మమ్మల్ని ‘యువరానర్’ అని పిలవకండి: చీఫ్ జస్టిస్ బోబ్డే!

ABN , First Publish Date - 2021-02-24T02:29:41+05:30 IST

తనను యువరానర్‌గా సంబోధించడం పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘యువరానర్ అని పిలుస్తున్నారంటే..ఓ అమెరికా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తినో లేదా మెజిస్ట్రేట్‌నో ఉద్దేశించి మాట్లాడుతున్నారని అర్థం’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

మమ్మల్ని ‘యువరానర్’ అని పిలవకండి: చీఫ్ జస్టిస్ బోబ్డే!

న్యూఢిల్లీ: తనను యువరానర్‌గా సంబోధించడం పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘యువరానర్ అని పిలుస్తున్నారంటే.. అమెరికా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తినో లేదా మెజిస్ట్రేట్‌నో ఉద్దేశించి మాట్లాడుతున్నారని అర్థం’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఓ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన న్యాయవిద్యార్థిని ఉద్దేశించి ఛీప్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. వెంటనే తప్పు సరిదిద్దుకున్న న్యాయవిద్యార్థి ఇకపై మిమ్మల్ని మై లార్డ్ అని సంబోధిస్తానని సమాధానమిచ్చారు. దీనిపై స్పందించిన బోబ్డే..‘సరైన పదాలను మాత్రమే వాడాలి’ అని విద్యార్థికి మరోసారి స్పష్టం చేశారు. దిగువ కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కేసులో సోమవారం నాడు చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.  


అయితే..యువరానర్ పదంపై ప్రధాన న్యాయమూర్తి అభ్యంతరం చెప్పడం ఇదే తొలిసారి కాదు. గత అక్టోబర్‌లో ఓ కేసు విచారణ సందర్భంగా కూడా ప్రధాన న్యాయమూర్తి ఇదే అభ్యంతరాన్ని లేవనెత్తారు. ‘మీరు అమెరికా సుప్రీం కోర్టులో ఉన్నామని అనుకుంటున్నారా..యువరానర్ అనే పదప్రయోగం అమెరికాలో ఉంటుంది. ఇక్కడి సంప్రదాయం ఇది కాదు’ అని చీఫ్ జస్టిస్ బోబ్డే వ్యాఖ్యానించారు. ‘న్యాయమూర్తులను ఇలాగే సంబోధించాలని సూచించే చట్టం ఏదీ లేకపోయినప్పటికీ ఇది కోర్టు సంప్రదాయానికి సంబంధించిన అంశమని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడి కోర్టుల సంప్రదాయాల ప్రకారమే నడుచుకోవాలి అని ఆయన అప్పట్లో సూచించారు. 


మరో ఆసక్తికర విషయం ఏంటంటే..2014లోనే సుప్రీం కోర్టు ఈ అంశంపై కీలక తీర్పు వెలువరించింది. న్యాయమూర్తులను తప్పనిసరిగా మైలార్డ్, యువర్ లార్డ్‌షిప్, యువర్ ఆనర్ అని పిలవాల్సిన అవసరం లేదంటూ జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ బోబ్డేలతో కూడిన ధర్మాసనం నాడు స్పష్టం చేసింది. ఈ పదాలను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌‌ను కొట్టేస్తూ న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పదాల వినియోగం తప్పనిసరి అని మేము ఎప్పుడూ అనలేదే. మమల్ని గౌరవంగా సంబోధిస్తే సరిపోతుందని మాత్రమే చెబుతున్నాం. మీరు సర్ అని పిలిచినా అది ఆమోదయోగ్యమే అని న్యాయమూర్తులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 


కాగా.. ఈ అంశానికి సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2006 కొన్ని విస్పష్ట మార్గదర్శకాలు జారీ చేసింది. ‘న్యాయస్థానాలను గౌరవించాల్సిన బాధ్యత లాయర్లపై ఉన్న నేపథ్యంలో.. సుప్రీం కోర్టు, హైకోర్టులో యువరానర్, లేదా ఆనరబుల్ కోర్టు అని పిలవాలని.. దిగువ కోర్టులు, లేదా ట్రిబ్యునళ్ల విషయంలో మాత్రం ‘సర్’ అని లేదా వారి వారి ప్రాంతీయ భాషల్లోగల తత్సమానమైన పదం ఏదైనా వినియోగించాలి’ అని బార్ కౌన్సిల్ అప్పట్లో తీర్మానించింది.

Updated Date - 2021-02-24T02:29:41+05:30 IST