్చని రోజు తాను చూడాలని అనుకుంటున్నానని, ఆప్‌ను స్థాపించిన ఉద్దేశం కూడా అదేనని అన్నారు. పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త, ప్రతి నేత తమను తాము త్యాగం చేసుకునేందుకు సిద్ధ పడాలని కేజ్రీవాల్ దిశానిర్దేశం చేశారు.